రాళ్లు రప్పలకు రైతుబంధు 26 వేల500 కోట్లు

రాళ్లు రప్పలకు రైతుబంధు 26 వేల500 కోట్లు
  • పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేలకూ పెట్టుబడి సాయం 
  • ప్రతి సీజన్​లో దాదాపు 42 లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలిచ్చిన గత సర్కార్ 
  • సాగు భూములకు అందాల్సిన పెట్టుబడి సాయం వ్యవసాయేతర భూములకు 
  • ఏటా దాదాపు రూ.4,416 కోట్ల చొప్పున పక్కదారి
  • ధరణిలోని తప్పుల తడక వివరాల ఆధారంగానే పంపిణీ  
  • ఇటీవల కేబినెట్​కు వ్యవసాయ శాఖ నివేదిక

హైదరాబాద్, వెలుగు: రైతుబంధు పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ రూ. వేల కోట్లు దుబారా చేసింది. రైతులను ఆదుకుని, ఆత్మహత్యలు నివారించేందుకు సాగుభూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా సాగులో లేని బంజరు భూములకు, రాళ్లు రప్పలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గ్రామాలకు, కాలనీలకు, రోడ్లకు, వివిధ ప్రాజెక్టుల కింద గతంలో సేకరించిన భూములకు కూడా  రైతుబంధు కింద కోట్లకు కోట్లు చెల్లించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవల వ్యవసాయ శాఖతో  ఫీల్డ్ సర్వే చేయించి నివేదిక తెప్పించుకోగా దాదాపు రూ.26,500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేలింది. ప్రతి సీజన్​లో 42 లక్షల ఎకరాలకు పైగా నాన్​అగ్రికల్చర్ ల్యాండ్స్​కు పెట్టుబడి సాయం అందినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు లెక్కలు తేల్చాయి. 

రైతుబంధు స్కీంను 2018 ఖరీఫ్​లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. సీజన్​ల వారీగా సాగైన భూములకు మాత్రమే రైతుబంధు సాయం ఉంటుందని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రతి సీజన్​లో అగ్రికల్చర్ ఆఫీసర్లతో సర్వే చేయించి, ఆ వివరాల ప్రకారమే రైతుబంధు పైసలు వేస్తామని చెప్పారు. కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ల రిపోర్టులతో సంబంధం లేకుండా రైతుబంధు జమ చేస్తూ వచ్చారు. మొదట్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8 వేలు ఇచ్చారు. ఆ తర్వాత 2019–20 నుంచి సీజన్‌కు రూ.5 వేల చొప్పున, ఏడాదికి రూ.10 వేలు అందజేశారు. రైతుబంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్‌ వరకు దాదాపు రూ.73 వేల కోట్లు పెట్టుబడి సాయం కింద అందించారు. కానీ సాగులో లేని రాళ్లు రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు ఇతరత్రా వాటికి ఏకంగా రూ.26,500 కోట్లు చెల్లించారు. అంటే ఏడాదికి యావరేజ్​గా రూ.రూ.4,416  కోట్లు దుబారా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అసలు లక్ష్యం కూడా నెరవేరలే.. 

సాగులో లేని భూములకు రైతుబంధు అందడంతో ప్రభుత్వం ఆశించిన అసలు లక్ష్యం కూడా నేరవేరలేదు. రాష్ట్రంలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం 69 లక్షల  మంది రైతులకు వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇందులో 92 శాతం ఐదెకరాలు, ఆలోపు ఉన్న రైతులే ఉన్నారు. ఈ కుటుంబాలకు యావరేజ్​గా ప్రతి సీజన్​లో రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందింది. అదే సమయంలో ఐదెకరాల నుంచి పదెకరాల మధ్యలో ఉన్న కుటుంబాలకు ఒక్కో సీజన్​కు రూ.35 వేల చొప్పున అందాయి. పదెకరాలు ఆ పైన ఉన్నోళ్లకు సీజన్​కు రూ.50 వేలు ఏడాదికి రూ. లక్ష, ఆపైనే అందాయి. చిన్న, మధ్యతరగతి రైతులకు తక్కువ మొత్తంలోనే రైతుబంధు అందింది. దీంతో పేద రైతులను ఆదుకోవాలన్న అసలు లక్ష్యమే నీరుగారిపోయింది. 

గైడ్ లైన్స్​పై ఒక్కసారీ రివ్యూ చేయలే 

రైతు బంధు మార్గదర్శకాలపై అప్పటి సీఎం కేసీఆర్ కనీసం ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. నాటి మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులు చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. రైతుబంధు విషయంలో కేటీఆర్ చేసిన సూచనలను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు జమ చేయాల్సిందే అంటూ కేసీఆర్ ఆదేశించడంతో రూ.వేల కోట్లు దుబారా అయ్యాయి. ఒకానొక టైమ్​లో రైతుబంధుకు సీలింగ్ పెట్టాలనే చర్చ జరిగింది. దానికి ఒప్పుకోకపోవడంతో కనీసం సాగులో లేని భూములు, రాళ్లురప్పలకు, కొండలకు, గుట్టలకు, హైవేలకైనా పెట్టుబడి సాయం ఆపేయాలన్న సూచనలు రాగా.. వాటిని కూడా కేసీఆర్ ​పెడచెవిన పెట్టారు. తప్పుల తడకలా ఉన్న ధరణిని ప్రక్షాళించకుండా దాని ఆధారంగానే రైతుబంధు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది. 

రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ

రైతు బంధులో జరిగిన దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసి, అర్హులైన రైతులకు, సాగులో ఉన్న భూములకే రైతు భరోసా అందించేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పెట్టుబడి సాయానికి ఎలాంటి గైడ్​లైన్స్ ​ఉంటే బాగుంటుందో సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. ఇందుకోసం ఇటీవల కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఇప్పటికే రైతులు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. తుది నివేదిక రూపొందించాక అసెంబ్లీలో చర్చించి రైతు భరోసాకు కొత్త గైడ్​లైన్స్ రెడీ చేయాలని భావిస్తోంది. నాన్ అగ్రికల్చర్ భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని, వీటిని ధరణి లిస్ట్​లో నుంచి తీసేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైతు భరోసాకు సీలింగ్ పైనా సర్కారు సీరియస్​గానే దృష్టిపెట్టినట్టు సమాచారం. 

చెట్లు, పొదలకు పెట్టుబడి సాయం 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కేతినీ శివారులో సర్వే నంబర్ 17, 18, 19లో సుమారు 9 ఎకరాల భూమి ఉంది. దీనికి ధరణిలోని డేటా ఆధారంగా పట్టాదారుల పేరిట డిజిటల్ పాస్ బుక్ లు ఇచ్చారు. అడవికి ఆనుకుని ఉన్న ఈ భూమిలో వందలాది టేకు చెట్లు, పొదలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దీనికి సంబంధించి హద్దులు గుర్తించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లు పలుమార్లు జాయింట్ సర్వే చేశారు. ఈ భూమిలో పంటలు సాగు చేసిన దాఖలాలు లేవు. ఊరు పక్కనే, హాస్టల్ వెనుక ఉన్న ఈ భూమిలో ఏ పంటలు సాగు చేశారని గత సర్కార్ హయాంలో రైతు బంధు ఇచ్చారో ఆఫీసర్లకే తెలియాలి.

రాజీవ్ రహదారికీ రైతుబంధు 

బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్​లోని రాజీవ్ రహదారికి కూడా ఆరేండ్ల పాటు రైతుబంధు ఇచ్చారు. రోడ్డుకు రైతుబంధు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? రంగారెడ్డి జిల్లా శామీర్​పేట నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం వరకు రాజీవ్​ రహదారి కోసం 30 ఏండ్ల కింద భూములు సేకరించారు. కానీ వాటిని రెవెన్యూ రికార్డుల్లో మార్చలేదు. రికార్డుల ప్రక్షాళన చేయకుండా ధరణి పోర్టల్ తేవడంతో ఆ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదనే కనిపిస్తున్నాయి. దీంతో రోడ్డు భూములకూ రైతుబంధు ఇస్తూ వచ్చారు. ఒక్క ప్రజ్ఞాపూర్​లోని 65, 66, 67, 78, 76, 75, 147, 143, 146, 156, 178, 185, 274 తదితర సర్వే నంబర్లలో దాదాపు 30 ఎకరాలకుపైగా రాజీవ్ రహదారి భూములకు రైతుబంధు అందుతున్నది.