బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం అనేక అప్రజాస్వామిక నిర్ణయాలు, సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో కొలువుదీరిన మంత్రులతో పాటు అనేక అధికార పదవులు అనుభవించిన నాయకులు, మేధావులు పెదవి విప్పలేదు ప్రజాస్వామ్యం పట్టపగలు ఖూనీ అవుతున్నదని మేధావులు, పత్రికలు, ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెట్టినప్పటికీ పాలక పక్షం నిస్సిగ్గుగా తన ఒంటెద్దు పోకడలతో ఫిరాయింపుల పరంపరను కొనసాగించింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాలను లేకుండా చేసి రాజరికపు వ్యవస్థను నిర్మాణం చేసిన కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ తీరు మారడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కల్వకుంట్ల వారి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ కావడమే కాక సామాజిక న్యాయం పూర్తిగా బొంద SLBC పెట్టబడింది. ఈ రాజ్యాంగమే అక్కరలేదని చెప్పిన వారు రాజ్యాంగం హక్కులు, విలువల గురించి మాట్లాడే నైతికత కూడా ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ గౌరవాన్ని, ప్రతిపక్షాల ప్రాముఖ్యతను సహచర క్యాబినెట్ మంత్రుల ఆత్మగౌరవాన్ని కూడా లెక్కచేయని వారు రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య హక్కులు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నందుకు అది శుభ పరిణామంగా భావించవచ్చు.
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాల ప్రజలను అణగదొక్కిన చీకటి రోజులవి. అనేక మంది దళితులను నిర్బంధాలకు గురిచేసి మరియమ్మ లాంటి వారిని లాకప్ డెత్ కు గురిచేసిన పాలన కల్వకుంట్ల వారిది. బంధువుల అక్రమ ఇసుక లారీలను అడ్డగించినందుకు నేరెళ్ల దళిత యువకులను చిత్రహింసలకు గురిచేసిన రోజులు ప్రజలు మర్చిపోలేరు.
తెలంగాణను వెనక్కి నడిపిన కేసీఆర్ పాలన
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి, ప్రజారోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రభుత్వ పాలనా వ్యవస్థను అవినీతిమయం చేసి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం తమ నిర్వాకం ఇప్పటికీ పుంఖాను పుంఖాలుగా పత్రికలలో వచ్చిన సమాచారం తెలంగాణ ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నది.
ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో దిగిపోయింది అన్న వస్త్రం అడగబోతే ఉన్న వస్త్రం లాక్కున్నట్లుగా నమ్మి అధికారం చేతికిస్తే అన్ని రంగాలను విధ్వంసం చేసి ఈ రాష్ట్రం ఇంకా 20 సంవత్సరాలు గడిచినాగాని బాగుపడదని ప్రజలు ఉద్యమకారులు మేధావులు తీవ్ర ఆందోళన పడుతున్న సమయం ఇది. వారి దోపిడీ, నిరంకుశత్వం, అణచివేత, కుల వివక్షత, బంధు ప్రేమ కుటుంబ పాలన సహించలేక ప్రజలు ఓటమి పాలు చేసినా వారి అహంకారంలో మార్పు రాలేదు. దోపిడీ చేసినప్పటికీ, ఓటమిపాలయినప్పటికీ ప్రజలకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. అధికారం కోల్పోయి పదవులు పోయి కనీసం ఒక ఐదు సంవత్సరాలు అయినా ఓపిక పట్టకుండా బజార్లకు ఎక్కడం తెలంగాణ ప్రజలు సహించలేరని ఇప్పటికైనా గుర్తించాలి. వారి ఆగడాలు ఆపాలి, లేకుంటే ఈ ప్రజాస్వామ్యంలో వారికి ఉనికి, అడ్రస్ లేకుండా పోతుందని గుర్తుంచుకోవాలి.
నిర్మాణాత్మకత లేని ప్రతిపక్షం ఉంటేమి, లేకుంటేమి?
ప్రభుత్వం చేసే ప్రతి పనికీ అడ్డుతగలడం ఓ రివాజుగా మార్చుకున్నారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీర్ణించుకోలేకపోతున్నారని అనిపిస్తున్నది. అయినదానికి, కాని దానికి అడ్డుతగలడమే తమ కర్తవ్యంగా మార్చుకున్నట్లున్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నది. ఇల్లు, పిల్లల చదువులు, వగైరా యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నప్పటికీ.. ఉబుసుపోని రాజకీయం చేయడం కేటీఆర్, హరీశ్లకే చెల్లింది. మంచిని మంచిగా చెప్పలేని ప్రతిపక్షం ఉన్నా ప్రయోజనం లేదనేది జనాభిప్రాయం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయడం వారి ఇంటావంటా లేదని పదినెలలుగా కనిపిస్తున్నదే. ఆనాడు ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రయత్నించిన బీఆర్ఎస్కు.. ఇవాళ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేసే అలవాటు ఎక్కడి నుంచి వస్తుంది?
- కూరపాటి వెంకట్ నారాయణ, కేయూ ప్రొఫెసర్(రిటైర్డ్)-