కడెం ఆయకట్టుకు నీళ్లివ్వండి

కడెం ఆయకట్టుకు నీళ్లివ్వండి

శ్రీరాంసాగర్‌‌‌‌ బ్యారేజీ నిర్మాణంలో ఉన్నప్పుడే, కాకతీయ కాలువకు 1970లోనే జగిత్యాల దగ్గర మేడిపల్లి వరకు నీరిచ్చారు. అప్పటికి సరస్వతి కాలువ నిర్మాణం అతీగతీ లేదు. సరస్వతి కాలువ నిర్మాణం 1981లో  ప్రారంభమైంది. 1984లో సరస్వతి కాలువ 20 కి.మీ వరకు నిర్మించి నిర్మల్‌‌‌‌ ఆయకట్టుకు నీరిచ్చారు. 1987లో సరస్వతి నిర్మాణం పూర్తయి కడెంకు నీరందించారు. కాకతీయ కాలువకు సరస్వతి కంటే 17 సంవత్సరాల ముందే నీరిచ్చారు. శ్రీరాంసాగర్‌‌‌‌కు దక్షిణం వైపు కాకతీయ, మొదట దిగువన లక్ష్మి కాలువ ఒక్కటే ఉండటంతో, ఎగువన నిజామాబాద్‌‌‌‌ జిల్లాకు అన్యాయం జరిగిందని తొమ్మిది ఎత్తిపోతలతో లక్ష ఎకరాలకు పైగానే సాగునీటి సదుపాయం కల్పించారు. ఆదిలాబాద్‌‌‌‌ వైపు సరస్వతి కాలువ తప్ప ఎక్కడా మరో కాలువ ఎందుకు లేదు? ఎత్తిపోతలు లేకుండానే సంపూర్ణ గ్రావిటీతో ఆదిలాబాద్‌‌‌‌లో ఎక్కడికైనా నీరివ్వవచ్చు. 

గ్రావిటీ అవకాశం లేని చోట డిమాండ్‌‌‌‌ మేరకు అనేకచోట్ల ఎత్తిపోతలు చేపట్టారు. కడెం ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్‌‌‌‌కు మధ్య 391 ఫీట్ల వాలున్నప్పుడు కాకతీయ కాలువకు సమాంతరంగా కడెం కాలువను 1010 ఫీట్ల ఎత్తున మరో కాలువను కడెంకు ఎందుకు నిర్మించడంలేదు? ఇది ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాకు జరిగిన ఒక దారుణ వివక్ష. 

ప్రజాపాలనలో రైతులను ఆదుకోవాలి

చెన్నూర్‌‌‌‌ ప్రాణహిత వరకు చేరవలసిన నెహ్రూ శ్రీరాంసాగర్‌‌‌‌ ఉత్తర కాలువ ప్రణాళిక కడెం కాలువ 77 కి.మీ. వద్ద మొదటి దశగా నిలిచిపోయింది. 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌‌‌‌ మందాకిని కాలువ పేరిట సోమగూడెం బెల్లంపల్లి మధ్య జాతీయ రహదారి పక్కన శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్‌‌‌‌ మందాకిని కాలువ, నెహ్రూ గోదావరి నార్త్‌‌‌‌  కెనాల్‌‌‌‌ ప్రాజెక్టు వేరుకాదు, రెండూ ఒక్కటే. ఈ ఉత్తర కాలువ కాంటూర్‌‌‌‌ కాలువ. కాంటూర్‌‌‌‌ లెవల్స్‌‌‌‌ను బట్టి ఎలాంటి ఎత్తిపోతలు అవసరం లేకుండా, నీరు పల్లమెరుగు గ్రావిటీ పద్ధతిలో, హాజీపూర్‌‌‌‌ పెద్దంపేట వరకు నేడున్న కాలువ, కాసిపేట మీదుగా బెల్లంపెల్లి పక్కనుంచి నెన్నల మండలం గుండా బీమారం చెన్నూర్‌‌‌‌ ప్రాణహిత వరకు నిర్మించడం దీని ప్రణాళిక.  నెహ్రూ ఎన్టీఆర్‌‌‌‌ల ప్రణాళికలు నేటికీ అమలు కాలేదు. ఎన్టీఆర్‌‌‌‌ మందాకిని శంకుస్థాపన శిలాఫలకం శిథిలమై కనుమరుగైంది. ఉద్యమంలో కేసీఆర్‌‌‌‌ మందాకినితో పాటు చేసిన వాగ్దానాలన్నీ పాలనలో నీటి మూటలయ్యాయి. కేసీఆర్‌‌‌‌ పాలనలో ఆదిలాబాద్‌‌‌‌ పెనంమీది నుంచి పొయ్యిలో పడింది. ఫలితంగా కడెం ఆయకట్టు 68 వేల ఎకరాలు, మొదటి నుంచి చివరివరకు నీరు ఏనాడూ అందలేదు. ప్రజాపాలన పునరుద్ధరణతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డి ఈ అన్యాయాన్ని సరిదిద్ది 76 టీఎంసీలున్న శ్రీరాంసాగర్‌‌‌‌ నుండి కడెం ఆయకట్టుకు 5 టీఎంసీల నీరిచ్చి 68 వేల ఎకరాల రైతులను ఆదుకోవాలి.

కడెం ప్రాజెక్టు ఉత్తర కాలువ ఏది? 

కడెంకు నీరందించడానికి నిర్మించిన కాలువతో గతంలో ఇంతో అంతో నీరు చేరేది. కేసీఆర్​సర్కార్‌‌‌‌ హయాంలో చుక్కనీరు రాలే. ఇక రేవంత్‌‌‌‌ రెడ్డి పాలనలోనైనా కడెం ఆయకట్టుకు నీరందేలా చూడాలి.  నెహ్రూ ప్రాజెక్టు డిజైన్‌‌‌‌ ప్రకారం శ్రీరాంసాగర్‌‌‌‌ నుంచి కడెం మీదుగా చెన్నూర్‌‌‌‌ వరకు వెళ్లవలసిన గోదావరి నార్త్‌‌‌‌ కెనాల్‌‌‌‌ ప్రాజెక్టు లేదా ఉత్తర కాలువ మొదటి దశ 77 కి.మీ.వద్దనే నిలిచిపోయింది. కడెం ప్రాజెక్టు శ్రీరాంసాగర్‌‌‌‌ కంటే ముందే 1948లో నాటి హైదరాబాద్‌‌‌‌ ప్రభుత్వం చేపట్టింది. నిజాం కాలంలో లాయక్‌‌‌‌ అలి అనే ఇంజినీర్‌‌‌‌ డిజైన్‌‌‌‌ చేశారు. 

నెహ్రూ ఉత్తర కాలువ ప్రణాళిక ఆచరణలో నీరుగారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ కోసం డిజైన్‌‌‌‌ చేసిన ఉత్తర కాలువను, ఏ ప్రభుత్వాలు కొలువుదీరినా ఆచరణలో గాలికి వదిలేశాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌లో గోదావరి తీరం పొడవునా తరతరాలుగా పాతుకుపోయిన అణచివేతను వెనుకబాటుతనాన్ని అంతమొందించే సమగ్ర అభివృద్దే  ఈ కాలువ లక్ష్యం. ఆధునిక దేవాలయాలనే సాగునీటి కాలువల ద్వారా రైతుల జీవితాల్లో  పూర్తి వెలుగులు నింపడం శ్రీరాంసాగర్‌‌‌‌ ఉత్తర కాలువ ప్రణాళిక లక్ష్యం నేటికీ నెరవేరలేదు.

నైనాల గోవర్ధన్‌‌‌‌,సామాజిక వేత్త