- 2018లో 38.. ఇప్పుడు కేవలం 11 సీట్లు
- దక్షిణ తెలంగాణలోనూ సగానికి తగ్గిన స్థానాలు
- 2018లో 50 వస్తే ఇప్పుడు 28కి పరిమితం
- ఉత్తరాన కారు బోల్తా..దక్షిణ తెలంగాణలోనూ సగానికి తగ్గిన స్థానాలు
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు : కంచుకోటలో కారు బోల్తా కొట్టింది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. దక్షిణ తెలంగాణలోనూ దాదాపు సగం స్థానాలను కోల్పోయింది. కేసీఆర్ టీడీపీని వీడి తెలంగాణ ఉద్యమ జెండా పట్టిన నాటి నుంచి ఉత్తర తెలంగాణ.. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచింది. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఆ పార్టీకి గట్టి పట్టుంది. 2004 నుంచి అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఈ జిల్లాలు బీఆర్ఎస్ను అక్కున చేర్చుకున్నాయి. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలను బీఆర్ఎస్ స్వీప్ చేసింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున సీట్లు సాధించింది. కానీ ఈసారి ఆ జిల్లాల్లోనే బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర తెలంగాణ (కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్)లో 2018లో 38 సీట్లు సాధించిన బీఆర్ఎస్.. ఈసారి ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయింది. ఇక దక్షిణ తెలంగాణ(ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి)లో 2018లో 50 సీట్లు సాధించగా.. ఈసారి 28 సీట్లకే పరిమితమైంది.
సిట్టింగులను మార్చిన చోట సానుకూలం..
సిట్టింగ్ఎమ్మెల్యేలను మార్చి కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చిన స్థానాల్లో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు వచ్చాయి. నర్సాపూర్‌లో మాణిక్‌రావుకు బదులు సునీతా లక్ష్మారెడ్డికి, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి బదులు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యకు బదులు కడియం శ్రీహరికి, బోథ్‌లో రాథోడ్ బాపురావుకు బదులు అనిల్ జాదవ్, అలంపూర్‌లో అబ్రహంకు బదులు విజేయుడుకు, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు బదులు కోవ లక్ష్మీకి, ఉప్పల్‌లో భేతి సుభాశ్ రెడ్డికి బదులు బండారి లక్ష్మారెడ్డికి టికెట్లు ఇవ్వడంతో వాళ్లు విజయం సాధించారు. కోరుట్లలో విద్యాసాగర్‌రావుకు బదులు ఆయన కుమారుడు సంజయ్‌కు టికెట్ఇవ్వగా ఆయన గెలుపొందారు. కంటోన్మెంట్నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితకు టికెట్ఇవ్వగా ఆమె విజయం సాధించారు. వేములవాడలో చెన్నమనేని రమేశ్‌కు బదులు చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు, ఖానాపూర్‌లో రేఖా నాయక్‌కు బదులు జాన్సన్ నాయక్‌కు టికెట్ఇవ్వగా వారిద్దరు మాత్రం ఓడిపోయారు. అభ్యర్థులను మార్చిన చోట 80 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని, ఈ లెక్కన 30 మంది అభ్యర్థులను మార్చి ఉంటే అధికారానికి బీఆర్ఎస్ చేరువయ్యేదనే అంచనాలు పార్టీలో ఉన్నాయి.
అన్ని జిల్లాల్లో భారీగా తగ్గిన సీట్లు..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలో 14 సీట్లకు 13 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఈసారి అక్కడ అలంపూర్, గద్వాల స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం కావాల్సి వచ్చింది. దేవరకద్రలో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోగా, మిగతా స్థానాలను కాంగ్రెస్ఏకపక్షంగా గెలుచుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉండగా 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 చోట్ల గెలిచింది. కానీ ఈసారి ఒక్క సూర్యాపేట స్థానానికే పరిమితమైంది. మిగతా 11 చోట్ల కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లకు గాను గత ఎన్నికల్లో 10 చోట్ల గెలిచిన బీఆర్ఎస్.. ఈసారి స్టేషన్ ఘన్పూర్, జనగామలో మాత్రమే విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్జిల్లాలో 13 స్థానాలుండగా గత ఎన్నికల్లో 11 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. ఈసారి సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్‌లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, పటాన్చెరు స్థానాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు గెలిచారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎంఐఎం సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా సీట్లను బీఆర్ఎస్ స్వీప్ చేసింది.