ఓఆర్ఆర్ ఆదాయం ప్రైవేట్ కు.. భారం హెచ్ఎండీఏకు

ఓఆర్ఆర్ ఆదాయం ప్రైవేట్ కు.. భారం హెచ్ఎండీఏకు

హైదరాబాద్, వెలుగు: ఖర్చుల భారం ఒకరిది, లాభాలు మాత్రం మరొకరికి అన్నట్టు ఉంది ఓఆర్ఆర్ నిర్వహణ తీరు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ నిర్వాకంతో ఓఆర్ఆర్​టోల్​ వసూల్​ ను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. కానీ, నిర్వాహణ మాత్రం హెచ్​ఎండీఏకు కట్టబెట్టింది.   దీంతో వన్​ వే ట్రాఫిక్​ లాగా  ఓఆర్​ఆర్​ నిర్వాహణ కోసం హెచ్​ఎండీఏ కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది.  కానీ టోల్​ వసూల్​  చేస్తూ కోట్ల ఆదాయాన్ని మాత్రం  లీజ్ తీసుకున్న ప్రైవేటు సంస్థ ఐఆర్​బీ పొందుతోంది.

గత ప్రభుత్వ నిర్వాకం..

ఓఆర్​ఆర్​పై టోల్​ వసూల్​ చేసేందుకు లీజు తీసుకున్న  ఐఆర్​బీ ఇన్​ఫ్రా  ఆదాయం మాత్రమే తమదని, నిర్వహణ మాత్రం తమదికాదని అంటోంది. ముఖ్యంగా ఓఆర్​ఆర్​పై  పచ్చదనం నిర్వహణ, ఇతర మరమ్మతులు, విద్యుత్​ దీపాల నిర్వహణ భారం అంతా హెచ్​ఎండీఏపై తోసేసింది. హెచ్​ఎండీఏలో భాగమైన హైదరాబాద్​గ్రోత్​ కారిడార్​(హెచ్​జీసీ)అధికారులు ఓఆర్​ఆర్​ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.  ఐఆర్​బీకి   లీజుకు ఇచ్చే సమయంలోనే నిర్వహణ బాధ్యతలు కూడా వారికే అప్పగించాల్సిందని, కానీ ఇప్పుడు ఔటర్​ నుంచి తమకు పైసా ఆదాయం రాకున్నా నిర్వహణ తడిసిమోపెడవుతోందని  అధికారులు అంటున్నారు.   వీధి దీపాల నిర్వహణకే కోట్లలో బిల్లులు చెల్లించాల్సి వస్తోందని, ఇక పచ్చదనం కోసం, ఇతర మరమ్మతులకు మరింత కలిపితే ఏడాదికి దాదాపు 200 కోట్లకుపైగానే ఖర్చు వస్తోందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఓఆర్​ఆర్​ను ప్రైవేట్​కు అప్పగించాలని  ఏకంగా 30 సంవత్సరాల లీజు కోసం రూ.  7,380 కోట్లకు వారికి కట్టబెట్టారు. కానీ ఓఆర్​ఆర్​ నిర్వాహన భారాన్ని  సదరు కంపెనీకే అప్పగించకుండా ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు. 

ప్రైవేటు సంస్థకు లాభాల పంట  

ఔటర్​రింగ్​రోడ్​ పై టోల్​ వసూలు చేసుకునేందుకు గత ప్రభుత్వం ఐఆర్ బి ఇన్​ఫ్రా  సంస్థకు టోల్​ ఆపరేట్​ ట్రాన్స్​ఫర్​ పద్దతిలో 30 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది.   టోల్​ వసూలు ద్వారాగత సంవత్సరం నవంబరు నెలలో 55.6 కోట్ల ఆదాయాన్ని పొందిన ఆ సంస్థ డిసెంబరు లో రూ. 62.7కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఒక్క నెలలో ఏడు కోట్లు అధికంగా రావడంతో అధికారులు సైతం విస్మయం చెందారు.

158 కిలోమీటర్ల  ఔటర్​ రింగ్​రోడ్​ పలు జాతీయ రహదారులను కలుపుతోంది. ఓఆర్​ఆర్​పైకి ఎక్కి దిగడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్​ఎక్స్​ఛేంజ్​ జంక్షన్లు ఉన్నాయి. భవిష్యత్​లో అభివృద్ధి అంతా ఓఆర్​ఆర్​ చుట్టూనే ఉంటుందని భావించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. రోజుకు ఔటర్​ పై 1.40 నుంచి 1.45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతానికి నెలకు రూ. 60కోట్ల ఆదాయాన్ని పొందుతున్న సదరు సంస్థ ఇటీవల టోల్​గేట్​ ఛార్జీలను పెంచింది.  దీంతో ఇంకా మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం వుంది. 

చిన్న సమస్య వచ్చినా..

 ఔటర్ రింగ్​ రోడ్​ లో చిన్న సమస్య వచ్చినా  పరిష్కరించే బాధ్యతలు హెచ్​ఎండీఏపై పడింది. ముఖ్యంగా భద్రత, విద్యుత్​ దీపాల నిర్వహణ, మరమ్మతులు, ఔటర్​ పై పచ్చదనం నిర్వహించాల్సిన బాధ్యతలను హెచ్​జీసీ పరిధిలో ఉంది.   కానీ లీజుకు తీసుకున్న ఐఆర్​బి ఇన్​ఫ్రా సంస్థ కేవలం టోల్​వసూలు చేసుకోవడం పైనే దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం ఔటర్​ను ప్రైవేట్​సంస్థకు అప్పగించడం పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. 

ముఖ్యంగా చాలా తక్కువ మొత్తానికే లీజుకు ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా అప్పటి ప్రభుత్వం లీజుకు ఇవ్వడానికి మొగ్గుచూపి వారికి అప్పగించింది. కానీ ఇప్పుడు నిర్వహణ బాధ్యతలు తమ పై పడడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్ధితిని ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.