- గొప్పల కోసం కట్టిన భవనాలు ఇప్పుడు అక్కరరావట్లే
- ఆరేండ్లుగా క్యాంప్ ఆఫీస్‌లో అడుగే పెట్టని ఎమ్మెల్యే కేసీఆర్
- నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారిన మహతి’ ఆడిటోరియం
- ఊరికి దూరంగా బస్టాండ్.. అడుగు పెట్టని ప్రయాణికులు
- కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాని గజ్వేల్ రింగ్ రోడ్డు
హైదరాబాద్, వెలుగు ప్రత్యేక ప్రతినిధి: మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్హయాంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బిల్డింగ్‌లన్నీ నిరుపయోగంగా మారాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మొదలుకొని బస్టాండ్ వరకు ప్రతి నిర్మాణం అలంకారప్రాయంగా తయారైంది. కేసీఆర్ పదేండ్లపాటు సీఎంగా ఉండడంతో అడ్డగోలు నిధులు తెచ్చి, అవసరం ఉన్నా లేకున్నా గొప్పల కోసం మూడు ఆడిటోరియాలు కట్టించారు. వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపయోగపడడం లేదు.
క్యాంప్ ఆఫీస్‌లో అడుగే పెట్టని కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మాదిరిగానే గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కూడా 2017 ఫిబ్రవరి 3న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ. కోటి ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ పూర్తయ్యేసరికి రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సుమారు వెయ్యి గజాల స్థలంలో, ఆధునిక హంగులతో నిర్మించిన ఈ బిల్డింగ్ ఆరేండ్ల కిందే పూర్తయింది.
నాటి నుంచి నేటి వరకు సీఎంగా గానీ, గజ్వేల్ ఎమ్మెల్యేగానీ కేసీఆర్ ఏనాడూ ఈ క్యాంప్ ఆఫీస్‌కు రాలేదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయినా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆరే గెలిచారు. అప్పటి నుంచి గజ్వేల్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఫామ్‌హౌజ్‌లో ఉంటున్నారు తప్పితే ఒక్కసారి కూడా క్యాంప్ ఆఫీస్‌లో అడుగుపెట్టలేదు. ‘మా సారు (కేసీఆర్) ఎన్నడూ ఇక్కడకు రాలేదు’ అని భవనం బాగోగులు చూస్తున్న ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు.
నిరుపయోగంగా ఆడిటోరియాలు
గజ్వేల్‌లో సుమారు రూ. 22 కోట్లు ఖర్చు చేసి ‘మహతి’ పేరుతో భారీ ఆడిటోరియం నిర్మించారు. గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ కమిటీ (గడా), తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆడిటోరియం 2019 డిసెంబర్ 11న ప్రారంభమైంది. ఇందులో సుమారు 1,400 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ దీని నిర్వహణను ఎవరికి అప్పగించాలన్న విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఆడిటోరియం ప్రజలకు ఉపయోగపడడం లేదు.
Also Read :- అధ్యక్ష పోస్టులకు పోటాపోటీ
మరో వైపు బాలికల డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ బాలుర డిగ్రీ కాలేజీ ఆవరణలో రూ. 20 కోట్లు ఖర్చు చేసి మరో రెండు ఆడిటోరియాలను నిర్మించారు. 2017లోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతో ఈ రెండూ నిరుపయోగంగానే మారాయి. బాలుర డిగ్రీ కాలేజీ ఆవరణలో అసంపూర్తిగా ఉన్న ఆడిటోరియం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. అలాగే బాలుర డిగ్రీ కాలేజీ ఆవరణలో రూ. కోటితో నిర్మించిన ‘క్యాంటీన్’ సైతం ఇప్పటివరకు ఉపయోగంలోకి రాలేదు. ఆఫీసర్లు స్పందించి ఆడిటోరియంలను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని స్టూడెంట్స్, స్టాఫ్ కోరుతున్నారు.
రింగ్ రోడ్డు పూర్తయ్యేదెన్నడో ?
హైదరాబాద్ రింగ్ రోడ్డు తరహాలో గజ్వేల్ చుట్టూ రోడ్డు నిర్మించేందుకు గతంలో కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా రూ. 300 కోట్లు ఖర్చు చేసి పనులు ప్రారంభించారు. కానీ మార్గమధ్యలో ఓ రెండు చోట్ల పనులు నిలిచిపోవడంతో ఆరేండ్లుగా రోడ్డు అసంపూర్తిగానే ఉంది. దీంతో ఇప్పటివరకు పెట్టిన కోట్ల రూపాయలు నిరుపయోగమయ్యాయని ప్రజలు ఆభిప్రాయపడ్తున్నారు.
ఊరికి దూరంగా మోడ్రన్ బస్టాండ్
గజ్వేల్ పట్టణం మధ్యలో ఉన్న బస్టాండ్‌ను నాలుగేండ్ల కింద కూల్చి వేసి ఆ స్థలంలో హాస్పిటల్ కట్టారు. తర్వాత గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో రూ. 5 కోట్లు ఖర్చు చేసి ‘మోడ్రన్ బస్టాండ్’ నిర్మించారు. 2023 అక్టోబర్ 8న ఈ బస్టాండ్‌ను ప్రారంభించినా ఇప్పటివరకు ఉపయోగంలోకి రాలేదు. గ్రామానికి దూరంగా ఉండటంతో ప్రయాణికులెవరూ ఈ బస్టాండ్‌కు వెళ్లడం లేదు. ప్రస్తుతం పట్టణంలోని ఓ మెయిన్ సెంటరే బస్టాండ్‌గా మారింది.