- ఆ పార్టీకి రాష్ట్రం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం
- బడ్జెట్లో కేంద్ర అన్యాయంపై చర్చకు ఆశించిన మద్దతు ఇవ్వలేదు
- బొగ్గు గనుల వేలం, ఏపీలోఏడు మండలాల విలీనానికి బీఆర్ఎస్సే కారణమని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఏపీకి నిధులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. విభజన చట్టం కింద రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులే తాము అడుగుతున్నామని అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో భట్టి మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పు కుంటున్న బీఆర్ఎస్.. కేంద్రం చూపిన వివక్షపై గట్టిగా వాదిస్తుందని ఆశించాం.
కానీ, ఆ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తెలుస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతోనే సభలో తీర్మానం చేయాల్సిన అంశంపై కాకుండా.. మిగిలిన అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు” అని భట్టి అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పెట్టిన చర్చకు ప్రతిపక్షాల నుంచి ఆశించిన మద్దతు రాలేదని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు వేలం వేయడానికి బీఆర్ఎస్సే కారణం. ఆనాడు పార్లమెంట్లో ఎంఎంబీఆర్ చట్టానికి బీఆర్ఎస్సే మద్దతు ఇచ్చింది. ఏపీలో ఏడు మండలాల విలీనం కావడానికి కూడా బీఆర్ఎస్సే కారణం. దీనిపై ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తామని చెప్పిన బీఆర్ఎస్.. పదేండ్లు అధికారంలోకి ఉండి పట్టించుకోలేదు” అని ఫైర్ అయ్యారు. బడ్జెట్లో కేంద్రం నిధులు ఇవ్వనందుకు సీఎం సహా మంత్రులందరూ చచ్చేదాకా ఆమరణ నిరాహార దీక్ష చేయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
మేం బీఆర్ఎస్ లెక్క కాదు..
రాష్ట్ర విభజన చట్టంలోని హామీల మేరకే ఏపీకి నిధులు ఇస్తున్నామన్న కేంద్రం.. అదే విభజన చట్టం ప్రకారం ఏర్పడిన తెలంగాణను మాత్రం ఎందుకు విస్మరించిందని భట్టి ప్రశ్నించారు. అసలు రాష్ట్రాన్ని విభజించిందే తెలంగాణ ప్రయోజనాల కోసమని గుర్తు చేశారు. ‘‘అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సభా నాయకుడికి అనుభవం లేదంటూ ఎమ్మెల్యే కేటీఆర్ అవహేళన చేయడం సరికాదు. రాజకీయ ప్రయోజనాన్ని పక్కనపెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో బీఆర్ఎస్ కలిసిరావాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏదైనా అంశాన్ని చర్చకు పెట్టిన తర్వాతే చెప్పేవారు.
కానీ, మేం ఏ అంశంపై చర్చించేది ముందురోజే చెప్తున్నం” అని భట్టి పేర్కొన్నారు. ‘‘విభజన చట్టం ప్రకారం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐఐఎం, నవోదయ స్కూల్స్, వరంగల్–హైదరాబాద్, హైదరాబాద్–నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లు, మూసీ ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ, ట్రిపుల్ ఆర్కు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కానీ, బడ్జెట్లో పైసా కూడా ఇవ్వక పోవడం బాధాకరం” అని భట్టి అన్నారు.
ఉద్యోగులకు డీఏపై త్వరలోనే నిర్ణయం..
గృహజ్యోతి పథకంతో పేదలకు ఎంతో మేలు జరుగుతున్నదని భట్టి అన్నారు. ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. ఈ పథకం కింద ఈ నెల 22 నాటికి 46.19 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. ఫ్రీ కరెంట్ బిల్లులకు సంబంధించి రూ.640.94 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు తొందర్లోనే శుభవార్త వింటారని, డీఏపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి ప్రకటించారు.