ప్రధాన మంత్రి పదవి అన్న కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవలే : కడియం శ్రీహరి

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కారు పార్టీ మునుముందు ఉంటుందో, లేదో తెలియదని విమర్శించారు. ప్రధాన మంత్రి అన్న కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవలేక పోయారని చెప్పారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పలేమని తెలిపారు. పార్టీ మారినందున ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందానని.. అనేక మంది వారి స్థాయిని మరిచి తనపై ఆరోపణలు చేశారని అన్నారు. 

స్టేషన్ ఘనపూర్ ప్రజలు తన పార్టీ మార్పును కూడా స్వాగతించారని చెప్పారు. 56 వేల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇచ్చారని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందన్నారు. బీజేపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమి రాలేదని ఆ పార్టీ నాయకులు ఎగిరెగిరి పడడం, స్థాయికి మించి విమర్శలు చేయటం  మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ఓటింగ్ శాతం కూడా తగ్గిందని చెప్పారు. 

ఇండియా కూటమి ఓటింగ్ 7 శాతం పెరిగిందని అన్నారు. రామ మందిరం కట్టిన ఫైజాబాద్ లో బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి కూడా ఇష్టం లేదని విమర్శించారు. ఒక్క చంద్రబాబు, ఒక్క నీతిష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంగా మారుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందని కడియం శ్రీహరి అన్నారు.