10 ఏండ్ల బీసీల బడ్జెట్ ​గాయబ్​!.. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీనే

10 ఏండ్ల బీసీల బడ్జెట్ ​గాయబ్​!..  బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీనే

మూడో పర్యాయం తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోతున్న ఎన్నికల్లో  బీసీ వాదం పార్టీలకు నినాదంగా మారినట్లుగానే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోగానీ, ఇటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోగానీ  ఏ పార్టీ కూడా ఎన్నికల సందర్భంలో బీసీల అభివృద్ధి, సంక్షేమ అజెండాను రాజ్యాధికారం, రాజ్యాధికారంలో వాటా అంశాలను తెరపైకి తీసుకురాలేదు. 58 సంవత్సరాలు కొనసాగిన సమైక్యాంధ్రప్రదేశ్​లో 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఒక్క బిసీకి కూడా ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదు. 10 సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా బీసీలకు రాజ్యాధికారంలో సముచితమైన స్థానం వాటా దక్కలేదనే అసంతృప్తి బీసీలలో గూడుకట్టుకొని ఉంది. 

ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి హామీ, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ బీసీల పట్ల తమ వైఖరిని ప్రకటించి ఒక విధంగా అధికార బీఆర్ఎస్​ను ఆత్మ రక్షణలోకి నెట్టి వేశాయనే చెప్పాలి.  బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనా కాలంలో బీసీలకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం కలుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 54 శాతానికి పైగా జనాభా ఉన్న బలహీనవర్గాల ఓట్లను తమ వైపునకు తిప్పుకోవటానికి అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలలో బీసీలకు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రెండు శాసనసభ స్థానాలు అంటే దాదాపు 34 శాసనసభ స్థానాలు కేటాయిస్తామనే హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ, ఆ హామీని నిలబెట్టుకోలేక కేవలం 23 శాసనసభ స్థానాలను మాత్రమే కేటాయించి విమర్శల పాలైంది. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ సామాజిక వర్గ ఓట్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఐదు సంవత్సరాలలో  బీసీల సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయల ఖర్చు, బీసీలకు సబ్ ప్లాన్, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీల రిజర్వేషన్ల పరిరక్షణ, బీసీ విద్యార్థులకు ఆంక్షలు లేకుండా పూర్తి ఫీజు రియింబర్స్​మెంట్​ చెల్లింపు, బీసీ కార్పొరేషన్ ద్వారా 10 లక్షల రూపాయల రుణాలు లాంటి హామీలతో పాటు వివిధ కులాల సంక్షేమానికి కార్పొరేషన్ బోర్డుల ప్రకటనతో బీసీలను ఆకర్షించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది.

బీసీ ముఖ్యమంత్రి అస్త్రంతో బీజేపీ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలుపు కోసం సోషల్ ఇంజినీరింగ్​లో  భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్​గా నియమించింది. ఎస్సీ వర్గీకరణ  హామీతోపాటు తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే హామీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కంటే ఎక్కువగా బీసీ అభ్యర్థులను ఎన్నికలలో నిలబెట్టింది. బీజేపీ. బీసీ సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామని ప్రకటించిన తర్వాత ఒక విధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపైన ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. బీసీ ముఖ్యమంత్రి హామీ బీజేపీ బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది. బీసీ ముఖ్యమంత్రి హామీ  తెలంగాణలో బీజేపీ బలపడటానికి, పార్టీకి బలమైన పునాది వేసే హామీగానే బీజేపీ భావిస్తున్నది.

భవనాలు కాదు, భవిష్యత్తు ఏది?

ఆత్మగౌరవ భవనాలు, గొర్రెలు, చేపల పంపిణీ, మద్యం షాపుల కేటాయింపులలో రిజర్వేషన్లు, ధోబిఘాట్లకు, సెలూన్లకు, ఉచిత విద్యుత్ వలన బీసీలకు పెద్దగా ఉపయోగం లేదనే విషయాన్ని గమనించాలి. ఫీజు రియింబర్స్​మెంట్​ ఇవ్వకుండా, బీసీ విద్యార్థులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వకుండా, బీసీ కుల వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందనే చెప్పాలి. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కాదు, భవిష్యత్తు ముఖ్యమనే విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందనే చెప్పాలి. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీని, కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటనని విమర్శించి బీఆర్ఎస్ తన బీసీ వ్యతిరేక భావజాలాన్ని మరొకసారి నిరూపించుకుంది. కాబట్టి బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక ప్రభుత్వంగా భావించాల్సి వస్తున్నది. బీసీల అభివృద్ధి, సంక్షేమం పట్ల బీఆర్ఎస్ పార్టీ తన వైఖరి చెప్పకుండా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల హామీలను విమర్శించటమంటే, వారి బీసీ వ్యతిరేక భావజాలాన్ని స్పష్టం చేస్తుంది. కాబట్టి బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా, పార్టీల జెండాలు మోసే కూలీలుగా కాకుండా, తమ అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధతతో వ్యవహరించే వారికి మద్దతు ఇచ్చే సమయం ఆసన్నమైందని గుర్తిస్తే బీసీల అంతిమ లక్ష్యమైన రాజ్యాధికారం వైపు అడుగులు పడతాయి.

బీసీల విద్య, వృత్తులపై ఆంక్షలు

బీసీ విద్యార్థులకు ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించకుండా ఆంక్షలు, నిబంధనలు పెట్టారు. బీసీ విద్యార్థుల ఫీజు రియింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసినారు. పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం కింద బీసీ విద్యార్థులను చాలా తక్కువ సంఖ్యలో విదేశాలకు పంపిస్తున్నారు. ఆర్భాటంగా గొర్రెల పంపిణీని ప్రారంభించి ఐదు సంవత్సరాలలో రెండో విడత గొర్రెల పంపిణీ కూడా పూర్తి చేయలేకపోయారు. శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి కేవలం 23 మంది బీసీలకు మాత్రమే అవకాశం కల్పించి అన్యాయం చేశారు. మంత్రిమండలిలో సరైన ప్రాతినిధ్యం కల్పించలేదు. బీసీలకు ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించారు. స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి బీఆర్ఎస్ పాలనలోనే 23 శాతానికి తగ్గిపోయినాయి. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తరువాత గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో బీసీలను విస్మరించి వ్యతిరేకంగానే పని చేసిందని చెప్పాలి.

10 ఏండ్ల బీసీల బడ్జెట్ ​గాయబ్​!

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో బీసీల అభివృద్ధి సంక్షేమం పెనం మీద నుంచి పొయ్యిలో పడిన విధంగా తయారైందనే అభిప్రాయం బీసీ సామాజిక వర్గాలలో ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వలన అటు అధికారంలోనూ ఇటు ఆర్థికంలోనూ బీసీ సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన 10 బడ్జెట్​లలో  బీసీలకు మూడు శాతం కంటే తక్కువ నిధులనే కేటాయించారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్​లకు నిధుల కేటాయింపులో కోత విధించారు. కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. కుల ఫెడరేషన్లకు నామమాత్రంగా నిధులు కేటాయించి ఖర్చు చేయలేదు. బీసీ కుల వృత్తిదారులకు ఇచ్చే వ్యక్తిగత సబ్సిడీ రుణాలను నిలిపివేసినారు. హామీ ఇచ్చి కూడా బీసీ సబ్ ప్లాన్ ప్రకటించలేదు. 

- డాక్టర్ తిరునాహరి శేషు,బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్