- ధరణి లోపాన్ని ఆసరాగా చేసుకుని డబుల్ రిజిస్ట్రేషన్
- 21 మందిపై కేసు, బీఆర్‌ఎస్ లీడర్ చిట్టిమళ్ల శ్రీనివాస్ సహా ఆరుగురు అరెస్ట్
కరీంనగర్, వెలుగు : తప్పుడు రిజిస్ట్రేషన్‌తో భూవివాదాన్ని సృష్టించి, అసలు యజమానిని ఇబ్బంది పెట్టి భూమిని కాజేయాలని చూసిన ఘటనలో బీఆర్‌ఎస్ లీడర్, కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టిమళ్ల శ్రీనివాస్ సహా 21 మందిపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌తో పాటు మరో ఐదుగురిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ టూ టౌన్ సీఐ విజయ్‌కుమార్ వెల్లడించారు. కరీంనగర్‌లోని కమాన్ రోడ్డుకు చెందిన నీరుమల్ల శ్యాంసుందర్ మానకొండూర్ పరిధిలోని 1,262, 1,265, 1,266 సర్వే నంబర్లలో ఉన్న 2.20 ఎకరాల భూమిని 2009లో దేశబోయిన జగత్‌ప్రకాశ్, శ్రీనివాస్, గోపాల్, శ్రీకాంత్ నుంచి కొన్నాడు.
అయితే రెవెన్యూ రికార్డుల్లో శ్యాంసుందర్ పేరు నమోదు కాకపోవడంతో ధరణి పోర్టల్‌లో పాత పట్టాదారుల పేర్లే వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న నలుగురు సర్వే నంబర్ 1,266లో శ్యాంసుందర్‌కు అమ్మిన భూమిలో తప్పుడు హద్దులు చూపుతూ 9 గుంటలను కొండా మురళికి రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలుసుకున్న శ్యాంసుందర్ పట్టాదారులను నిలదీయడంతో సమస్య పరిష్కారానికి రూ. 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా సర్వే నంబర్ 1,265లో శ్యాంసుందర్ కొనుగోలు చేసిన మరో 1.02 ఎకరాల భూమిని సైతం గంప రమేశ్, గంప నాగరాజు, కొండా మురళి, వంగల సంతోష్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
ఆ తర్వాత వారి నుంచి బీఆర్‌ఎస్ లీడర్, కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టమల్ల శ్రీనివాస్, అతడి కుమారుడు అచ్యుత్ చైతన్య పేరిట మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత భూమి చుట్టూ కంచె వేసి శ్యాంసుందర్ అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయంపై బాధితుడు శ్యాంసుందర్ పోలీసులు, కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది.
కేసు విత్‌డ్రా చేసుకుంటే సమస్య పరిష్కరిస్తామని హామీ
కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న చిట్టమల్ల శ్రీనివాస్ బాధితుడు శ్యాంసుందర్‌ను పిలిపించి కేసును విత్‌డ్రా చేసుకోవాలని, సమస్యను ఇక్కడితో పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. అతడిని నమ్మిన శ్యాంసుందర్ కేసులను ఉపసంహరించుకున్నాడు. అయినా సమస్యను పరిష్కరించకుండా మరోసారి వేధించడం మొదలుపెట్టారు. సమస్యను పరిష్కరిస్తామంటూ 11 గుంటల భూమిని బొల్లినేని సృజన్‌రావు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత అతడి నుంచి కొత్త జైపాల్‌రెడ్డికి బదలాయించారు.
అంతటితో ఆగకుండా అసలు పట్టాదారులతో కుమ్మక్కై మరోసారి కొండా మురళి, వంగల సంతోష్, గంప ఫణీంద్ర పేరిట కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో బాధితుడు శ్యాంసుందర్ మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి చిట్టిమల్ల శ్రీనివాస్‌తో పాటు అచ్యుత్ చైతన్య, గంప రమేశ్, కొండా మురళి, వంగల సంతోష్, గంప నాగరాజు, లవకుమార్, రవళి, గీత, ఫణింద్ర, యంసాని రాధాకృష్ణ, ఆకుల సుదర్శన్, జగత్ ప్రకాశ్, శ్రీనివాస్, గోపాల్, శ్రీకాంత్, రేగొండ సందీప్, వెంకటశారదా దేవి, బొల్లినేని సృజనారావు, కొత్త జయపాల్‌రెడ్డి, దువ్వంతుల లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇందులో చిట్టమల్ల శ్రీనివాస్, అచ్యుత్ చైతన్య, నాగరాజు, శ్రీకాంత్, గోపాల్, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ టూటౌన్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.