నిర్మల్/కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్ ఎవరికీ ‘బీ’ టీమ్ కాదని, తాము ప్రజలకు ‘ఏ’ టీమ్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాము అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నిజాలే చెబుతున్నామన్నారు. తాను చెప్పేది నిజమైతేనే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయాలని, తప్పయితే వేయొద్దని అన్నారు. బుధవారం నిర్మల్, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సచ్చిన పీనుగు అని, సచ్చిన పార్టీని లేపేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ గాలి మోటార్లో వచ్చి, గాలి మాటలు చెప్పారని మండిపడ్డారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పిన మోదీ.. మాట తప్పారన్నారు. రూ.15 లక్షలు జమ అయినవారే బీజేపీకి ఓటేయాలని, రైతుబంధు డబ్బులొస్తున్నవాళ్లు బీఆర్ఎస్ కు ఓటేయాలని సూచించారు. కరెంటు విషయంలో కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు చెప్తున్నాయ న్నారు. తామే బస్సులు పెడతామని.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించి కరెంటు తీగలు ముట్టుకొని చూస్తే కరెంట్వస్తుందో.. లేదో.. తెలుస్తుందన్నారు.
సీట్లు అమ్ముకుంటున్నరు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికా డని, ఇప్పడు సీటుకు నోటు అంటూ అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ లీడర్లే చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. తనకు అన్యాయం జరిగింద ని ఒక కాంగ్రెస్ లీడర్ హుస్సేన్ సాగర్దగ్గర ఆత్మహత్య చేసుకోబోయాడని, అలాంటి వాళ్లకు రాష్ట్రాన్ని అప్పజెప్పితే స్టేట్ మొత్తాన్ని అమ్మేస్తారన్నారు. మంచి పనులు చేస్తున్న వాళ్లను ఓడించేందుకు కాంగ్రెసోళ్లు కర్నాటక నుంచి, బీజేపోళ్లు అదానీ నుంచి పైసలు తెస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు పైసలు ఇస్తే తీసుకొని, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బీజేపీ మనిషేనని, గాంధీ భవన్లో గాడ్సే ఉన్నారన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కు చెందిన పంజాబ్ మాజీ సీఎం అమరేందర్సోనియాకు లేఖ రాశారన్నారు. త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తోందని, అది కాంగ్రెస్ స్కీమ్‌లకు తాత లెక్క ఉంటుందన్నారు.
బీజేపీ పని అయిపోయింది..
జాకీలు పెట్టి లేపినా బీజేపీ తెలంగాణలో లేవదని, దాని పని అయిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. మోడీ పసుపు బోర్డు అన్న, ఇంకేం చెప్పినా అవి దింపుడు కల్లం ఆశలేనన్నారు. పన్నుల రూపంలో తెంగాణ నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే.. కేంద్రం తెంగాణకు 46 పైసలు ఇస్తోందని, మోదీ జూటా మాటలు చెప్తున్నారని, కేసీఆర్‌పైనా, తమపైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.
కాయితీ లంబాడీల ప్లకార్డుల ప్రదర్శన
బాన్సువాడ సభలో కాయితీ లంబాడీలు ప్లకార్డులు ప్రదర్శించారు. కేటీఆర్ మాట్లాడుతున్న సమ యంలో నిరసన వ్యక్తం చేశారు. తమను ఎస్టీలుగా గుర్తించాలని, పోడు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెళ్లి నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో కొందరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.