- సెటిలర్లు బీఆర్ఎస్ వైపే..జీహెచ్ఎంసీలో కారుకే జైకొట్టిన్రు
- 24 సెగ్మెంట్లలో 16 చోట్ల ఆ పార్టీ గెలుపు
- ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ
- ఏడు సీట్లను కాపాడుకున్న మజ్లిస్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఊహించని ఫలితాలు ఇచ్చారు. ఇక్కడి సెటిలర్లలో ఎక్కువ మంది బీఆర్ఎస్కే జైకొట్టడంతో ఆ పార్టీకి జీహెహెచ్ఎంసీలో 16 సీట్లు వచ్చాయి. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 24 సీట్లు ఉండగా.. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇక్కడ బీజేపీకి మంచి పట్టున్నప్పటికీ కేవలం ఒక్కసీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మజ్లిస్‌పార్టీ ఎప్పటిలెక్కనే ఇప్పటివరకూ తనకున్న ఏడు సీట్లను పదిలపరుచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వన్‌సైడ్‌గా సాగిన కాంగ్రెస్ వేవ్ జీహెచ్ఎంసీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక్కడ ఒక్క సీటును కూడా ఆ పార్టీ గెలువలేదు.
‘నువ్వా నేనా’ అన్నట్లు సాగినా..!
జీహెచ్ఎంసీలో అసెంబ్లీ ఎన్నికల పోరు ‘నువ్వా నేనా’ అన్న రీతిలో సాగింది. ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు చేసిన ప్రసంగాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో నగరం హోరెత్తిపోయింది. వివిధ పార్టీల అగ్రనేతల రోడ్డు షోలు, ర్యాలీలు జోరుగా సాగాయి. కానీ, ఫలితాలు వచ్చేసరికి గతంలో ఎన్నడూ లేని రీతిలో వెలువడ్డాయి. రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కూడా ఊహించని విధంగా వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఘనమైన మెజార్టీతో విజయం అందించినా.. హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక్కసీటు కూడా రాకపోవడం పార్టీలనే కాదు, రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు రాష్ట్రవ్యాప్తంగా చేదు అనుభవం ఎదురైనా.. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం 16 స్థానాలు వచ్చాయి. ఇందుకు సెటిలర్ల ఓట్లే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ట్విన్ సిటీస్‌లో తాము కనీసం నాలుగు సీట్లన్నా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీకి ఒకే ఒక్క సీటు దక్కింది. అది కూడా మూడో సారి గోషామహల్ సీటే కావడం గమనార్హం. మజ్లిస్ పార్టీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చార్మినార్, యాకుత్‌పురా, కార్వాన్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, నాంపల్లి, మలక్‌పేట నియోజక వర్గాలను తిరిగి గెలుచుకుంది. బీఆర్ఎస్పార్టీకి అంబర్‌పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్నియోజక వర్గాల్లో గెలుపొందింది.
కారణాలు ఇవే..!
ఎన్నికల సమయంలో చాలా గుంభనంగా వున్న జీహెచ్ఎంసీ ఓటర్లు ఓటు రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సిటీ, శివారు ఓటర్లు అంటూ రెండుగా విడిపోయినట్టు స్పష్టమవుతున్నది. కోర్‌సిటీ వాసుల్లో అధికంగా ముస్లిం ఓటర్లు ఉండగా, శివారు ప్రాంతాల్లో సెటిటర్లు కీలకంగా వ్యవహరించారు. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్టు కనిపిస్తున్నది. సెటిలర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్గిరి వంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పట్టుసాధించింది. ఈ సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్కే పడ్డట్టు ఓటింగ్ సరళి చూస్తే తెలుస్తున్నది. ఈ స్థాయిలో వారు బీఆర్ఎస్కు ఓటు వేయడానికి ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లో పరిశ్రమలు, ఎంఎన్సీ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఉండటం.. బీఆర్ఎస్తోనే తమకు రక్షణ ఉంటుందని భావించడం. ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ నేతలు చేసిన ఉపన్యాసాలు కూడా సెటిలర్ల ఓట్లు ఆ పార్టీకి పడేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు సంబంధించిన విషయాల్లో సెటిలర్లకు పెద్దగా అవగాహన, ఇంట్రెస్ట్ లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం వారిలో కనిపించలేదని, అందుకే బీఆర్ఎస్కు ఓటు వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆకాంక్షలపై ముఖ్యంగా నిరుద్యోగంపై పోరాడే యువత జిల్లాల్లో ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో బీఆర్ఎస్ను ఓడించారని విశ్లేషకులు చెప్తున్నారు.