- పోలీసుల లాఠీచార్జీలు.. అధికార పార్టీ ఆగడాలు
- చిన్న నిరసనకు పిలుపునిచ్చినా ఇంటిని చుట్టేస్తున్న పోలీసు యంత్రాంగం
- మొన్న నిర్మల్, ఆ తర్వాత ఆదిలాబాద్ లో ఇదే పరిస్థితి..
- పోలీసుల లాఠీ దెబ్బలకు కార్యకర్తలకు గాయాలు
ఆదిలాబాద్, వెలుగు: ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అధికార బీఆర్ఎస్ తీవ్రంగా అణగదొక్కుతోంది. ధర్నాలు చేస్తే దాడులు.. ఆందోళనలకు పిలుపునిస్తే అరెస్టులు చేయిస్తోంది. రాజకీయ పార్టీలే కాదు.. ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు సైతం సమస్యలపై ఉద్యమిస్తే అరెస్టులు.. లాఠీ చార్జీలతో ఉద్రిక్తంగా మారుతున్నాయి. అధికార పార్టీ లీడర్లు కత్తులు చూపించి బెదిరిస్తున్నట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అధికార పార్టీ లీడర్లు దాడులు, పోలీసుల తీరుతో అపోజిషన్ లీడర్లు ఆందోళనలకు దిగుతున్నారు.
అణచివేతే ఎజెండాగా..
ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేసే పరిస్థితి లేదు. ఏ పార్టీ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చినా వెంటనే పోలీసు యంత్రాంగం వారి ఇంటిని చుట్టుముట్టేస్తోంది. గృహ నిర్భంధాలు చేసి బయటకు రాకుండా చూస్తున్నారు. ఆందోళనలు చేసేందుకు ఎవరైనా బయటకు వస్తే ఆ లీడర్లను వెంటనే అడ్డుకుంటున్నారు. దీంతో తోపులాటలు, లాఠీచార్జ్‌లతో పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అటు సీఏం, మంత్రుల పర్యటనలు ఉన్నా ముందే అరెస్టులు చేస్తున్నారు. ఏ జిల్లాలో ఏ మంత్రి పర్యటించినా ముందురోజు రాత్రి, లేదంటే.. ఉదయమో అపోజిషన్ లీడర్లు, కార్యకర్తల ఇండ్ల వద్దకు చేరుకుంటున్న పోలీసులు వారిని హౌజ్ అరెస్టు చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా బీజేపీ లీడర్లు అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూం, దళితబంధు, తదితర సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల ముందే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టులు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సైతం దాడులకు పాల్పడుతున్నారు. నిరసన తెలిపే అపోజిషన్ లీడర్లపై దాడులు చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసుల ముందే దాడులు జరుగుతున్నా అడ్డుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి.
నిర్మల్, ఆదిలాబాద్‌లో ఉద్రిక్తతలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మహేశ్వర్ రెడ్డి దీక్షకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టగా.. కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల లాఠీ దెబ్బలకు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.
ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు సైతం రాష్ట్ర నేతలను రాకుండా అడ్డుకోవడం పట్ల పోలీసు యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిర్మల్ బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జ్‌ని నిరసిస్తూ ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్.. సీఏం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టడం మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. దీంతో పాయల్ శంకర్‌కు గాయాలయ్యాయి. నిరసన తెలిపే వారిపై ఇలాంటి దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.