దిలావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ఇథనాల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్

  • తలసాని కుమారుడు సాయి ఆ కంపెనీ డైరెక్టర్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ఇప్పుడు ఆ నిందను మా ప్రభుత్వంపై వేసి రైతులను రెచ్చగొడుతున్నరని ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు వ్యతిరేకించే ప్రాజెక్టులు చేపట్టి, ఇప్పుడు ఆ నిందను తమ ప్రభుత్వంపై మోపి నానా యాగి చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలపై ఆయన స్పందించారు. ఈ ప్రాజెక్టుకు 7 జులై 2023 లో బీఆర్ఎస్ హయాంలోనే అనుమతి  వచ్చిందని వివరించారు. 

మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పుడు ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపనీకి ఆనాడు డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్ మెంట్ పొల్యూషన్, ఫైర్, వాటర్..ఇలా అన్ని  పర్మిషన్ లను అప్పనంగా ఇచ్చిందని ఆరోపించారు.18.351 ఎంసీఎఫ్టీ నీళ్లు వాడుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారని చెప్పారు. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తున్నది మీరేనని ఫైర్ అయ్యారు. ఈ కంపెనీకి అనుమతులు ఎలా ఇచ్చారని దిలావర్ పూర్ రైతులు బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలని కోరారు. ఆ ఊరుకి వెళ్లి చర్చిద్దాం రండి.. రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీకి ఓటు వేసింది మీరు కాదా..స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నట్లు.. అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. ఇలాంటి దగుల్భాజీ పనులను  బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా మానుకోవాలని కోరారు.  

రైతు పండుగను విజయవంతం చేయాలి..-

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహుబూబ్​నగర్​లో నిర్వహించే రైతు పండుగను విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్  పేర్కొన్నారు. బుధవారం పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో మాట్లాడారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారికి  వివరించాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఏడాది కాలంలో  రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు మంత్రి తుమ్మల  చెప్పారు.