- నియోజకవర్గ ఇన్చార్జ్ మార్పుపై గుర్రుగా మండల కమిటీలు
- మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణనే కొనసాగించాలని డిమాండ్
- చర్లలో ప్రత్యేకంగా సమావేశమైన అసంతృప్తులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ లో వర్గపోరు మొదలైంది. తెల్లం వెంకట్రావుకు టికెట్ కన్ఫామ్అని తెలిసినప్పటి నుంచి లోలోపల రగిలిపోతున్న మండల కమిటీల అధ్యక్షులు, కొత్తగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను మారుస్తారని ప్రచారం ఊపందుకోవడంపై గుర్రుగా ఉన్నారు. ఈ విషయమై వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండల కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు శుక్రవారం చర్ల మండల కేంద్రంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న స్థానికుడు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను తప్పించి త్వరలో ఎమ్మెల్సీ తాతా మధును నియమించబోతున్నారనే ప్రచారం ఊపందుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం హైదరాబాద్‌వెళ్లి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును కలవాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే అసంతృప్తులను బుజ్జగిస్తూ ఒక్కొక్కరినీ తన దారిలోకి తెచ్చుకుంటున్న తెల్లం వెంకట్రావుకు ఇన్చార్జ్మార్పు ప్రచారం కొత్త తలనొప్పిగా మారింది.
40 రోజుల వ్యవధిలోనే..
మొన్నటి వరకు మాజీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంట ఉన్న తెల్లం వెంకట్రావు ఆయనతోపాటే కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అప్పటివరకు తెల్లం వెంకట్రావు భద్రాచలం బీఆర్ఎస్నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించారు. పొంగులేటి, తెల్లం వెళ్లిపోవడంతో క్యాడర్చేజారిపోకుండా ఉండేందుకు బీఆర్ఎస్హైకమాండ్వెంటనే మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను రంగంలోకి దింపింది. సొంత నియోజకవర్గం కావడం, పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైనా ప్రతిసారి సమన్వయం చేయడంలో దిట్టగా పేరుగాంచిన బాలసాని లక్ష్మీనారాయణను ఇన్చార్జ్గా నియమించింది. మండల కమిటీలతో వరుస మీటింగులు పెట్టి, ఏ ఒక్కరూ పార్టీని వదిలి వెళ్లకుండా బాలసాని సక్సెస్అయ్యారు.
అయితే 40 రోజుల వ్యవధిలోనే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్లోకి రావడమే కాకుండా, పార్టీ టికెట్దక్కించుకున్నారు. ఆ టైంలో మండల కమిటీల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చర్ల వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్బోదెబోయిన బుచ్చయ్యకు టికెట్ ఇవ్వాలంటూ అంతా ఏకమై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిశారు. అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, తామేమీ చేయలేమని వారు చేతులెత్తేశారు. ఆ టైంలో కూడా బాలసాని లక్ష్మీనారాయణ మండల కమిటీలను బుజ్జగించి, పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలో బాలసాని లక్ష్మీనారాయణ స్థానంలో ఎమ్మెల్సీ తాతా మధుకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇస్తారంటూ ప్రచారం షురూ అయ్యింది.
ప్రస్తుత పరిస్థితులు బాలసానిని పూర్తిగా పక్కకు నెట్టేసేలా ఉన్నాయని కొందరు మండల కమిటీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. మండల కమిటీలను మారుస్తారని లీకులు ఇస్తుండడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతోపాటు, ముఖ్య లీడర్లు సమావేశమయ్యారు.
బాలసానికే ఇయ్యాలి
మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్గా కొనసాగించాలని కోరుతూ కేటీఆర్‌ను కలుస్తామని చర్ల వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి(భద్రాచలం), జానీ పాషా(దుమ్ముగూడెం, మండల కార్యదర్శి), సోయం రాజారావు(చర్ల అధ్యక్షుడు), కాపుల కృష్ణ( సర్పంచ్, చర్ల), గంపా రాంబాబు(వెంకటాపురం అధ్యక్షుడు), అధికార ప్రతినిధి శివాజీ, లక్ష్మీనారాయణ, పెనుమల్లు రామకృష్ణారెడ్డి(వాజేడు మండల అధ్యక్షుడు), అధికార ప్రతినిధులు ఎల్లయ్య, బల్ల రాంబాబు, సీనియర్‌నాయకుడు మానె రామకృష్ణ తదితరులు శుక్రవారం ప్రకటించారు. పార్టీని గెలిపించే సత్తా మాకు ఉందని, నియోజకవర్గంపై అవగాహన ఉన్న బాలసాని లక్ష్మీనారాయణనే నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.