నేను అసలు బాంబులకే భయపడలేదు. ఈ సుతిలీ బాంబులకీ భయపడను. చిట్టినాయుడు బెదిరింపులకు భయపడేది లేదు అన్న కేటీఆర్....బస్తీమే సవాల్.... అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ...ఓనర్... కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కు అంకితమైన పరిస్థితుల్లో, తనకు ఆ యాజమాన్య హక్కులు లభించినట్టు కేటీఆర్ భావించడంలో తప్పు లేదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్పు చేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలను ప్రభావితం చేయాలని అప్పట్లో కేసీఆర్ అనుకున్నారు. ముందుగా ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించారు. దేశమంతటా సుడిగాలి పర్యటన కోసం ఒక విమానాన్ని కొనుగోలు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో హాంగర్లో ఉన్నట్టు ఒక ప్రచారం ఉన్నది.
తెలంగాణ ప్రజల తిరస్కరణకు గురి కావడం తీవ్ర పరాభవంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు భావిస్తున్నారు. ఆయన ఆ పరాభవ భారంతోనే ఫార్మ్ హౌస్ నుంచి వెలుపలికి రావడం లేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అక్కడే ఆయన 'దర్శన భాగ్యం'లభిస్తున్నది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం చెలరేగిపోతున్నారు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు. జైలుకు పోవడానికి కూడా వెనుకాడబోనని ఆయన చాలెంజ్ విసురుతున్నారు.
నవంబర్‌లో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తమ పార్టీ వైఖరిని ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఫార్మ్ హౌస్నుంచి ఎలాంటి పత్రికా ప్రకటన కూడా వెలువడలేదు. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో తన తెలివి తేటలు ఏమిటో, తన యుద్ధనీతి ఏమిటో చాటి చెప్పాలని కేసీఆర్ ఎంతో ఆశపడ్డారు. కానీ, ఇక పరిపాలించింది చాలు అని కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఫార్మ్ హౌస్‌కే పరిమితం చేశారు. ఇది కూడా ఒక రకంగా విశ్రాంతి తీసుకోవడానికి, భవిష్యత్తు వ్యూహాలు రచించడానికి సమయాన్ని ఖర్చు చేస్తున్నారని సమాచారం. రేవంత్ రెడ్డిపై పోరాటానికిగాను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.
కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని ఆ రాష్ట్రంలో ఉన్న బంధువులకు, దోస్తులకు గట్టిగా చెప్పండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ వారికి అక్కడ చుట్టాలు, దోస్తులు ఉంటారు. కాంగ్రెస్ వల్ల మేం మోసం పోయాం. మీరు మోసపోకండి అని చెప్పండి. రైతు భరోసా, తులం బంగారం,పెన్షన్లు, స్కూటీలు అని కథలు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మళ్లా మోసం జరుగుతదని గట్టిగా చెప్పండి అని కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక సరిహద్దులను మూసేయాలని, భద్రతను కట్టుదిట్టం చేయాలని శివసేన నాయకుడు కిరణ్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక నుంచి మహారాష్ట్రకు వందల కోట్ల నగదును తరలించే అవకాశం ఉందని కిరణ్ పేర్కొన్నారు. కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారింది. ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నిధులు సమకూర్చుతున్నారు అని కేటీఆర్ ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అని ఆయన నిజం ఒప్పుకున్నారు. అయితే, అది తమ పార్టీకి వర్తించదని బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం ఒక ట్రాజెడీ.
ప్రజల తీర్పు శిరోధార్యం
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది నెలలు కూడా గడవకముందే కేసీఆర్ మళ్ళీ రావాలని జనం కోరుకుంటున్నారని..కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యల పట్ల ప్రజలు, మేధావులు ఆక్షేపిస్తున్నారు.'ప్రజలే చరిత్ర నిర్మాతలు' అని మావో అన్నాడు. కానీ 'తానే చరిత్ర నిర్మాత' అని కేసిఆర్ భావన. ప్రజల తీర్పు శిరోధార్యం అన్నది ప్రతి రాజకీయ నాయకుడూ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో అధికార లేమితో కొట్టుమిట్టా డుతున్న బీఆర్ఎస్ నాయకత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ఉద్యమం పుట్టింది గ్రామాల్లోనే అనే సంగతి మరచిపోతే ఎలా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
2014, 2018లలో రెండుసార్లు కేసీఆర్ పార్టీ అధికారంలోకి రావడానికి గ్రామీణ ఓటర్లే కారణం. కానీ, ఒక్కసారి ఓటమి పాలు కాగానే గ్రామీణ ఓటర్లు అమాయకులు..కాంగ్రెస్ బూటకపు హామీలకు బోల్తా పడ్డారు అని వ్యాఖ్యానిస్తున్నారు. గెలుపోటములను సమానంగా పరిగణించవలసిన రాజకీయ పరిణతి కేటీఆర్‌కు లేదంటే అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి? అధికారం కోల్పోగానే 'మిన్ను విరిగి మీద పడినట్టు'గా బీఆర్ఎస్ నాయకులు అభద్రతకు, భయానికి లోనవుతున్నారు.
బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు లభించగా, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకొని పోయింది. కేసీఆర్, కేటీఆర్ అంచనాలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లోనూ తలకిందులయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పది నెలల పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని ఏ కొలమానంతో కేటీఆర్ నిర్ధారణకు వస్తున్నారో తెలియదు. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనే డిమాండు ప్రజల్లో ఎక్కడా లేదు. అది కేసీఆర్, కేటీఆర్‌ల వ్యక్తిగత డిమాండు. అందుకే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్‌ను మళ్లీ తీసుకొస్తాం అని ప్రజలు అంటున్నారు అనే ప్రచారానికి బీఆర్ఎస్ తెరలేపింది. ఈ అంశాన్ని తమకు భజన చేసే సోషల్ మీడియా చానళ్లు, వెబ్ సైట్లలో ఊదరగొడుతున్నారు.
రేవంత్ భయంతోనే ఫోన్ ట్యాపింగ్
రేవంత్ రెడ్డి సీఎం అవుతారని అనుకుంటే 30 సీట్లు కూడా రావనడం హాస్యాస్పదం. సూటిగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కేసీఆరే కారకుడు. రేవంత్ రెడ్డితో తమ అధికారానికి ముప్పు వాటిల్లవచ్చునని పసిగట్టకపోతే, రేవంత్ ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఫోన్ ట్యాపింగ్ సహా, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసి ఆయన కదలికలు ఎందుకు సేకరించినట్టు? ఆయన ఫోన్ సంభాషణలు ఎందుకు విన్నట్టు? 2023 డిసెంబర్ ఎన్నికల్లో మూడవసారి కేసీఆర్ అధికారంలోకి రావడానికిగాను ప్రతిపక్షాల డబ్బు రవాణాను అడ్డుకున్నాం.
వారి కార్యకలాపాలను ఫోన్ సంభాషణల ద్వారా విని వాటిని బీఆర్ఎస్ కీలక నేతలకు రిపోర్టు ఇచ్చే వాళ్ళం. బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బును పోలీసు వాహనాల్లోనే తరలించాం అని ఫోన్ ట్యాపింగు కేసు నిందితులు తమ ఇంటరాగేషన్‌లో తెలిపారు. ఎస్.ఐ.బి. మాజీ చీఫ్ ప్రభాకరరావు సారథ్యంలో ఒక ప్రత్యేక బృందం కేసీఆర్‌ను మరలా అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కుట్రలు, కుతంత్రాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దర్యాప్తులో బయటపడ్డాయి.
ప్రజలు అమాయకులు కారు
ఇక రేవంత్ పనయిపోయిందనిప్రజల్లో బలవంతంగా ఒక అభిప్రాయాన్ని నాటడానికి ప్రయత్నం జరుగుతోంది. కానీ, నీళ్లు ఏవో.. పాలు ఏవో తెలియని అమాయకులు కాదు ప్రజలు. కాగా, కేసీఆర్ తనను తాను ఒక 'కర్మాగారం'గా భావించుకొని ఉద్యమ కాలంలో తాను వేలాదిమందిని ఉత్పత్తి చేసినట్టు చెబుతుంటారు. ఆయన తయారు చేసినవారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరిపోయారు? 'మేం మోసపోయాం, మీరు మోసపోకండి' అని మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేయాలని రైతులు, పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ఇచ్చిన పిలుపుపై ప్రజల్లో స్పందన మాత్రం ఎక్కడాకానరావడం లేదు.
- ఎస్.కే. జకీర్,సీనియర్ జర్నలిస్ట్–