బీఆర్ఎస్ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్న సందర్భంలో తీవ్ర సంకట పరిస్థితులు ఎదుర్కొంటుందని చైతన్యవంతమైన ప్రజలు రాజకీయ విశ్లేషకులు మేధావులు చర్చిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంటుతో తీయని, ఆకర్షణీయమైన వాగ్దానాలతో వాక్చాతుర్యంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి 2018 సార్వత్రిక ఎన్నికల వరకు కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోగలిగారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ముఖ్యంగా అణగారిన బహుజన వర్గాల ప్రజలు కొండంత ఆశతో తెలంగాణ సాధించుకున్నారు. 9 సంవత్సరాల అనుచిత వివక్ష అవినీతి దోపిడీ పాలనలో 90 శాతం ప్రజలు నష్టపోయినారని ఇటీవల ఒక క్షేత్రస్థాయి పరిశోధన తెలియచేస్తున్నది.
నిరుద్యోగుల గుండెలు మండుతున్నాయి
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అసమానతలు సాధారణ పౌరులకు కూడా స్పష్టంగా అర్థమయ్యే స్థాయిలో కనిపిస్తున్నాయి. అందరి ఆశలు అడియాశలైనాయి. దోపిడీ సంస్థలు, దోపిడీ నాయకులు, ఉద్యమ ద్రోహులు, అవినీతి అధికారులు ఉన్నత స్థాయి అందలాలు ఎక్కి ఉద్యమకారులను పేద వర్గాలను ఎక్కిరిస్తూ వికటాట్టహాసం చేస్తున్నారు. 40 లక్షల మంది విద్యావంతులైన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురి అయినారు. ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్రాన్ని విడిచిపోతారని అన్ని ఉద్యోగాలు కలిసి నాలుగైదు లక్షల ఉద్యోగాలు నికరంగా నిరుద్యోగులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఉద్యమ నాయకులు ఉద్యమ కాలంలో తేల్చి చెప్పేవారు. స్వరాష్ట్రం సిద్ధించి తొమ్మిది సంవత్స రాలు పూర్తి అయినా ఎన్ని కాకి లెక్కలు చెప్పినా చిన్నాచితక ఉద్యోగాలన్నీ కలిపితే ఒక్క లక్ష కూడా నింపలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్య నాయకులకు, ముఖ్యమంత్రి కుటుంబానికి, తన సామాజిక వర్గం రిటైర్డ్ ఉద్యోగులకు అత్యున్నత స్థాయి ఉద్యోగాలు లభించాయి. కానీ ఉద్యమంలో త్యాగాలు చేసి నష్టపోయిన వారికి తీవ్ర అసంతృప్తి మాత్రమే మిగిలింది. కాలే కడుపుకు మండే గంజి లాగ వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారే తప్ప, 90 శాతం పేదరికంలో ఉన్న దళితులు బహుజన వర్గాలు స్వరాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. వివక్ష తొలగిపోలేదు. అయినా గుమ్మనంగా ఉంటున్నారు.
యువతకు విజ్ఞానం ఉపాధి ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలు ఉపాధ్యాయుల కొరత వల్ల నాణ్యమైన విద్యను కల్పించలేక మారుతున్న పరిస్థితులలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించ లేకపోతున్నాయి. తమను నమ్మించి గొంతు కోసిన నాయకులకు తగిన శాస్తి చెప్పడానికి విద్యార్థులు, పరిశోధకులు సిద్ధమవుతున్నారు . ఉద్యమాలలో కెమెరాల ముందు నిలబడ్డ మేధావులు విద్యార్థుల్లో అరడజను మంది విద్యార్థులు అందలాలు ఎక్కి ఉండవచ్చు కానీ లక్షల మంది విద్యావంతులైన యువతీ యువకులు తమ కలలు కల్లలైనాయని అదును కొరకు ఎదురు చూస్తున్నారు.
బలపడుతున్న ప్రతిపక్షాలు
బిల్లు పెట్టి రాష్ట్రం ఇచ్చి తెలుగు రాష్ట్రాలలో, దేశంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు సానుభూతి ప్రారంభమైంది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా విభజన బిల్లును సమర్థించిన బీజేపీ పట్ల కూడా సానుభూతి ఉంది. తాను ఒక్కడే చావు నోట్లో తలకాయ పెట్టి తప్పించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చినా అని చెప్పే దొరకు రెండు పర్యాయాలు అధికారం అప్పగించినా.. తెలంగాణ ఆశయాలను 5 శాతం కూడా నెరవేర్చలేదని పాలక పక్షం నుండి ప్రజలు వెనుతిరుగుతున్నారు. దళితులకు అనేక వాగ్దానాలు చేసి వమ్ముచేసి దళిత బంధు వాసనతోనే పాలకులు కాలం గడుపుతున్నారని ఆ సామాజిక వర్గాలు పసిగట్టినారు.
రాష్ట్రంలో మూడు ఆధిపత్య సామాజిక వర్గాలలో వెలమలు కేవలం 0 .04% ఉన్నప్పటికీ రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏలుకున్నారని ఏడు లేదా ఎనిమిది శాతం ఉన్న రెడ్డి వర్గం పాలక పార్టీని వీడి సొంతగూటికి చేరుకునే ఆలోచనలో పడ్డారు. గత తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్తమైన అభివృద్ధి నమూనాల పుణ్యమా అని అత్యధికంగా నష్టపోయిన వెనుకబడిన కులాలు తమ బాట వెతుక్కుంటున్నాయి.
చరిత్రను ప్రజలే రాస్తారు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రతిపక్షాలను ధ్వంసం చేసి రాజరికపు పాలన ఏర్పాటు చేసుకున్నానని భ్రమలలో తేలియాడుతున్న పాలకులు ప్రతిపక్షాల ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటర్లు ఎంత వ్యతిరేకించినప్పటికీ ధన సంపద అధికార వర్గం అండదండలు టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలు అడ్డుకుంటాయని నాయకులకు భరోసా ఉండవచ్చు. 1978లో, 1983లో ప్రజలు తిరగబడి తమ నూతన ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. చరిత్రను ప్రజలే రాస్తారని చరిత్ర మరొకసారి పునరావృతం కావడానికి ప్రజలు ముఖ్యంగా పేద వర్గాలు సిద్ధమవుతున్నారని క్షేత్రస్థాయి సర్వేలు తెలియజేస్తున్నాయి. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ పట్టుకొచ్చిండని రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన ప్రజలు మూడవసారి ఎన్నికల ముందు పునరాలోచనలో పడ్డారు. బిల్లు పెట్టి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ను బిల్లును సమర్ధించిన బీజేపీని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఎదురొడ్డి పోరాడే ప్రతిపక్షం ఏదైనా దానిదే గెలుపని ప్రజలు భావిస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో అన్ని వర్గాలు అసంతృప్తికి గురి అయినాయి. ప్రస్తుతం దూరమవుతున్నారు.
గత 30 సంవత్సరాల నుండి ఏ ముఖ్యమంత్రిని కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగనివ్వలేదు. మార్పు దిశలో ప్రజలు పయనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని సామాజిక న్యాయాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకొంటున్న ప్రజలు క్రమేపి పాలక పార్టీకి దూరమవుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ఇంకా 5 నెలల కాలం మిగిలి ఉంది. దెబ్బతిని కంగుదిని నిరాశకు గురైన ప్రజలను ఆకట్టుకోవడానికి పాలకులు అమలు చేసే నూతన ఎత్తుగడలతో పాటు డబ్బు సంచులు ఏరులై పారే మద్యం పంపిణీ నిరర్థకమే కానున్నాయని ప్రజల నాడి చెపుతున్నది.
కన్నెర్రజేస్తున్న జర్నలిస్టులు
తెలంగాణ ఉద్యమంలో మండల స్థాయి నుండి రాష్ట్ర రాజధాని వరకు వేలాదిమంది పత్రికా విలేకరులు, సీనియర్ జర్నలిస్టులు, విద్యార్థులు ఉద్యమకారులతో మమేకమై ముందు వరసలో ఉండి కొట్లాడినారు. కనీసం ఇల్లు కట్టుకోవడానికి అయినా పట్టుమని పది గజాల భూమి ఇవ్వలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం, కానీ లక్షల ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి నాయకులు, అవినీతి అధికారులు, ప్రాంతేతరులు కైవసం చేసుకున్నారు. జర్నలిస్టులు కన్నెర్ర చేస్తే పాలకపక్షానికి సంబంధించిన అనేకమంది నాయకులకు రాజకీయ సమాధులు కట్టడానికి సిద్ధమవుతున్నారు.
- కూరపాటి వెంకట్ నారాయణ,రిటైర్డ్ ప్రొఫెసర్