నష్ట నివారణ చర్యల్లో బీఆర్ఎస్​

  • ఆయన చేరిక కోసం అన్ని పార్టీల ఎదురుచూపు 
  • కేడర్ ఉన్నా వర్గపోరుతో కాంగ్రెస్​ సతమతం 
  • ఓట్లు తెచ్చే లీడర్ల  కోసం బీజేపీ ఎదురుచూపులు
  • పాలేరు నుంచి పోటీ చేసి పట్టు  పెంచుకోవాలనుకుంటున్న వైఎస్​ఆర్​ టీపీ అధ్యక్షురాలు
  • పొత్తులపైనే  వామపక్షాల ఆశ
  • పునర్​ వైభవం కోసం టీడీపీ ఆరాటం

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రస్తుతం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కేంద్రంగా మారాయి. బీఆర్ఎస్​లో ఉండి, ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన ఏ పార్టీలో చేరతారనేదానిపైనే భవిష్యత్​ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. ప్రజాప్రతినిధుల సంఖ్యాబలంతో బీఆర్ఎస్​ ప్రస్తుతం పటిష్టంగా కనిపిస్తున్నా, సమీప భవిష్యత్​లో అదే దాని బలహీనతగా కూడా మారే అవకాశముంది. పార్టీలో ఉన్న వర్గ పోరు కారణంగా, టికెట్ వచ్చే అవకాశాలు లేని వారు ఇతర పార్టీల్లోకి మారే ఛాన్సులున్నాయి. ఒకవైపు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పార్టీ మార్పు ఖాయం కాగా, మరికొందరు నేతలు కూడా ఆయన వెంట నడుస్తున్నారు. వీళ్లే కాకుండా ఇంకొందరు కూడా తమ రాజకీయ అవసరాల దృష్ట్యా పార్టీ మారక తప్పక పోవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో అధికార బీఆర్ఎస్ లో ఉన్న లీడర్ల ఓవర్ ఫ్లో తమకు కలిసి వస్తుందన్న ఆశతో ఇతర ప్రధాన పార్టీలున్నాయి. బీఆర్ఎస్​ నుంచి వలసలపైనే బీజేపీ భవిష్యత్​ ఆధారపడి ఉంది. ఇక కాంగ్రెస్​ నుంచి గతంలో గెలిచిన వాళ్లు వలస వెళ్లినా, పార్టీ కేడర్ ​మాత్రం హస్తం గుర్తునే నమ్ముకొని ఉంది. గతమెంతో ఘనంగా చెప్పుకునే కమ్యూనిస్టుల భవిష్యత్​ కూడా పొత్తులతో తప్పించి, సొంతంగా గెలిచే బలాన్ని కోల్పోయింది. వైఎస్ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల పాలేరులో పోటీ చేస్తే తప్పించి, సొంతంగా ఓట్లు తెచ్చే నాయకులు ఆ పార్టీలో లేరు. దీంతో మాజీ ఎంపీ పొంగులేటి తీసుకునే నిర్ణయం వల్ల ఇక్కడి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.  

గెలిచి వచ్చినోళ్లు..ఓడినోళ్ల మధ్య లొల్లి

గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో గెలిచిన కాంగ్రెస్​అభ్యర్థి కందాల ఉపేందర్​ రెడ్డి, వైరాలో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి రాములునాయక్​, సత్తుపల్లిలో టీడీపీ తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్​లో చేరారు. అప్పటి నుంచి ఇతర పార్టీలో గెలిచి వచ్చిన లీడర్లు, పార్టీ గుర్తుపై పోటీ చేసిన నేతల మధ్య వర్గపోరు మొదలైంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు బీఆర్ఎస్​అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ దక్కుతుందా, లేక గత ఎన్నికల్లో పార్టీ గుర్తుపై ఓడిన అభ్యర్థి బీ ఫామ్​ తెచ్చుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు తమకే పార్టీ టికెట్ ఇస్తుందన్న ధీమాతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

పొంగులేటి వెంట వెళ్లకుండా బీఆర్​ఎస్​ ప్లాన్​

గత ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి చేరికలతో జిల్లాలో బీఆర్ఎస్​ బలమైన శక్తిగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీకి జిల్లాలోనే ముగ్గురు ఎంపీలున్నారు. జిల్లా నుంచి ఇద్దరు నేతలకు ఒకేసారి రాజ్యసభ సభ్యులుగా అవకాశం దక్కింది. గత ఎన్నికల్లో ఉన్న అనుభవాల దృష్ట్యా భవిష్యత్​ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ​ఖమ్మం జిల్లాపై ఫోకస్​ పెట్టారన్న ప్రచారం జరిగింది. మంత్రిగా అవకాశం దక్కించుకున్న పువ్వాడ అజయ్.., ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు, మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పవర్​ సెంటర్లుగా ఉన్నారు. ఉన్న నేతల మధ్య వర్గ విభేదాలున్నా, పార్టీ హైకమాండ్​ఆదేశాలతో ప్రస్తుతం కలిసి కట్టుగా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్​నుంచి పొంగులేటి బయటకు వెళ్తే ఎక్కువ నష్టం జరగకుండా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆ పార్టీ యాక్టివ్​ చేసింది. పేపర్​పై బీఆర్ఎస్​ బలంగా కనిపిస్తున్నా, వచ్చే ఎన్నికల్లో పొంగులేటి ప్రభావంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వీలైనంత తక్కువగా నష్టం జరిగేలా ఇప్పటికే బీఆర్ఎస్​చర్యలు తీసుకుంటోంది. పొంగులేటి వెంట వెళ్లేవారిని కట్టడి చేయడంపై ఫోకస్​ పెట్టింది. 

కాంగ్రెస్​లో భట్టి వర్సెస్​ రేణుకా

గత ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ జిల్లాలోని మధిర, పాలేరు సీట్లను గెల్చుకున్నా, మల్లు భట్టి విక్రమార్క మాత్రమే కాంగ్రెస్​లో మిగిలారు. స్వయంగా సీఎల్పీ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచే ఇతర పార్టీల్లోకి ఎమ్మెల్యేలు వలస వెళ్లడం ఆ పార్టీకి పెద్ద వైఫల్యంగా మిగిలింది. ఇప్పటికీ కాంగ్రెస్​కు పాలేరు, ఖమ్మం, మధిర సెగ్మెంట్లలో మంచి కేడర్​ఉంది. మూడేండ్ల క్రితం జరిగిన ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల్లో 11 డివిజన్లను కాంగ్రెస్​ గెల్చుకున్నది. కొద్దిపాటి ఓట్ల తేడాతో నాలుగైదు డివిజన్లను కోల్పోయింది. మరింత ఫోకస్​పెట్టి ఉంటే అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి ఉండేవాళ్లమని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. ప్రధానంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గాల మధ్య విభేదాలే కాంగ్రెస్ ​వైఫల్యాలకు కారణంగా చెబుతున్నారు. కేడర్ ​ఉన్నా ముఖ్య నేతల మధ్య సఖ్యత లేకపోవడం, రెగ్యులర్​గా ఒకవర్గంపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం వంటి కారణాలతో పార్టీ కేడర్​ నిరుత్సాహంలో ఉంది. 

ఉనికి కోల్పోయే దశలో కమ్యూనిస్టులు

రాష్ట్రంలో ఖమ్మం అంటే కమ్యూనిస్టుల గడ్డ అనే పరిస్థితి నుంచి, ప్రస్తుతం ఉనికిని కోల్పోయే దశకు చేరుకున్నారు. ఏ నియోజకవర్గంలో అయినా పొత్తులతో ఇతర పార్టీలను ఓడించే శక్తి తప్పించి, సొంతంగా గెలిచే బలాన్ని కోల్పోయారు. వైరా నియోజకవర్గంలో సీపీఐ, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో సీపీఎంలకు బలమైన కేడర్ ​ఉంది. మిగిలిన సెగ్మెంట్లలో ఒకటి రెండు మండలాలకు ఆ పార్టీలు పరిమితమయ్యాయి. రెండు పార్టీలకు కలిసి పదుల సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్​తో పొత్తు లో భాగంగా వచ్చే ఎన్నికల్లో వైరా సీటును సీపీఐ, పాలేరు, మధిర సెగ్మెంట్లను సీపీఎం తమకు కేటాయించాలని పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజాపంథా పార్టీలు కూడా ప్రజా సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉనికి కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాయి.  మూడు దశాబ్దాల్లో జిల్లాలో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీకి ఇప్పటికీ ఖమ్మంలో కేడర్​ఉంది. రెండు నెలల క్రితం ఖమ్మంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన బహిరంగసభతో మరోసారి జిల్లాపై టీడీపీ ఫోకస్​పెట్టింది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గెలిచిన స్థానం సత్తుపల్లి, అశ్వారావుపేట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనివే కావడం గమనార్హం. ఏపీని ఆనుకొని ఉన్న జిల్లా కావడంతో ఆంధ్రప్రదేశ్​ రాజకీయ పరిణామాల ప్రభావం ఇక్కడ ఉంటుంది. అయితే ఒకరిద్దరు మాజీ నేతల చేరికపై టీడీపీ అధిష్టానం కొంత ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. 

బీజేపీకి మాస్ ​లీడర్ ​కావాలె

ఇప్పటి వరకు బీజేపీకి ఖమ్మం జిల్లాలో పెద్దగా బలం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క చోట కూడా 2 వేలకు మించి ఓట్లు రాలేదు. ఖమ్మం కార్పొరేషన్​ఎన్నికల్లో మాత్రమే ఒక డివిజన్​ను గెల్చుకుంది. గతేడాది జరిగిన రాజకీయ పరిణామాలు, ఆ పార్టీ కార్యకర్త సాయి గణేశ్​ఆత్మహత్య ఇతర కారణాలతో బీజేపీకి కొంత ఊపు వచ్చింది. అయితే గంపగుత్తగా ఓట్లు రాల్చగలిగిన మాస్​ లీడర్​ ఎవరూ పార్టీలో లేకపోవడం పెద్ద మైనస్​. సొంతంగా పెద్ద లీడర్లు లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి లీడర్ల చేరికలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అందుకే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారముంది. ప్రస్తుత పరిస్థితుల్లో పొంగులేటి రాక ఖాయమని, బీజేపీ లీడర్లు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. టికెట్ దక్కని పరిస్థితుల్లో ఇతర నియోజకవర్గాల్లో కూడా కొందరు లీడర్లు ఎన్నికల సమయంలో వస్తారని లెక్కలు వేసుకుంటున్నారు.  

వైఎస్​ఆర్​టీపీ కన్ను 

వచ్చే ఎన్నికల కోసం ఖమ్మం జిల్లాపై వైఎస్ఆర్​ తెలంగాణ పార్టీ ఫోకస్​ పెట్టింది. పాలేరులో ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో కొంత కదలిక కనిపిస్తున్నా, మిగిలిన చోట్ల ఎక్కడా ఆ పార్టీకి కార్యకర్తల్లేరు. అయితే ఎన్నికలు సమీపించేకొద్దీ చాలా మార్పులుంటాయని ఆ పార్టీ లీడర్లు కామెంట్ చేస్తున్నారు. పొంగులేటి కూడా వైఎస్ఆర్​టీపీలోకి వస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఈ దిశగా ఎలాంటి సానుకూల ప్రకటన చేయకపోయినా, వైఎస్​పై ఉన్న అభిమానం, ఆ కుటుంబంతో ఉన్న రాజకీయ సంబంధాలతో చేరిక ఉండొచ్చన్న ప్రచారముంది. దీంతో పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ పార్టీలోకి వెళ్తారన్నదానిపై మిగిలిన పార్టీల్లో మార్పులు చేర్పులకు కారణమవుతాయన్న అంచనాలున్నాయి. 


పువ్వాడ అజయ్

అనుకూల అంశాలు

  •     అనుకున్న దానికోసం కష్టపడే తత్వం
  •     నియోజక వర్గంపై పూర్తి స్థాయి అవగాహన  
  •     ప్రజలకు అందుబాటులో ఉండడం
  •     గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం
  •     ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థి ఎవరూ లేకపోవడం..

ప్రతికూల అంశాలు.

  •     వరుసగా రెండు సార్లు గెలవడం వల్ల వచ్చే వ్యతిరేకత
  •     కార్పొరేటర్లు, అనుచరుల తీరుతో వస్తున్న వివాదాలు

భట్టి విక్రమార్క

అనుకూల అంశాలు 

  •     హ్యాట్రిక్ విజయాలు..ప్రజా సంబంధాలు.. 
  •      కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న కేడర్​ 

ప్రతికూల అంశాలు

  • -     విపక్ష నేతగా ఉండడంతో ప్రభుత్వం నుంచి నిధులు తేలేకపోవడం 
  • -     ఈ సెగ్మెంట్​పై అధికార పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం

కందాల ఉపేందర్ రెడ్డి

అనుకూల అంశాలు

    కష్టం వస్తే ఆదుకుంటాడనే పేరు  
    ఎవరి కుటుంబసభ్యులు చనిపోయినా రూ.10 వేలు సాయం  

ప్రతికూల అంశాలు

  •     ముఖ్య అనుచరుల తీరుపై ప్రజల్లో వ్యతిరేకత  
  •     కొందరు చెప్పినట్టు మాత్రమే నడుచుకుంటారనే  విమర్శ
  •     సొంత పార్టీలో వర్గ విభేదాలు

రాములు నాయక్

అనుకూల అంశాలు

  • --    భోళా మనిషి అనే పేరు
  • --    ప్రజలకు అందుబాటులో ఉండడం 

ప్రతికూల అంశాలు

  • --    సొంత పార్టీలో ఉన్న వర్గ పోరు
  • --    ఇన్నాళ్ల నుంచి సొంత వర్గంలో ఉన్నవాళ్లు వేరు కావడం
  • --    కుమారుడు షాడో ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు
  • --    నియోజక వర్గంపై పట్టు లేకపోవడం, ముఖ్య అనుచరులు దూరం కావడం

సండ్ర వెంకటవీరయ్య

అనుకూల అంశాలు

  • --    సుదీర్ఘ రాజకీయ అనుభవం, హ్యాట్రిక్ విజయం 
  • --    నియోజకవర్గంలో సత్సంబంధాలు, ప్రతి ఒక్కరినీ పేరుతో పిలవడం
  • --    కలుపుకుపోయే వ్యక్తిత్వం

ప్రతికూల అంశాలు..

  • --    మూడుసార్లు గెలవడం వల్ల వచ్చే వ్యతిరేకత
  • --    పార్టీలో అంతర్గత వర్గపోరు