
హుస్నాబాద్, వెలుగు: కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కేంద్రంలోని బీజేపీ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలనూ ప్రజలు నమ్మడంలేదని, కరీంనగర్ ఎంపీగా తననే గెలిపిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌తో కలిసి మార్నింగ్‌వాక్ చేశారు.
ఎల్లమ్మచెరువుకట్ట, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, కూరగాయలమార్కెట్‌లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెహ్రూ, ఇందిరమ్మ తెచ్చిన పథకాలను తామే తెచ్చామని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. కాంగ్రెస్సేమో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోసం చేస్తోందన్నారు. ఐదేండ్లుగా ఎంపీ బండి సంజయ్ హుస్నాబాద్ నియోజకవర్గానికి ఐదు రూపాయల పని చేయలేదన్నారు. కరీంనగర్ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తాను 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు.