= సారు కారుకు ఎలక్షన్ ఫియర్!
= ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనుకడుగు
= స్వంతంత్రులకు మద్దతిచ్చే చాన్స్
= 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలే
= పరేషాన్లో పదేండ్లు పాలించిన పార్టీ
= ఎంపీ ఎన్నికల రిజల్ట్ ను గుర్తు చేస్తున్న లీడర్లు
= నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ ఓటమి
= మరోసారి ఓడిపోవద్దనే పోటీ చేస్తలేరా..? అనే చర్చ
హైదరాబాద్: పదేండ్లు రాష్ట్రాన్ని సాధించిన గులాబీ పార్టీకి ఎలక్షన్ ఫియర్ పట్టుకుంది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు నిన్న నోటిఫికేషన్ వెలువడింది. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా మిత్రపక్షాలతో కలిసి అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ పోటీకి వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. ఆయా స్థానాల నుంచి పోటీ చేసే స్వతంత్రులకు మద్దతివ్వాలని భావిస్తోంది. నిజామాబాద్, కరీంగనర్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాలకు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఆ సీటు కూడా కాంగ్రెస్ వశమైంది. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేల్లో పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే తరుణంలో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన 17 స్థానాల్లో ఒక్క సీటుకూడా గెలువకపోగా పలు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. తర్వాత జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగులపల్లి రాకేశ్ రెడ్డిని పార్టీ బరిలోకి దించింది.
ALSO READ | ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..!
ఆయన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నిక కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ కారు పార్టీకి తకరారు తప్పలేదు. ప్రస్తుతం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ మూడు చోట్ల పోటీకి బీఆర్ఎస్ వెనుకడుగు వేస్తోంది. స్వతంత్రులకు మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న బీఆర్ఎస్ మరో సారి ఇబ్బంది పడొద్దనే ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది.
ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆరు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో 3.41 లక్షల ఓట్లున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ కు ఈ ప్రాంతం కంచుకోటగా ఉంది. ఇంతటి కీలకమైన ప్రాంతాన్ని బీఆర్ఎస్ వదులకుంటుండటం హాట్ టాపిక్ గా మారింది. ఓటమి భయంతోనే పోటీకి వెనుకంజ వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా పాతికేళ్ల చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల యుద్ధం నుంచి వెనుదిరగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.