కాంగ్రెస్​ కేడర్​పై గులాబీ గురి

  • రంగంలోకి కేటీఆర్, హరీశ్, కవిత!
  • కీలక నేతలతో చర్చలు.. మొదలైన చేరికలు
  • మున్ముందు మరిన్ని చేరికలకు ప్లాన్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ కేడర్​పై బీఆర్​ఎస్​ ఆకర్ష్​ వల విసురుతున్నది. గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన బలమైన నేతలపై ఫోకస్​ పెట్టింది. నియోజకవర్గ స్థాయిలోనూ ప్రభావం చూపగల కీలక నేతలను గుర్తించి, వారిని తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగి, బలమైన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. గులాబీ కండువా కప్పుకుంటే రాజకీయ భవిష్యత్​కు తమది హామీ అంటూ వారిలో నమ్మకం పెంచుతున్నారు. 


నియోజకవర్గాల వారీగా ఎక్కడ దెబ్బకొడితే కాంగ్రెస్​వీక్​అవుతుందో అలాంటి నేతలపైనే ప్రధానంగా గురిపెట్టారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్​ నేతల చేరికలు ఉండేలా ప్లాన్​చేస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, కొందరు కీలక నేతల చేరికలతో జోరు మీదున్న కాంగ్రెస్​పార్టీ.. కేసీఆర్​ను గద్దె దించేది తామేనని చెప్తున్నది. బీఆర్​ఎస్, బీజేపీలోని అసంతృప్తులను చేర్చుకొని బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్​లోని అసంతృప్త నేతలకు గాలం వేయడంతోపాటు గ్రామ, మండల స్థాయిలోని నేతలను కూడా తమవైపు తిప్పుకోవాలని బీఆర్​ఎస్​ ప్రయత్నిస్తున్నది. 

పెద్ద టీమే పని చేస్తున్నది

రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్​ప్రభుత్వంపై ప్రజల్లో క్రమేణా వ్యతిరేకత పెరుగుతున్నది. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మందిపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దీనిని అధిగమించి మూడోసారి గెలిచి హ్యాట్రిక్​ కొట్టాలని బీఆర్ఎస్ ​వ్యూహాలు రచిస్తున్నది. ప్రగతి భవన్​ కేంద్రంగా పార్టీ చీఫ్​ కేసీఆర్​తో పాటు పలువురు ముఖ్యనేతలు ఇదే టాస్క్​లో నిమగ్నమయ్యారు. తెరపైన కేటీఆర్, హరీశ్, కవిత కనిపిస్తున్నా.. తెరవెనుక పెద్ద టీమే పార్టీని చక్కదిద్దడం, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సానుకూలంగా మలుచుకోవడం కోసం పని చేస్తున్నది. హస్తం పార్టీకి వెన్నెముకగా ఉన్న ముఖ్య నేతలపై ఫోకస్​ పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాదని, ఉచిత కరెంట్​పై రేవంత్​రెడ్డి చేసిన కామెంట్స్​తో  రైతులు హస్తం పార్టీకి దూరమయ్యారని.. తమతో కలిస్తే రాజకీయంగా అవకాశాలిస్తామని, ఆర్థికంగా చేయూతనిస్తామని నేతలకు బీఆర్​ఎస్​ టీమ్​ హామీ ఇస్తున్నది. ఎక్కడెక్కడ కాంగ్రెస్​ గెలిచే అవకాశముందని సర్వే సంస్థలు చెప్తున్నాయో ముందుగా ఆయా నియోజకవర్గాల్లో చేరికలకు ప్లాన్​ చేస్తున్నది. తర్వాతి దశలో మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఆదివారం జహీరాబాద్​కు చెందిన కాంగ్రెస్​ముఖ్య నేతలు బీఆర్​ఎస్​లో చేరారు. హరీశ్​రావు తెలంగాణ భవన్​లో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్​తో పాటు ఆయా జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చర్యలు చేపట్టారు. 

ALSO READ :ఎండీఏ పథకంతో ఎంతో ఆదా.. తగ్గనున్న రసాయన ఎరువుల వాడకం

ప్రభావం చూపే నేతలను గుర్తించి..!

2014 తర్వాత కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో నేతలు గులాబీ పార్టీలో చేరారు. అప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సొంత​నాయకులు, కేడర్​ను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం దక్కింది. ఈక్రమంలోనే కొందరు నేతలు కారు దిగి కాంగ్రెస్​లో చేరిపోయారు. పార్టీలోనే ఉన్నా తమకు గుర్తింపు దక్కడం లేదని మరికొందరు నేతలు రగిలిపోతున్నారు. బీఆర్​ఎస్​లోని ఇలాంటి వారిపై ప్రత్యర్థి పార్టీలు ఫోకస్​ పెంచాయి. వారిని తమ పార్టీలో చేర్చుకొని బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్​ కేడర్​ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్​ ఉంది.  కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలను చేర్చుకునేందుకు వారితో బీఆర్​ఎస్​ టీమ్​ చర్చలు జరుపుతున్నది. పెద్ద లీడర్ల చేరికలతోనే సరిపెట్టకుండా.. కాంగ్రెస్​ స్థానిక నేతల చేరికలకు కూడా తెరతీసింది. గ్రామ, మండల స్థాయిలో ప్రభావం చూపించగల నేతలను ఇప్పటికే గుర్తించింది. వారితో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు చర్చలు జరుపుతున్నారు. వారికి భరోసానిచ్చేలా కేటీఆర్, హరీశ్​రావు, కవితతోనూ మాట్లాడిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.