- తాజాగా నిర్మాణ ఖర్చు రూ.3,779 కోట్లుగా చూపిన బీఆర్‍ఎస్
- సెంట్రల్ జైలు భూముల్లో 24 అంతస్తుల సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
- రూ.1100 కోట్లు కేటాయించిన బీఆర్ఎస్ సర్కారు
- జైలు భూములు కుదువపెట్టి రూ.1150 కోట్ల అప్పు
- ఎల్‍అండ్‍టీ కంపెనీకి కాంట్రాక్ట్ పనులు
- హాస్పిటల్ నిర్మాణ ఖర్చుపై ఆఫీసర్లు, జనాల్లో అయోమయం
వరంగల్, వెలుగు : వందల ఏండ్ల చరిత్ర కలిగిన వరంగల్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలును కూల్చి.. ఆ స్థలంలో కడుతున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి అసలు ఎంత ఖర్చు చేస్తున్నారు? హాస్పిటల్ కట్టే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు చెప్పిన మాటలు, ఎస్టిమేషన్, బడ్జెట్ కేటాయింపులకు.. కొత్త ప్రభుత్వం వచ్చాక దానికయ్యే ఖర్చు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చూపిన లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. ఇదే ఇప్పుడు ఆఫీసర్లను, జనాలను అయోమయానికి గురి చేస్తోంది.
2021లో జైల్ కూలగొట్టి.. హాస్పిటల్ నిర్మాణం
వరంగల్ సెంట్రల్ జైల్‍ను ఆగమేఘాల మీద కూలగొట్టించిన మాజీ సీఎం కేసీఆర్..2021 జూన్ 21వ తేదీన హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎంజీఎం, ఐ హాస్పిటల్ నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు మొత్తం 215.35 ఎకరాల్లో గొప్ప హెల్త్ సెంటర్ అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. కూల్చిన సెంట్రల్ జైల్ స్థలం 56 నుంచి 59 ఎకరాలుండగా..అందులోని15 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ కడతామన్నారు. మొదట్లో 33 అంతస్తులు అనుకున్నప్పటికీ.. తర్వాత 24 అంతస్తులకు తగ్గించారు. పేషెంట్లకు అత్యుత్తమ ట్రీట్‍మెంట్ ఇచ్చేందుకుగాను ఈ హాస్పిటల్లో 2100 బెడ్లు అందుబాటులో ఉంటాయన్నారు.
రూ.1,116 కోట్లలో దేనికెంతో చెప్పిన్రు
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‍కు రూ.1000 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ మొదట్లో ప్రకటించారు. తర్వాత పలు సందర్భాల్లో రూ.1100 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. బిల్డింగ్ డిజైన్లు రిలీజ్ చేశారు. టెండర్లు పిలిచారు. చివరకు ఎల్ అండ్ టీ సంస్థకు పనులు అప్పగించారు. 2021 డిసెంబర్ 4న.. రూ.1100 కోట్లకు పాలనాపరమైన అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, జీఓ 158 విడుదల చేశారు. ఇందులో సివిల్ వర్క్స్కోసం రూ.509 కోట్లు, వాటర్, శానిటేషన్ కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనులకు రూ.182.18 కోట్లు, వైద్య పరికరాలకు రూ.105 కోట్లు, వీటికి అనుబంధంగా చేసే పనుల కోసం రూ.54.28 కోట్లు, లీగల్ వర్క్స్, ట్యాక్సుల కోసం రూ.229.18 కోట్లకు పర్మిషన్ ఇచ్చారు. టీఎస్‍ఎంఎస్‍ఐడీసీ, డీఎంఈ ద్వారా వెంటనే పనులు చేపట్టాలని జీఓలో ఆదేశించారు. నాటినుంచి హాస్పిటల్ కన్‍స్ట్రక్షన్ పనులు చురుగ్గా నడుస్తున్నాయి.
అప్పులపై ..అసెంబ్లీలో మాట మార్చిన హరీశ్‌రావు
‘అప్పు తెచ్చేది మేమే.. కట్టేది మేమే’ అంటూ మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం నిర్వహించిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతూ ‘వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను ప్రభుత్వ అప్పులుగా ఎలా చూస్తారు. కార్పొరేషన్లు తీసుకునే అప్పులకు ప్రభుత్వం కేవలం గ్యారంటీ మాత్రమే ఇస్తుంది’ అని అన్నారు.
కాగా, వరంగల్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తీసుకున్న రూ.1150 కోట్ల లోన్ కూడా స్టేట్సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీదే తీసుకోవడం గమనార్హం. కాగా, ఇదే అసెంబ్లీలో వరంగల్‍కు చెందిన మంత్రి కొండా సురేఖ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసమే అప్పులు తీసుకొచ్చిమరీ సెంట్రల్ జైల్, సెక్రటేరియట్ వంటి కట్టడాలను కూల్చివేశారని మండిపడ్డారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు, సురేఖ మధ్య వాడీవేడి చర్చ నడిసింది.
భూములు తాకట్టుపెట్టి రూ.1150 కోట్ల అప్పు
ఓరుగల్లులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఆపై సీక్రెట్‍గా సెంట్రల్ జైల్ భూములను కుదువ పెట్టారు. మహారాష్ట్రలోని పూణే, శివాజీ నగర్‍లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‍లో 57 ఎకరాల స్థలాన్ని తాకట్టుపెట్టి 2022 సెప్టెంబర్ 30న రూ.1150 కోట్ల అప్పు తెచ్చారు. ఈ లెక్కన ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కంటే మరో రూ.34 కోట్లు ఎక్కువే తెచ్చారు. అప్పటిదాకా హాస్పిటల్‍కు సంబంధించి ప్రతి అంశాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన ప్రభుత్వం..భూములను కుదువపెట్టిన సంగతిని దాచిపెట్టింది. రాష్ట్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ రమేశ్ రెడ్డి పేరుతో జైల్ స్థలాన్ని మార్టిగేజ్ చేసిన తతంగాన్ని పలువురు రికార్డులతో సహా బయటపెట్టారు. ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో అప్పు విషయాన్ని జర్నలిస్టులు హరీశ్‌రావు, కేటీఆర్ దృష్టికి తేగా, ‘అందులో తప్పేముంది. తెచ్చింది మేమే. రేపు కట్టేది మేమే’ అంటూ సమాధానమిచ్చారు.
ఖర్చు రూ.1,116 కాదు.. రూ.3,779 కోట్లు అంట!
కేసీఆర్ సర్కారు పదేండ్లలో చేసిన అప్పులను శాఖలవారీగా శ్వేతపత్రం రూపంలో కాంగ్రెస్ సర్కారు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో తమ ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆస్తులు కూడబెట్టినట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో చెప్పారు. బీఆర్‍ఎస్ ప్రభుత్వంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులను ఓ లిస్టుగా రూపొందించి జనాల ముందు పెట్టారు.
ఇందులో వరంగల్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.3,779 కోట్లుగా చూపారు. గతంలో రూ.1,116 కోట్లు కేటాయించిన సమయంలోనే ఏయే పనులు, మెషినరీకి ఎంతవుతుందో వివరంగా చెప్పిన అప్పటి ప్రభుత్వం ఇప్పుడు మరో రెండింతలు ఎక్కువ పెంచి చూపడంతో ఆఫీసర్లు, పబ్లిక్అయోమయంలో పడ్డారు. ఈ పనులు చూస్తున్న ఆఫీసర్లను ఈ విషయమై ప్రశ్నిస్తే..రూ.3,779 కోట్ల ఖర్చు తప్పన్నారు. ఆ గణాంకాలతో తమకు సంబంధం లేదన్నారు.