- చేజారుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
- పార్టీకి దూరమవుతున్న సర్పంచులు
- కేసీఆర్ తీరుపై కేడర్‌లో అసంతృప్తి
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి ప్రచార కష్టాలు తప్పేలా లేవు. ఓపక్క ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇంకోపక్క మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయి. ఇప్పటికే సర్పంచులూ దూరమయ్యారు. ఇవన్నీ కలిపి క్షేత్రస్థాయిలో ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజలు వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయి కేడర్‌నుంచి సరైన స్పందన లేదన్న వాదన వినిపిస్తున్నది.
మున్సిపాలిటీలు ఖల్లాస్..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు బీఆర్ఎస్నుంచి చేజారుతున్నాయి. రాష్ట్రంలో 129 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే దాదాపు 50 దాకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చేశాయి. వరుస అవిశ్వాసాలతో బీఆర్ఎస్ చైర్పర్సన్ల పదవులు పోతున్నాయి. కొందరు బీఆర్ఎస్చైర్పర్సన్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. పార్లమెంట్‌ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు బీఆర్ఎస్ను కలవరపెడుతున్నాయి. ఓపక్క ప్రకటించిన అభ్యర్థులూ పార్టీ తీరు నచ్చక బయటకొచ్చేస్తుండడం, ఉన్నోళ్లూ పోటీకి ముందుకు రాకపోతుండడంతో కేడర్‌లోనూ తీవ్ర అయోమయం నెలకొన్నట్టు పార్టీ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొందరు కార్యకర్తలూ ప్రచారానికి ముందుకు రావడం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. దాంతో పాటు సర్పంచులూ బీఆర్ఎస్ కు దూరమయ్యారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ఏకగ్రీవమైన పంచాయతీలకూ ఇస్తామన్న నిధులు ఇవ్వకపోవడంతో చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ నిధులను దారి మళ్లించి వాడుకోవడంతో సర్పంచులు ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్పార్టీకే చెందిన కొందరు సర్పంచులు ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
వాళ్ల సహకారం లేకుంటే కష్టమే..
ఇన్నాళ్లూ బీఆర్ఎస్పార్టీలో ఉన్న నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా మారిపోతున్నారన్న ఆవేదన బీఆర్ఎస్ కేడర్‌లో కనిపిస్తున్నది. గ్రామ, మండల, మున్సిపాలిటీ స్థాయిలో ప్రజలకు చేరువ కావాలంటే సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్పర్సన్లు, మేయర్ల పాత్ర కీలకమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వాళ్లు పార్టీకి అనుకూలంగా ఉండి ప్రచారానికి వస్తేనే గ్రామ, బూత్‌స్థాయిలో పార్టీకి అనుకూలంగా ఉంటుందని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. వాళ్లందరూ వెళ్లిపోతుండడంతో వారి అనుచరులూ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తున్నది.
కింది స్థాయి కార్యకర్తలతోనే జనాలకు మంచి సంబంధాలు ఉంటాయని, వారు కూడా పార్టీకి దూరమవుతుండడంతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ సీనియర్లీడర్ ఒకరు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్పార్టీ చేసిన ‘ఘనకార్యాలతో’ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తామంటూ లోకల్ కేడర్అసహనంతో ఉన్నారని, రాష్ట్రంలో భవిష్యత్లేని పార్టీకి ప్రచారం చేసినా ఉపయోగం ఉండదన్న భావనలో కేడర్ఉన్నారని అంటున్నారు.
కేసీఆర్ బయటకు వచ్చినా...
ఎన్నికల ఫలితాలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకు గానీ కేసీఆర్ బయటకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆయన బయటకు వస్తున్నారు. తన హయాంలో పంట నష్టం జరిగినా పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఎండిన పంటలంటూ తిరుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ బయటకు వచ్చినా పార్టీ కేడర్‌లో మాత్రం నిరుత్సాహమే ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. కేసీఆర్ తీరును చూసి కొందరు స్థానిక నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది.
అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నీళ్లను, రైతులను కనీసం పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుండడంపై సొంత కేడరే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అప్పుడట్లా.. ఇప్పుడిట్లా ఎలా మాట్లాడగలుగుతారన్న చర్చ నడుస్తున్నది. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపైనా స్థానిక కేడర్ఆగ్రహంతో ఉన్నారన్న చర్చ జరుగుతున్నది. ఇవన్నీ పార్టీ ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పార్టీకి చెందిన ఓ నేత వాపోయారు. ఎన్నికల నాటికి పార్టీ ప్రచారం సవాల్‌తో కూడుకున్నదేనంటూ ఆ నేత చెప్పుకొచ్చారు.