- ఓరుగల్లులో నాలాల ఆక్రమణలపై.. సర్కారు యూటర్న్!
- అప్పట్లో ఆక్రమణలు తొలగిస్తమన్న కేటీఆర్
- ఇప్పుడంత సీన్ లేదంటున్న ఎర్రబెల్లి
- గత పాలకుల మీదికి నెట్టిన మంత్రి
- పేదల పేరు చెప్పి పెద్దలకు మేలు చేసేలా వ్యవహారం
వరంగల్, వెలుగు: ఏటా వానాకాలంలో వరంగల్ సిటీ వరదల్లో మునగడానికి కారణమైన నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసింది. నగరంలో లక్షలాది మందికి ఇబ్బంది కలిగేలా బఫర్‍జోన్ ఏరియాలోని నిర్మాణాలను నెల రోజుల వ్యవధిలో కూల్చేస్తామన్న ప్రభుత్వ పెద్దల ప్రకటన ఉత్తదే అయ్యింది. అక్రమార్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని..ఒక్క అక్రమ నిర్మాణం లేకుండా చర్యలు తీసుకుని వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని జనాలకు ఇచ్చిన మాట గాలికొదిలేశారు. గ్రేటర్ వరంగల్‌లోని నాలాలు, చెరువుల అక్రమార్కులను తామేం చేయలేమని మూడేండ్ల తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. దీనిపై నీట మునిగిన కాలనీ జనాలు మండిపడుతున్నారు.
ఒక్క ఆక్రమణ లేకుండా చేస్తామన్న కేటీఆర్
వరంగల్‌లో 2020 ఆగస్టు రెండో మూడో వారంలో వానలకు వందలాది కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇండ్లు కూలాయి. ఉప్పు, పప్పు, సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయి. దీంతో మున్సిపల్ మంత్రి కేటీఆర్ సిటీలోని నయీంనగర్, సమ్మయ్యనగర్, వరంగల్‌లోని హంటర్‍రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఎన్‍ఐటీలో రెండు గంటల పాటు రివ్యూ చేశారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలే సమస్యకు ప్రధాన కారణమని, వాటిని తొలగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఇబ్బందులు లేకుండా సర్క్యులర్ తెస్తామన్నారు. అక్రమ నిర్మాణాల్లో పేదలుంటే డబుల్ బెడ్‍రూం ఇండ్లల్లో అవకాశం కల్పిస్తామని, రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్లైతే నష్టపరిహారం చెల్లించి నాలాల బఫర్‍జోన్ పరిధిలో ఏ ఒక్క నిర్మాణం లేకుండా తొలగిస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్లో 15 నాలాలుండగా.. నయీంనగర్, బొందివాగు ముఖ్యమైనవి, వీటి పరిధి 25 కిలోమీటర్ల వరకు ఉండగా రెండువైపులా ఆక్రమణల తొలగింపు కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీ వేశారు.
ఇప్పుడు సాధ్యం కాదంటున్న ఎర్రబెల్లి
‘వరంగల్‌లో నాలాల మీద, చెరువు శిఖాల మీద ఇండ్లు కట్టుకున్నరు. కొంతమంది దొంగ కాగితాలు సృష్టించుకున్నారు. ఎవ్వరివీ తీసేసే పరిస్థితి లేదు’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు ఈ మధ్యే కామెంట్స్చేశారు. వరంగల్ ను వరదలు అతలకుతలం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులతో కలిసి మంత్రి శుక్రవారం సిటీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘వరంగల్, హనుమకొండ పరిధిలో నాలాలు, చెరువు శిఖం భూముల్లో 100 నుంచి 1000 అక్రమ నిర్మాణాలున్నాయి. భద్రకాళి చెరువు శిఖంలో ఓ వెయ్యి ఇండ్లు ఉన్నయ్. కాగితాలు సృష్టించుకుని 30 ఏండ్ల కింది నుంచి ఉంటున్నరు. వీటిని తొలగిస్తే కోర్టు పరంగా ఇబ్బందులు తప్పవు’ అని అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‍లో వరంగల్, హనుమకొండ జిల్లాల వరద నష్టంపై నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ ‘గ్రేటర్ వరంగల్‌లో గత ప్రభుత్వాల హయంలోనే నాలాలు, చెరువు శిఖాలు కబ్జా అయినయ్. అక్రమార్కులు కాగితాలు సృష్టించి ఇండ్లుకడితే వాటికి అప్పటి ప్రభుత్వాలు పట్టాలిచ్చినయ్. ఆక్రమణదారులపై చర్యలు తీసుకునే క్రమంలో కోర్టుకు వెళ్లడంతో ఆగాల్సి వస్తోంది’ అని తేల్చి చెప్పారు.
లీడర్ల డబుల్ గేమ్
వరదల సమయంలో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఆక్రమణలు తొలగించేలా చూస్తామని లోకల్ లీడర్లు మంత్రి కేటీఆర్‌కు మాటిచ్చారు. అప్పటి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్‍గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో పనిచేసిన టాస్క్‌ఫోర్స్ మొదట్లో యాక్టివ్‍గానే పనిచేసింది. రాను రాను ఆక్రమణదారుల్లో చిన్నవారినే లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అధికారుల ముందు సపోర్ట్ చేసినట్టు మాట్లాడిన అధికార పార్టీ లీడర్లు వెనకాల రాజకీయం నడిపారు. నాలాల వెంట నోటీసులుందుకున్న వారు కోర్టు గడప తొక్కేలా సలహా ఇచ్చారు. దీంతో స్టే వచ్చింది. కోర్టు సమస్యలు వస్తే సర్క్యులర్ తీసుకువస్తామని, అడ్వకేట్‍ను పెట్టి ఆక్రమణలు తొలగిస్తామన్న చెప్పిన కేటీఆర్ హామీ తర్వాత నెరవేరలేదు. నాలాలకు ఇరువైపులా రిటర్నింగ్ వాల్ కట్టలేదు. వరంగల్ బొందివాగు ఎఫెక్ట్‌తో ఏటా పదుల సంఖ్యలో కాలనీలు మునుగుతుండగా వరద పోయేలా ఔట్ ఫ్లో నిర్మాణాలు చేపడుతామన్న హామీ సైతం అలాగే ఉండిపోయింది.
అక్రమార్కులకు సపోర్ట్
వరంగల్ చుట్టూ ఒకప్పుడు చెరువులు, కుంటలు, శిఖం భూములు 275 వరకు ఉండేవి. ఇప్పడవి 45 వరకే ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. నాలాలు, చెరువులను అక్రమార్కులు దొంగ కాగితాలతో ఆక్రమించుకున్నారని మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారు. వాటిని తొలగించే క్రమంలో సపోర్ట్ చేస్తామన్న లోకల్లీడర్లు మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన మాటను తప్పారు. భద్రకాళి, పద్మాక్షి చెరువుల చూట్టూరా పేదల ఇండ్లు ఉన్నాయనే సాకుతో.. కొన్నేండ్లలో లీడర్ల అండదండలతో పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడిన వ్యాపారులను వదిలేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలున్నాయి.భద్రకాళి బండ్ పరిసరాలలో లీడర్ల అనుచరులే కోట్లాది రూపాయల భూములను కబ్జా చేసినట్లు తెలుస్తోంది. అలాంటి వారందరిని కాపాడేందుకే.. 50 నుంచి 60 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించు కున్న పేదలను ముందుపెడుతున్నారనే విమర్శలున్నాయి. 2020 కంటే ఇప్పుడు ఎక్కువ నష్టం జరిగినా మంత్రి కేటీఆర్ రాకపోవడంపై జనాలు ఆగ్రహంగా ఉన్నారు..