
సంగారెడ్డి, వెలుగు : అసంతృప్తులపై అధికార పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ లో ఉన్నవారు కారు దిగకుండా, ఇతర పార్టీల లీడర్లు కారు ఎక్కేలా నామినేటెడ్ పదవులను ఎర వేస్తోంది. మొన్నటి వరకు జిల్లాలోని ఐదు స్థానాల్లో ఆ పార్టీకి తిరుగు లేదని చెప్పుకుంటూ వచ్చిన క్యాడర్ కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జిల్లా లీడర్ల కదలికలపై పార్టీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్ లో పార్టీ గెలిచే పరిస్థితులు లేవన్న విషయాన్ని గుర్తించింది. పటాన్ చెరు, నారాయణఖేడ్ సెగ్మెంట్లలో కొంత మెరుగ్గా ఉన్నా దాదాపు అదే పరిస్థితి ఉంది.
మొదటి మూడు సెగ్మెంట్లలో హస్తం హవా ఉన్నట్టు గుర్తించిన గులాబీ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారితో పాటు అసంతృప్తుల వివరాలు సేకరించి మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. హరీశ్ సొంత పార్టీ అసంతృప్తులే కాకుండా కాంగ్రెస్ లోని తటస్థులతో కూడా సంప్రదింపులు జరిపి గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామన్న కమిట్మెంట్ తో చేరికలను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ అసమ్మతి వర్గం పక్క ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఒకే రోజు పటాన్ చెరు, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది.
ఆ మూడు సెగ్మెంట్లలో...
జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి గీతారెడ్డితో ఆ పార్టీ లీడర్ నరోత్తంకు ఉన్న రాజకీయ విభేదాలను బీఆర్ఎస్ క్యాచ్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఒకపక్క కాంగ్రెస్ సర్వే మరో పక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో నరోత్తంకు ప్రజల మద్దతు ఉన్నట్టు తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇస్తామన్న కమిట్మెంట్ తో మూడు రోజుల కింద బీఆర్ఎస్ లో చేర్చుకున్నట్టు తెలిసింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాణిక్ రావు రెండోసారి పార్టీ టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచేందుకు జాగృతి నేతగా పేరున్న భిక్షపతికి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.
జహీరాబాద్ లో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో మైనార్టీల ఓటు బ్యాంకు కోసం స్వర్గీయ మాజీ మంత్రి పరిదోద్దీన్ తనయుడు తన్వీర్ కు టీఎస్ఐడీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. పటాన్ చెరు సెగ్మెంట్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి హైకమాండ్ తీరుపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరగడంతో సీఎం కేసీఆర్ వెంటనే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా భూపాల్ రెడ్డిని నియమించి కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంతకాలం నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశలో ఉన్న మరికొందరు అసంతృప్తు నేతలు రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచిస్తూ ఇతర పార్టీల నేతలతో టచ్ లో ఉండడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్
సంగారెడ్డి జిల్లా రాజకీయలపై సీఎం కేసీఆర్ స్వయంగా దృష్టి పెట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో సంగారెడ్డి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి, అందోల్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పది రోజులుగా ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేయడం బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్ పెంచింది. నారాయణఖేడ్, పటాన్ చెరులో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఆ సెగ్మెంట్లలో పోటీ చేసే వారి పేర్లను రెండో విడతలో ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
సంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారాన్ని ఇటీవల ఆయన సతీమణి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఖండించారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని ప్రకటించడం బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలను అయోమయానికి గురి చేసింది. అయితే శనివారం హైదరాబాదులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన మీటింగ్ లో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్ ను కాంగ్రెస్ తిప్పికొడుతూ క్యాడర్ ను కాపాడుకునే పనిలో నిమగ్నమైంది.