మంత్రి కేటీఆర్​కు ఆ నలుగురి గండం!

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నియోజకవర్గంలో ఇన్నాళ్లూ తనకు ఎదురులేదని భావించిన మంత్రి కేటీఆర్​కు ఈసారి ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవు. మంత్రి అయ్యాక నియోజకవర్గంపై పట్టుకోల్పోయిన కేటీఆర్​, తన అనుంగులైన ఓ నలుగురు నేతలకు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు అప్పగించారు. ఇప్పుడు అదే కేటీఆర్​కు నెగటివ్​గా మారింది.  ల్యాండ్​, సాండ్​ మాఫియాల్లో ఆరితేరిన ఆ నలుగురు, నియోజకవర్గంలో చేపట్టే ప్రతి కాంట్రాక్ట్​లోనూ పర్సెంటేజీలు దండుకుంటారనే పేరుంది. ఈ క్రమంలో పార్టీని సైతం తీవ్ర నిర్లక్ష్యం చేశారనే టాక్​ ఉంది. ఫలితంగా క్యాడర్​కు, లీడర్లకు దూరం పెరిగిపోయినట్లు మిగిలిన లీడర్లు చెప్తున్నారు. ఈ విషయం కేటీఆర్ ​దాకా చేరవేసేందుకు ప్రయత్నిస్తే ఆయన కనీసం టైం కూడా ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరే కారును వీడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఈ రకమైన వలసలతో బీఆర్ఎస్​లో ఆందోళన వ్యక్తమవుతుండగా, కాంగ్రెస్ ​శిబిరంలో ఉత్సాహం నెలకొంది.

అన్నింటికీ ఆ నలుగురే..

కేటీఆర్ మంత్రి అయ్యాక హైదరాబాద్​లోనే మకాం వేసి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. డే టూరిస్టులా వచ్చిపోవడం తప్ప సిరిసిల్లలో ఒక్కరోజైనా స్టే చేసింది లేదు. ఏనాడూ కింది స్థాయి లీడర్లు, క్యాడర్​ను కలిసి వారి గోడును విన్నది లేదు. దీంతో నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలపై కేటీఆర్​ పట్టు కోల్పోయారు.  సిరిసిల్లకు సంబంధించి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఓ నలుగురు నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ నలుగురే ల్యాండ్​, సాండ్​ మాఫియాగా మారి కోట్లకు పడగెత్తారు. వీరి భూకబ్జాలు, ఇసుక దందాలు  క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్​ పార్టీని పలుచన చేశాయి. ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకోవడం పరిపాటిగా మారింది. దీనిపై ప్రశ్నించే లీడర్లకు పార్టీలో చోటు లేకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  మిగిలిన లీడర్లు, క్యాడర్​కు, కేటీఆర్​కు నడుమ ఈ నలుగురు లీడర్లు అడ్డుగోడగా నిలిచారనే విమర్శలున్నాయి.  ఈ నలుగురి తీరుపై ఇన్నాళ్లూ తీవ్ర అసంతృప్తితో ఉన్న కిందిస్థాయి నేతలు, కనీసం ఎన్నికల టైంలోనైనా కేటీఆర్​ వస్తారని, ఆయనకు తమ గోడు చెప్పుకుందామని చూసినా అది నెరవేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్​తరుపున ప్రచారంలో తలమునకలైన కేటీఆర్​ సిరిసిల్లలో ప్రచారానికి టైం కూడా ఇవ్వట్లేదు. దీంతో విసిగివేసారిన లీడర్లు ఒక్కొక్కరే కారు దిగుతున్నారు. 

కారు దిగుతున్న నేతలు..

కేటీఆర్​ టీమ్​ ఆగడాలు భరించలేక సిరిసిల్లలో బీఆర్ఎస్​ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. పార్టీలో లుకలుకల విషయం తెలియని కేటీఆర్ ​కనీసం అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం కూడా చేయకపోవడంతో వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామల పావని, అంగన్​వాడీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలు కల్లూరి చందన, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముస్తఫా బుధవారం బీఆర్ఎస్ ను వీడి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మరో సీనియర్ నేత రైతు సమన్వయ సమితి జిల్లా ప్రెసిడెంట్ గడ్డం నర్సయ్య కూడా కాంగ్రెస్​ లో చేరారు. నెల రోజుల కింద బీఆర్ఎస్ నాయకులు వైద్య శివప్రసాద్, రాపెల్లి లక్ష్మీనారాయణ, గోలి వెంకటరమణ బీఆర్​ఎస్ ను ​వీడి,  కాంగ్రెస్ లో చేరినా నష్టనివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.  2009లో  కేటీఆర్​ టికెట్​ కోసం బలిపశువులా మారి, బీఆర్​ఎస్​ను వీడిన కేకే మహేందర్​రెడ్డి మరోసారి కాంగ్రెస్ ​అభ్యర్థిగా  బరిలో నిలిచారు. ఈ దఫా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ గాలి వీస్తుండడంతోపాటు కేకే కు సింపతీ కలిసి వస్తుందనే అంచనాలున్నాయి. దీంతో తాజా ఎన్నికల్లో కేటీఆర్​గెలుపు అంత ఈజీ కాదనే టాక్​ వినిపిస్తోంది. 

 ఆ నలుగురు నేతల తీరు వల్లే.. 

 కేటీఆర్ అనుచరులుగా చెప్పుకునే  ఆ నలుగురు నేతల తీరుతో బీఆర్​ఎస్​ పార్టీ గ్రాఫ్​ పడిపోతోంది.  క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను మంత్రి కేటీఆర్​కు చెబుదామంటే టైం ఇవ్వరు. నా పదవీ కాలం ముగిశాక కనీసం ఒక్కసారి కూడా కేటీఆర్ ను కలిసే అవకాశం రాలేదు.  ఆ నలుగురి కోసం మిగిలిన నేతలందరినీ కేటీఆర్​ దూరం చేసుకున్నారు. ఆ ఎఫెక్ట్​ ఈ ఎన్నికల్లో కనిపిస్తోంది.

- సామల పావని,మున్సిపల్ మాజీ చైర్ పర్సన్

కాంగ్రెస్‌లో చేరిన గడ్డం నర్సయ్య

రైతు సమన్వయ సమితి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్​ గడ్డం నర్సయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇందిరాగాంధీ కాలం నుంచి గడ్డం నర్సయ్య కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పని చేశారు. 1979లో ఇందిరాగాంధీని సిరిసిల్లకు రప్పించారు. ఆయన ఉమ్మడి జిల్లా నుంచి పీసీసీ కమిటీ మెంబర్ గా పని చేశారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా బీఆర్​ఎస్ నాయకులు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కనీసం కేటీఆర్ ను కలుద్దామంటే అపాయింట్‌మెంట్ ​కూడా ఇవ్వడంలేదని నారాజ్ లో ఉన్నారు.