బీఆర్​ఎస్​కు కోవర్టుల భయం.. పక్కలో బల్లెంలా అసమ్మతి నేతలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్​ను కోవర్టుల భయం వెంటాడుతోంది. ఎవరు  తమ వారు, ఎవరు బయటి వారో అర్థం కాని పరిస్థితిలో  బీఆర్​ఎస్​ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇల్లెందుతో పాటు కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ తరుఫున పోటీ చేసే అభ్యర్థులకు  అసమ్మతి నేతలు  పక్కలో బల్లెంలా మారారు. కేసీఆర్​ టికెట్లు ప్రకటించిన తర్వాత జిల్లా బీఆర్​ఎస్​ లో అసమ్మతి రోజు రోజుకు రాజుకుంటుంది. ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ లీడర్లు  తమతో ఉంటూనే ఎప్పటికప్పుడు తమ  అపోజిట్​  అభ్యర్థులకు  లీక్​లు ఇస్తున్నారని  బీఆర్​ఎస్​  అభ్యర్థులు  ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇల్లందు నియోజకవర్గంలో ముఖ్య నేతలు అసమ్మతితో రగులుతున్నారు. బీఆర్​ఎస్​ తరుపున పోటీ చేయనున్న ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియను కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆమె భర్త  ఆగడాలను భరించలేకపోతున్నామని   పలువురు ముఖ్య నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. 

బీఆర్​ఎస్​లో టికెట్ల ప్రకటనకు ఒక్కరోజు ముందు ఇల్లందులో ముఖ్య నేతలు మీటింగ్​ పెట్టుకున్నారు. హరిప్రియకు టికెట్​ ఇవ్వవద్దని    డిమాండ్​ చేశారు.   ప్రభుత్వ విప్​, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో పాటు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదనరావు వేర్వేరుగా కొత్తగూడెంలోని కోనేరు సత్యనారాయణ ఇంట్లో ఇటీవల కలిశారు.  కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో ఉండే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాత్రం ఇప్పటి వరకు కోనేరును కలువలేదు. బీఆర్​ఎస్​ తరుపున వనమా వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. కోనేరు సత్యనారాయణకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మధ్య ఏండ్ల కాలంగా రాజకీయ విభేదాలున్నాయి. ఎమ్మెల్యేతో పాటు ఆయన కొడుకు వనమా రాఘవపై రాజకీయంగా  కోనేరు దుమ్మెత్తి పోసిన సందర్భాలున్నాయి.   ఈ క్రమంలో నియోజకవర్గంలో వనమాతో కోనేరు కలిసి పనిచేస్తారా లేదా అనే మీమాంసలో కార్యకర్తలున్నారు.  కొత్తగూడెం మున్సిపాలిటీలో కూడా పలువురు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. 

వనమా ప్రోగ్రాంలకు కొన్నింటికి కలిసి వస్తే మరికొన్నింటికి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలోని పలువురు నేతలు చాపకింద నీరులా వనమాకు వ్యతిరేకంగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరో వైపు స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​ గడల శ్రీనివాసరావు టికెట్​ కోసం ప్రయత్నిస్తూ వనమాకు పక్కలో బల్లెంలా మారారు. చివరి క్షణంలో బీఫాం గడలకే దక్కుతుందంటూ ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. టీబీజీకేఎస్​లోని ఓ వర్గం వనమాకు కొంత దూరంగానే ఉంటుంది. పైకి మాత్రం వనమా జై అంటున్నా వారు వనమా పట్ల వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ తరుఫున పోటీ చేస్తున్న తెల్లం వెంకట్రావ్​  నియోజకవర్గ ఇన్​చార్జి బాలసాని లక్ష్మీనారాయణతో సంబంధం లేకుండా ప్రభుత్వ విప్​ రేగా కాంతారావుతో కలిసి వెళ్లడం కార్యకర్తల్లో చర్చానీయాంశంగా మారింది.  ఇప్పటికే భద్రాచలం టికెట్​ తెల్లం వెంకట్రావ్​కు ఇవ్వవద్దని వాజేడు మార్కెట్​ కమిటీ చైర్మన్​ బుచ్చయ్య రేగాకు విన్నవించిన దాఖలాలున్నాయి. భద్రాచలం నుంచి తాను బరిలో ఉంటానని బుచ్చయ్య తన అనుచరుల వద్ద పేర్కొంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తెల్లం వెంకట్రావ్​కు, నియోజకవర్గ ఇంచార్జీ బాలసాని లక్ష్మీనారాయణల మధ్య పెద్దగా సఖ్యత లేదు. 

కాంగ్రెస్​లో ఆశావహుల పోరు

మరోవైపు కాంగ్రెస్​లో ఆశావహులకు టికెట్​ టెన్షన్​ పట్టుకుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తీరుపై జిల్లాలోని పలువురు కాంగ్రెస్​ నేతలు గుస్సాగా ఉన్నారు.   అందరిని కలుపుకొనిపోవడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శలు   వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి వారు టికెట్​ తమకే కన్ఫర్మ్​ అవుతుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గాంధీభవన్లో దరఖాస్తుల వడబోత సాగుతుండడంతో కాంగ్రెస్​లోని పెద్దలతో మంతనాలు సాగిస్తూ టికెట్​ దక్కించుకునేందుకు భారీ స్థాయిలో ఆశావాహులు పావులు కదుపుతున్నారు. 

 కాంగ్రెస్​లో టికెట్ల పోటీ ..

కాంగ్రెస్​లో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడంతో ఆ పార్టీ అధిష్టానం వడపోత కార్యక్రమం చేపట్టింది. భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు దాదాపుగా టికెట్​ ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.  ఇల్లెందు నియోజకవర్గంలో ఆశావహుల సంఖ్య రాష్ట్రంలో అత్యధికంగా ఉండడం గమనార్హం. దాదాపు 36మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ఇల్లెందు నియోజకవర్గం టికెట్​ రేసులో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, ఎస్టీ విభాగం రాష్ట్ర నేతలు చీమల వెంకటేశ్వర్లు, మంగీలాల్​ నాయక్​తో పాటు ఇస్లావత్​ లక్ష్మణ్​ నాయక్, డాక్టర్​ రవిబాబు, డాక్టర్​ రాంచందర్  ప్రధానంగా పోటీలో ఉన్నారు. అశ్వారావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణతో పాటు పలువురు టికెట్​ రేసులో ఉండగా వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఫైనల్​ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం పార్టీలో నెలకొంది. పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు ధనసరి సూర్య ప్రధానంగా  టికెట్​ బరిలో ఉన్నారు. 

ఈ నియోజకవర్గంలో మొత్తం 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు, పోట్ల నాగేశ్వరరావు, లక్కినేని సురేందర్​, డాక్టర్​శంకర్​ నాయక్​, ఊకంటి గోపాల్​రావు ప్రధానంగా రేసులో ఉన్నారు. వీరితో పాటు మొత్తం పది మంది టికెట్​ను ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. మరో వైపు ఎవరికి వారు టికెట్​ మాకే కన్ఫర్మ్​ అంటూ ప్రచారాన్ని చేపడ్తుండడం  విశేషం. ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఆశావాహులు తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూనే పార్టీలోని ముఖ్య నేతలతో తమకే టికెట్​ ఇప్పించే విధంగా చూడాలని మంతనాలు చేస్తూ పైరవీలు సాగిస్తున్నారు.