బీఆర్ఎస్​ సొంత మీడియాకు రూ.332 కోట్లు!..గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు

బీఆర్ఎస్​ సొంత మీడియాకు రూ.332 కోట్లు!..గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు
  • నకిలీ సర్టిఫికెట్లతో రెండు పత్రికలకు టారిఫ్​ల పెంపు 
  • ప్రాథమికంగా నిర్ధారించిన ఐ అండ్ ​పీఆర్ ​శాఖ
  • ప్రభుత్వానికి నివేదిక..త్వరలోనే ఎంక్వైరీ?

హైదరాబాద్, వెలుగు:బీఆర్ఎస్​హయాంలో ఆ పార్టీ సొంత మీడియాకు నిబంధనలకు విరుద్ధంగా రూ.332 కోట్ల ప్రకటనలు జారీ చేసినట్టు  రాష్ట్ర ఐ అండ్​ పీఆర్​శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. కేసీఆర్​ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ అనే రెండు దినపత్రికలకు ఏడేండ్లపాటు నకిలీ సర్టిఫికెట్లతో అడ్డగోలుగా టారిఫ్ లు పెంచుకున్నట్టు గుర్తించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి.. త్వరలోనే వివరాలు బయటపెడ్తామని చెప్పిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే ఐ అండ్​ పీఆర్​అధికారులు ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక అందజేశారు. ఈ క్రమంలో మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం త్వరలోనే  విజిలెన్స్​ ఎంక్వైరీకి ఆదేశించనున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.ఈ నివేదిక ప్రకారం.. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర  ప్రభుత్వం వివిధ వార్తాపత్రికలకు ప్రకటనల రూపంలో దాదాపు రూ. 1,757 కోట్లు ఖర్చు చేసింది.  

ఇందులో అత్యధికంగా ‘నమస్తే తెలంగాణ’కు రూ. 182 కోట్లు, ‘తెలంగాణ టుడే’కు రూ. 150 కోట్లు.. మొత్తంగా  రూ. 332 కోట్ల ప్రకటనలు ఇచ్చుకున్నారు. ప్రకటనల కోసం కేటాయించిన మొత్తం బడ్జెట్‌‌‌‌లో ఇది 18.90%గా ఉంది. ఈ రెండు పత్రికలు ‘తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఒకే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.  నమస్తే తెలంగాణ 2011 జూన్ 6న ప్రారంభమైంది. ప్రకటనలకు మొదట ఒక్కో  స్క్వేర్​సెంటీమీటర్​కు రూ. 875  ధర ఉండగా, 2016 మార్చి 4న దానిని రూ. 1,250కు పెంచారు.

2019 జనవరి 10న రూ. 1,500కు పెంచుకున్నారు.  మొత్తంగా ఐ అండ్ పీఆర్​ శాఖ నుంచి రూ. 71.79 కోట్లు, ఇతర శాఖల నుంచి రూ. 57.97 కోట్లు, భూసేకరణ, కలెక్టర్లు ఇచ్చిన ఇతర అడ్వర్టైజ్​​మెంట్లు రూ. 51.73 కోట్లు సహా మొత్తం రూ. 182 కోట్ల ప్రకటనలు ఇచ్చారు.  ఈ టారిఫ్ పెంపులో సర్క్యులేషన్, రీడర్‌‌‌‌షిప్ లాంటివి ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని,  సుప్రీంకోర్టు మార్గదర్శకాలనూ పాటించలేదని, నకిలీ సర్టిఫికెట్లు పెట్టి..  అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని  ప్రభుత్వం  ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తున్నది. 

ఇంగ్లిష్​ పత్రికకు ఇలా..

‘తెలంగాణ టుడే’ ఇంగ్లిష్​ పత్రిక 2016 డిసెంబర్ 15న ప్రారంభమైంది. సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలు 18 నెలల తర్వాతే ఇవ్వాలని నిబంధన ఉన్నా.. 2017 మార్చి 14న ఈ నిబంధనను సడలించి 3 నెలల్లోనే ప్రకటనలు ఇచ్చారు. ఈ పత్రికకు ప్రకటనల టారిఫ్ మొదట రూ. వెయ్యి ఉండగా, 2019లో రూ. రెండు వేలకు పెంచారు.   ఐ అండ్​ పీఆర్​ నుంచి రూ. 41.61 కోట్లు, ఇతర శాఖల నుంచి రూ. 30.27 కోట్లు, జిల్లా కలెక్టర్ల ద్వారా భూసమీకరణ ప్రకటనలతో రూ. 77.66 కోట్లు సహా మొత్తం రూ. 150 కోట్లు యాడ్స్​ రూపంలో ఇచ్చారు.  

ఇదిలా ఉంటే 2019–2023 మధ్య మొత్తం భూ సేకరణ ప్రకటనల్లో 25 శాతానికి  పైగా ఈ పేపర్​కే ఇచ్చినట్టు అధికారులు తేల్చారు.  కొవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులకు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ  ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలకు కలిపి రూ. 54.91 కోట్లు ఇచ్చినట్టు గుర్తించారు. అదే సమయంలో నచ్చని పేపర్లకు టారిఫ్​ తగ్గించారు. డెక్కన్ క్రానికల్ టారిఫ్ రూ. 2,525 నుంచి రూ. వెయ్యికి, ది హిందూ టారిఫ్​ను రూ. వెయ్యి నుంచి రూ. 800కు తగ్గించారు.