ఊరికో ఇన్​చార్జి .. కేటీఆర్​ సూచనతో నేతల సమావేశం

  • కామారెడ్డిపై బీఆర్ఎస్​ స్పెషల్​ ఫోకస్
  • వంద మంది ఓటర్లకు ఓ ఇన్​చార్జి
  • ఒక్కో బూత్​కు ఒక్కో కన్వీనర్
  • కామారెడ్డిలో   బీఆర్​ఎస్​ వ్యూహం
  • కమిటీల ఏర్పాటుకు కసరత్తు 

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్ఎస్​ హైకమాండ్​​స్పెషల్​ ఫోకస్​ పెట్టింది.  అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్​తో  పాటు  కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్​ పోటీ చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో  గజ్వేల్ కంటే ఇక్కడే పార్టీ తన బలగాలను కేంద్రీకృతం చేస్తోంది. ఈ నెల 7న నియోజక వర్గ కేంద్రంలో జరిగిన పార్టీ  కార్యకర్తల సభకు  పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్,మున్సిపల్​ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.  కామారెడ్డిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్​లను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు.  బూత్​కో కన్వీనర్​, ఊరికో ఇన్​చార్జి, ప్రతి 100 ‌‌‌‌‌‌‌‌మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జిని నియమించాలని  ఎమ్మెల్యే గంప గోవర్ధన్​, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ ముజీబొద్దిన్, సీనియర్​ నేతలకు కేటీఆర్​సూచించారు.

 
నియోజక వర్గంలో 266 బూత్​లు 

 మంగళవారం  పార్టీ ముఖ్య నేతలు  జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ఫామ్ హౌజ్​లో భేటీ అయి కమిటీల నియమాకంపై  చర్చించారు.  ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంప  గోవర్ధన్​, జిల్లా ప్రెసిడెంట్​ ముజీబొద్ధిన్,  సీనియర్​ లీడర్​ కొమ్ముల తిర్మల్​రెడ్డి,  స్టేట్ లైబ్రరీ చైర్మన్​ ఆయాచితం శ్రీధర్,  నియోజక వర్గంలోని ఆయా మండలాల పార్టీ ప్రెసిడెంట్లు,  ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు.  
 నియోజక వర్గంలో  266 బూత్​లు ఉన్నాయి.  ఒక్కో బూత్​కు ఒక లీడర్​ను కన్వీనర్​గా 266 మంది కన్వీనర్లను నియమిస్తారు.  కొన్ని చోట్ల కో కన్వీనర్లు కూడా ఉంటారు. వీరంతా ఆ బూత్​ పరిధిలో ఓటరుగా ఉన్న వారినే సెలక్ట్​ చేస్తారు. ఆ బూత్​ పరిధిలో ఉండే 100 మంది ఓటర్లకు మరొకరిని ఇన్​చార్జిగా  నియమిస్తున్నారు.  

నియోజక వర్గంలో  2,45,822 మంది ఓటర్లు ఉన్నారు. 100 మందికి ఒకరు చొప్పున అంటే 2,458 మంది అవసరం. గ్రామ స్థాయి లీడర్​, ముఖ్య కార్యకర్తలను ఇన్​చార్జి లుగా తీసుకుంటారు.   వీరందరిని పర్యవేక్షించేందుకు  ఊరికో ఇన్​చార్జి ఉంటారు.  వీరిని పక్క ఊరు లేదా మండల పరిధిలోని లీడర్​కు బాధ్యతలు అప్పగిస్తారు. జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి  ప్రజాప్రతినిధులు,  ముఖ్య లీడర్లను కూడా  గ్రామ స్థాయి,  బూత్​ లెవల్,   ఓటర్ల ఇన్​చార్జిగా  నియమించనున్నారు.   కమిటీల నియమాకాల పక్రియ ఫస్ట్​ రోజు సగం కంప్లీట్ అయినట్లు  పార్టీ వర్గాలు తెలిపాయి.  బుధవారం  ఎంపిక పూర్తి చేయనున్నారు. 

బస్వాపూర్​లో  బూత్​ ఇన్​చార్జిగా ఎమ్మెల్యే గంప  

 సిట్టింగ్​ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ తన సొంతూరు భిక్కనూరు మండలం బస్వాపూర్​లో ఓ పోలింగ్​ బూత్​కు ఇన్​చార్జిగా వ్యవహరించనున్నారు. 

మేనిఫెస్టో తయారీ దిశగా...

నియోజక వర్గానికి స్పెషల్  మేనిఫెస్టో తయారీకి  బీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.  ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధితో పాటు రానున్న రోజుల్లో చేపట్టే పనులను ఇందులో ప్రస్తావిస్తారు. ప్రధానంగా  విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు,  టూరిజం తదితర ఆంశాలకు చేర్చనున్నట్టు చెబుతున్నారు.  గ్రామానికో మేనిఫెస్టో కూడా తయారు చేయాలని కేటీఆర్​ సూచించడంతో వాటి రూపకల్పనలో లీడర్లు బిజీగా ఉన్నారు.