పెట్టుబడులు, అభివృద్ధిని అడ్డుకునే పన్నాగాలు! ప్రణాళికలు అమలు చేస్తున్న బీఆర్ఎస్

పెట్టుబడులు, అభివృద్ధిని  అడ్డుకునే పన్నాగాలు! ప్రణాళికలు అమలు చేస్తున్న బీఆర్ఎస్

అభివృద్ధికి 'ఆయువుపట్టు'  భూమి.  లేదా 'మొదటి మెట్టు' అని కూడా చెప్పొచ్చు.  భూసేకరణ  జరిగితే తప్ప పెట్టుబడులు రావు.  పెట్టుబడులు రాకపోతే  పరిశ్రమలు రావు.  అంతర్జాతీయ సంస్థలు రావు. అవి రాకపోతే  ఉద్యోగ అవకాశాలకు భారీ గండి పడుతుంది. ఈ మెళకువలన్నీ కాచివడబోసిన  బీఆర్ఎస్ పార్టీ  నాయకత్వం  తెలంగాణలో  అభివృద్ధి స్తంభించిపోవాలని ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. మళ్ళీ వారే.. రాష్ట్రం సర్వనాశనం అవుతోందని, పరిశ్రమలు వెనక్కి వెడుతున్నాయని, పెట్టుబడులు రావడం లేదని గగ్గోలు పెడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  ఓ వైపు అభివృద్ధి  నిరోధక  చర్యలకు  పాల్పడుతూ మరోవైపు 'తెలంగాణ సమస్యల పట్ల తమకు తప్ప మరొకరికి  కడుపు నొప్పి ఎందుకు ఉంటుంది' అంటూ ఆవేదన వ్యక్తం చేయడం బీఆర్ఎస్​కు మాత్రమే తెలిసిన ట్రిక్కు!


మా భూములు గుంజుకుంటే బతుకుడు ఎట్లా?  ఫోర్త్ సిటీకి భూములియ్యం!  ఫార్మా భూముల సర్వేకు అడ్డంకులు!   గో బ్యాక్  కాంగ్రెస్!  అంటూ గడచిన కొన్ని నెలలుగా  బీఆర్ఎస్  సోషల్ మీడియాలో కథనాలు స్వైర విహారం చేస్తున్నాయి.  భూసేకరణ ఆలస్యమవుతున్న కారణంగా రాష్ట్రంలో దాదాపు రూ.12,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు  కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి ఇటీవల అన్నారు.  మామునూరు 
విమానాశ్రయం విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు.  భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు, భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందజేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నా ఒక 'రాజకీయ శక్తి' రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వార్తలందుతున్నాయి.

భూసేకరణ, సర్వేలకు ఆటంకం

 అచ్చంగా లగచర్లలో జరిగినట్లే  ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నా సర్వేలను  అడ్డుకోవడం, లేదా  గ్రామసభలకు అంతరాయం కలిగించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.   మామునూరు ఎయిర్​పోర్టు  భూసేకరణలో మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరాకు రూ.2 నుంచి రూ.3 కోట్లు చెల్లించాల్సిందేనని  రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. శంభునిపేట నుంచి నక్కలపల్లి మీదుగా నెక్కొండకు వెళ్లే రహదారిని మూసి వేస్తున్న నేపథ్యంలో  ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.   అధికారులు, మంత్రులు గుంటూరుపల్లి  ముసలమ్మ చెట్టు వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసి భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సర్వేకు ఒప్పుకున్నారు. సర్వే 
చేపట్టిన నాటినుంచి ఇప్పటికి 11 సార్లు కలెక్టరేట్‌కు అధికారులు పిలిపించారు. రైతులకు ఏనష్టం జరగకూడదు. అనుమానం లేదు.  అయితే, రాజకీయ శక్తులు  అభివృద్ధికి అడ్డుపడొద్దు.

ఫోర్త్‌ సిటీని అడ్డుకుంటున్న బీఆర్ఎస్

సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫోర్త్‌ సిటీ పనులు ముందుకు సాగకూడదన్నది బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలున్నాయి.  ఫోర్త్ సిటీ  రోడ్డు కోసం కందుకూరు మండలంలో పెద్ద ఎత్తున భూసేకరణకు అడుగడుగునా అడ్డంకులు తలెత్తుతున్నాయి. లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి గుణపాఠం రాలేదు అని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం ప్రారంభించారు. కందుకూరు మండలం 
మీర్‌ఖాన్‌పేట్‌ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఫోర్త్​సిటీ రోడ్డుకోసం ప్రభుత్వం భూముల సర్వే నిర్వహించింది. తమ భూముల నుంచి రోడ్డు వేయొద్దంటూ బాధిత గ్రామాల రైతులు సర్వేను అడుగడుగునా అడ్డుకున్నారు. తొలుత కొంగరకలాన్‌ వద్ద జరిగిన సర్వేను రైతులు అడ్డుకున్నారు. కొంగరకలాన్‌, కొంగరఖుర్దు, ఫిరోజ్‌గూడ, లేమూర్‌, తిమ్మాపూర్‌,  రాచులూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట్‌ గ్రామాల్లో రైతులు సర్వేను అడ్డుకున్నారు. రైతులు తమ డిమాండ్లు పెట్టడం తప్పుకాదు, కానీ రాజకీయ శక్తుల ప్రమేయమే అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది.

నాడు నిర్వాసితులపై హింస, నేడు డ్రామా 

గతంలో మల్లన్న సాగర్ ముంపు బాధితులపై లాఠీఛార్జి చేసి కేసీఆర్ ప్రభుత్వం భూములు గుంజుకున్న సంగతి బీఆర్ఎస్ నాయకులు మరచిపోయారు. 50 టీఎంసీల మల్లన్నసాగర్​ను కుదించాలని కోరితే నాటి ప్రభుత్వం రైతులపై హింసను ప్రయోగించింది. కేసీఆర్​కు రేవంత్ రెడ్డికి మధ్య తేడా ఇదే.  ‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూసీ ప్రక్షాళనను చేపట్టారు.  కొందరు అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమానికి విరోధులుగా మారారు. ‘బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ వడ్డీకి అప్పు తీసుకుంది. టీజీఐఐసీ ద్వారా రూ. 8,476 కోట్లు  ప్రభుత్వం సేకరించింది. వాటిలో ఋణమాఫీకి రూ.2,146 కోట్లు, రైతు భరోసాకు రూ.5,463 కోట్లు ఖర్చు చేశాం. సన్నబియ్యం కోసం  రూ.947 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉపయోగించింది. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో 400 ఎకరాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారు’ అని  ఏప్రిల్ 12న మీడియా సమావేశంలో  మంత్రి శ్రీధర్​బాబు ఇచ్చిన సవివరణ బీఆర్​ఎస్ దుష్ప్రచారానికి తిరుగులేని జవాబే! నాడు నిర్వాసితులపై హింసకు పాల్పడినవారే.. నేడు నిర్వాసితుల పట్ల డ్రామా ఆడుతుండటం గమనార్హం.

ప్రతిపక్షం అంటే.. అభివృద్ధిని అడ్డుకోవడమా?

ప్రజల్లో వచ్చిన నిరసనల వలన నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు అనుమతులను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. లగచర్లలో భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల బృందం ఆ గ్రామానికి చేరగానే అసాంఘిక శక్తులు వారిని పక్కదోవ పట్టించి మారణాయుధాలతో దాడులకు తెగబడడం  యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలు కావని పోలీసులు ఇప్పటికీ చెబుతుంటారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు, మూసీ, ఫోర్త్‌ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్‌, మెట్రో విస్తరణ, గురుకులాల్లో సమీకృత భవనాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పేదప్రజలందరికీ సన్నబియ్యం పంపిణీ పథకం రేవంత్ ఖాతాలో చేరాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 55 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ చేయడం ఒక సంచలనం.  అయినా, కాళ్లల్లో కట్టెపెట్టే పనులు ప్రధాన ప్రతిపక్షం బీఆర్​ఎస్​ నిరంతరం చేస్తూనే ఉంది. ప్రభుత్వాన్ని బద్నాం చేసి పెట్టుబడులు రాకుండా చేయాలనే ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.  ప్రజల్లో ప్రభుత్వం పట్ల 'కృత్రిమ వ్యతిరేకత'ను సృష్టించడానికి బీఆర్​ఎస్​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రేవంత్ ముక్కుసూటిగా, దూకుడుగా వెళుతున్నందున  కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 'నా మాటే శాసనం' అనేలా కేసీఆర్  హయాంలో జరిగిన పాలానాతీరు కాకుండా, సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతుండడం ప్రజాస్వామిక లక్షణం.

శాంతిభద్రతలపై అసత్య ప్రచారం

కంచ గచ్చిబౌలికి చెందిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించుకునే హక్కు, అధికారం ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ భూములను  పరిశ్రమల స్థాపనకు, ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఈ భూముల గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన మరుక్షణమే ఎర్రవల్లి ఫార్మ్​హౌస్​లో ఒక  ప్రణాళికను రూపొందించారని తెలియవచ్చింది. 'తెలంగాణలో శాంతి భద్రతలు లేవు. పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా లేవు' అని ప్రజల్లో, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాల్లో ఒక సందేశాన్ని బలంగా తీసుకువెళ్లడం 
ఆ ప్లాన్​ సారాంశం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు భయపడే రీతిలో 'క్యాంపెయిన్' జరుగుతోంది.  హైదరాబాద్​లో అశాంతి వాతావరణం ఉన్నట్టు వ్యాపార, పారిశ్రామిక వర్గాలు భావిస్తే ఇక పెట్టుబడులు పెట్టడానికి వారెలా ముందుకొస్తారు?

- ఎస్​.కే.జకీర్​,  
సీనియర్​ జర్నలిస్ట్​