ఫాంహౌస్ కోసమే రోడ్లేసుకున్నరు

ఫాంహౌస్ కోసమే రోడ్లేసుకున్నరు
  • రూ. 600 కోట్లతో ఫోర్ లేన్ రోడ్లు నిర్మించుకున్నరు: కోమటిరెడ్డి  
  • యాగాల బాధ్యతలు తీస్కుని ప్రశాంత్​రెడ్డి ఇతర రోడ్లను పట్టించుకోలే 
  • ప్రశ్నోత్తరాల్లో ఆర్​అండ్​బీ మంత్రి ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కోసమే రూ.600 కోట్లతో ఫోర్ లేన్ రోడ్లను వేశారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. పదేండ్లు రాష్ట్రంలో రోడ్లను ఎందుకు డెవలప్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్ల నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ ద్వారా ఢిల్లీలోని కేంద్ర  రోడ్లు, రవాణా, రహదారుల శాఖకు ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. ఇందులో 165 కి.మీ. పొడవు గల కరీంనగర్ (ఎన్​హెచ్​–563 వద్ద జంక్షన్), సిరిసిల్ల – కామారెడ్డి– ఎల్లారెడ్డి – పిట్లం (ఎన్ హెచ్ 161 వద్ద జంక్షన్) రోడ్డు ఒకటిగా ఉందన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఫాం హౌస్ కి నాలుగు లేన్ల రోడ్డు మాత్రం ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కంప్లీట్ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆర్ఆర్ఆర్ నిర్మిస్తున్నామని చెప్పారు. “గత ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి కేసీఆర్​కు దగ్గర వ్యక్తి అని పేరుంది.

ఫాంహౌస్​లో చండీయాగాలు, పూజల మీద దృష్టిపెట్టిన ఆయన రాష్ట్రంలో రోడ్లను మాత్రం డెవలప్ చేయలేదు. కేంద్ర మంత్రి గడ్కరీ దగ్గరకు వెళ్లి నేషనల్ హైవేల గురించి అడగలేదు. గత బీఆర్ఎస్ పాలకులకు రోడ్లపై అవగాహన లేదు. ఉప్పల్ ఫ్లై ఓవర్ ను ఆరేండ్లు ఖాళీగా పెట్టారు. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు పనులు పూర్తి కాకపోవడంతో గుంతల రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరిగాయి. గత పాలకులు ఎంతసేపూ పైసలు వచ్చే కాళేశ్వరం తప్ప రోడ్లను పట్టించుకోలేదు. కమీషన్లు తీసుకొని కూలిపోయే కాళేశ్వరాన్ని కట్టిండ్రు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి కమీషన్లు తీసుకున్నారు” అని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.

వారికి పోలీసులే బేడీలేస్తరు.. 

తాము హైదరాబాద్, విజయవాడ హైవేను 6 లేన్ గా మారుస్తున్నామని మంత్రి  చెప్పారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నేషనల్ హైవే పనులు స్టార్ట్ అయ్యాయని, డౌట్ ఉంటే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెళ్లి చూసుకోవచ్చు అని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ లో అందరూ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి అసలు దోషులు ఇద్దరు మాత్రం బేడీలు వేసుకోలేదు. బేడీలు వేసేందుకు పోలీసులు ఉన్నారు. మీరెందుకు వేసుకోవాలి? రేపో మాపో ఆ ఇద్దరికి పోలీసులే బేడీలు వేస్తారు. నేను కమీషన్లు తీసుకున్నట్లు సభలో నిరూపిస్తే చర్చిండానికి  సిద్ధం’’ అని మంత్రి సవాల్ చేశారు.

“హరీశ్ రావుకు దబాయించడం తప్ప ఏమీ తెల్వదు. కాళేశ్వరంలో ఎంత కమిషన్ తీసుకున్నారో ప్రజలకు తెలుసు. హరీశ్ మామచాటు అల్లుడు. ఆయన వెనక ఉండి రూ.10 వేల కోట్లు దోచుకున్న దొంగ. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తే నేను మాట్లాడతా.. ఈ పిల్లలతో నేను మాట్లాడేదేంది?’’ అని మంత్రి అన్నారు.  

 బీఆర్ఎస్ వాయిదా తీర్మానం తిరస్కరణ 

సభలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వగా, దానిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు అందరూ ఒక్కసారిగా పోడియం వైపు వెళ్లడంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకొని బీఆర్ఎస్ సభ్యులు సభా మర్యాద పాటించాలని కోరారు. 

హరీశ్ రావు కామెంట్లతో దుమారం 

అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ల అంశంపై మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యక్తిగత కామెంట్లు చేయడంతో దుమారం చెలరేగింది. హరీశ్ రావు కామెంట్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులంతా ఒకస్కారిగా లేచి అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది.  

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు స్పీకర్ పోడియం ముందు నిలబడి నినాదాలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కలగజేసుకుని సభ్యులు సభా మర్యాద పాటించాలని కోరినా వినిపించుకోలేదు. ఈ సందర్భంగా హరీశ్ రావు, మంత్రి కోమటిరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. హరీశ్ కాళేశ్వరం ప్రాజెక్టుతో కమీషన్లు దండుకున్నారని, ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారని మంత్రి ఆరోపించగా.. కోమటిరెడ్డి కమీషన్ల చిట్టా అంతా తన వద్ద ఉందని హరీశ్ అన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని సభలో వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సర్ది చెప్పారు. ఈ సందర్భంగా ఐలయ్య, హరీశ్ రావు పరస్పరం అభ్యంతరకర కామెంట్లు చేసుకోవడంతో వాటిని రికార్డుల నుంచి తొలగించినట్టు స్పీకర్ తెలిపారు.