- పెద్దపల్లి ఎంపీని దూరం పెడుతున్న బీఆర్ఎస్ హైకమాండ్
- కాంగ్రెస్, బీజేపీల వైపు వెంకటేశ్ చూపు
- ప్రజలకు దూరం.. హైదరాబాద్‌కే పరిమితం!
మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత రాజకీయ భవిష్యత్తు అయోమయంగా మారింది. ఈసారి ఎన్నికల్లో ఆయనకు మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో చావుదెబ్బ తిన్న గులాబీ పార్టీ.. కాంగ్రెస్, బీజేపీలకు దీటైన అభ్యర్థి కోసం చూస్తున్నట్టు సమాచారం. దీనికితోడు వెంకటేశ్ నేత పనితీరుపై అటు పార్టీలో, ఇటు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
గడిచిన ఐదేండ్లలో వెంకటేశ్‌నేత హైదరాబాద్‌కే పరిమితమై తమను పట్టించుకోలేదని జనం మండిపడుతున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. ఎమ్మెల్యేలు పిలిస్తే చుట్టపు చూపుగా నియోజకర్గాలకు వచ్చిపోవడం తప్పితే.. ఏనాడూ ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. ఇవన్నీ ఆయన పొలిటికల్ కెరీర్‌కు గుదిబండలా మారాయి.
ఐదేండ్లుగా హైదరాబాద్‌కే పరిమితం..
జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థానంలో పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బీఆర్ఎస్లో చేరి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎంపీ పదవి వెంకటేశ్‌కు అలంకార భూషణంగా మారిందే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది.
పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని సమస్యలపై గానీ, అభివృద్ధిపై గానీ ఆయన ఏనాడూ పార్లమెంట్లో మాట్లాడింది లేదు. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల కష్టాలపై గళమెత్తిందీ లేదు. ఐదేండ్ల పదవీకాలంలో ఇదిగో.. ఈ పని చేశానని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదంటే ఆయన పనితీరును అర్థం చేసుకోవచ్చు. దీంతో వెంకటేశ్ నేతను ప్రజలు దాదాపుగా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. ఆ మధ్య మా ఎంపీ కనిపించడం లేదంటూ ప్రతిపక్ష లీడర్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.
పక్క చూపులు ఫలించేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓడిపోయామంటున్న బీఆర్ఎస్.. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు సరిగా లేని సిట్టింగ్ ఎంపీల మార్పు ఖాయమన్న సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో వెంకటేశ్ నేతకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని స్థానిక పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ హైకమాండ్ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన కాదంటే మరో మాజీ ఎంపీ, తాజా మాజీ ఎమ్మెల్యే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో వెంకటేశ్ నేత బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చుట్టూ నాలుగు సెగ్మెంట్లలో గెలిచి పెద్దపల్లిలో సరైన అభ్యర్థి లేకపోవడం వల్లే ఓడిపోయామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ ప్రజల్లో ఆదరణ లేని వ్యక్తిని బరిలోకి దించితే మరోసారి ఓడిపోక తప్పదన్న భయం కమల దళంలో కనిపిస్తోంది. వెంకటేశ్ నేత పాత పరిచయాలతో కాంగ్రెస్‌లో చేరడానికి ట్రై చేస్తున్నాడనే ప్రచారం జరుగుతున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత సులభం మాత్రం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.