60 శాతమున్న బీసీలు ఎందుకు ఓడాలి? :సీఎం కేసీఆర్

  • 50 శాతం, 60 శాతమున్నమని నర్కుడు కాదు.. చైతన్యం చూపాలి: కేసీఆర్​
  • ఎద్దు, ఎవుసం తెల్వని రాహుల్ ​ధరణిని రద్దు చేస్తమంటున్నడు
  • కర్నాటకలో 5గంటల కరెంటిచ్చే డీకే శివకుమార్​ సుద్దులు చెప్తున్నడు
  • కాంగ్రెసోళ్లు, కమ్యూనిస్టులు  ఊర్లను వల్లకాడు చేసిన్రు
  • పుణ్యానికి తెలంగాణ ఇయ్యలే.. ప్రాణాలను తీస్కొని ఇచ్చిన్రు
  • నేను చావునోట్ల తలకాయ పెడ్తే అప్పుడు దిగొచ్చిన్రు
  • కోదాడ, ఆలేరు, తుంగతుర్తి సభల్లో వ్యాఖ్యలు

నల్గొండ/సూర్యాపేట/యాదాద్రి భువనగిరి, వెలుగు: యాభై శాతం, అరవై శాతం ఉన్నమని బీసీలు నర్కుడు కాదని, చైతన్యం చూపాలని బీఆర్​ఎస్​ చీఫ్​ సీఎం కేసీఆర్​ అన్నారు. కోదాడలో బీసీలకు ఎప్పుడూ అవకాశం రాలేదని, తానే బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్​కు టికెట్​ ఇచ్చానని చెప్పారు.‘‘ఆరు నెలల నుంచి కొందరు నా దగ్గరకు వచ్చి మల్లయ్య యాదవ్​ గెల్వడని గునిగిన్రు. నేనన్న.. గెల్వకుంటె గెల్వకపాయె.. నేను టికెట్​ ఇస్త. ఏం జరిగితే అది జరుగుతది అన్న’’ అని తెలిపారు. మల్లయ్య యాదవ్​ను ఓడించేందుకు బలిసినవాళ్లంతా కలిసి కుట్రలు పన్నుతున్నారని, ఆ కుట్రలను బీసీలంతా తిప్పి కొట్టాలని కేసీఆర్​ అన్నారు. 60 శాతమున్న బీసీలు ఎందుకు ఓడిపోవాలని ప్రశ్నించారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, బీసీలు ఒక్కటై మల్లయ్య యాదవ్​ను భారీ మెజార్టీతో గెలిపిస్తే రూ.10 కోట్లతో కోదాడలో బీసీ భవన్​ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం కోదాడ, ఆలేరు, తుంగతుర్తిలోని తిరుమలగిరి సభల్లో కేసీఆర్​ మాట్లాడారు. 

ఎక్కడ చూసినా స్తూపాలే కనిపించేవి

తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా స్తూపాలే కనిపించేవని.. కమ్యూనిస్టులు, కాంగ్రెస్​ నేతలు హత్యలు, కేసులు, గొడవలతో గ్రామాలను వల్లకాడు చేశారని కేసీఆర్​ అన్నారు.  బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాకే తుంగతుర్తి నియోజక వర్గంలో అద్భుతమైన మార్పు కనిపిస్తున్నదని తెలిపారు. ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కిషోర్​ పట్టుబడి అడిగితే నే తిరుమలగిరి మండలాన్ని దళితబంధుకు పైలెట్​ ప్రాజెక్టు కింద సెలక్ట్​ చేశామని, ఈ  ఎన్నికల్లో కిషోర్​ను లక్ష ఓట్ల మెజార్టీతో మూడో టర్మ్​ గెలిపిస్తే నియోజకవర్గం మొత్తం దళితబంధు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేగాక బునాదిగాని కాల్వల పనులు, దేవాదుల ప్రాజెక్టు పనులు త్వరగా కంప్లీట్​ చేస్తామని, బస్వాపురం రిజర్వాయర్​కు అనుసంధానం చేస్తామని చెప్పారు. 

యూపీ, బీహార్​ జనం వలసొస్తుంటే..అక్కడి లీడర్లు నీతులు చెప్తున్నరు

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటున్నదని, అదే నిజమైతే మళ్లీ రాష్ట్రంలో దళారుల రాజ్యం వస్తదని, పహాణి నకళ్ల కోసం చేతులు తడపాల్సి వస్తదని కేసీఆర్​ అన్నారు. తాము ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని తీసుకొచ్చి రైతుల చేతుల్లో పెట్టామని, ధరణి వల్లే రైతుబంధు, వడ్ల పైసలు ఠంఛన్​గా రైతుల ఖాతాల్లో పడ్తున్నాయని,  ధరణి రద్దయితే పథకాలు సక్రమంగా అమలు కాకపోగా, మళ్లీ వీఆర్వో, గిర్దావర్​ వ్యవస్థ వస్తదని తెలిపారు. ‘‘ఉత్తర ప్రదేశ్​, బీహార్​లో జనాలకు ఉపాధి లేక, కడుపు నిండా తిండిలేక పనుల కోసం తెలంగాణకు వలస వస్తుంటే.. అక్కడి నాయకులు ఇక్కొడికొచ్చి నీతులు చెప్తున్నరు” అని ఆయన దుయ్యబట్టారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పదేండ్లుగా అధికారం లేక ఆవురావురుమంటూ ఆకలితో ఉన్నదని, చాన్స్​ ఇస్తే గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు ఆ పార్టీ లీడర్లు పడుతారని విమర్శించారు. జవహర్‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌ నెహ్రూ ప్రధాన మంత్రి అయిన నాడే దళితుల పరిస్థితి చాలా దారుణం గా ఉండేదని, స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ మాటను గౌరవించి దళితుల అభివృద్ధికి శ్రీకారం చుడితే 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత దళితులకు ఈ దరిద్రం ఉండేదా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ వచ్చాక, ఒక దశకు వెళ్లాక కచ్చితంగా దళిత బిడ్డల దరిద్రాలు పోవాలనే దళిత బంధు స్కీం తెచ్చినం. 

ఇక ఎద్దు, ఎవుసం గురించి తెలియని రాహుల్ గాంధీ  అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తమంటున్నడు. ఎవడో పిచ్చోడు రాసిచ్చిన స్పీచ్​ను చదివి ధరణిని రద్దు చేస్తమని అంటున్నడు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌ వచ్చి తెలంగాణకు సుద్దులు చెప్తున్నడు. ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తుంటే 5 గంటల కరెంటు ఇచ్చే సన్నాసి వచ్చి మాట్లాడుతున్నడు. వాళ్ల దగ్గరకు వచ్చి అభివృద్ధిని చూడుమని చెప్తున్నడు” అని దుయ్యబట్టారు. ‘‘మీకు 24 గంటల కరెంట్​ కావాలా...5 గంటల కరెంటు కావాలా తేల్చుకోవాలి. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్​ సరిపోతదని రేవంత్​ పిచ్చిమాటలు మాట్లాడుతున్నడు. 

జనాలు కట్టే పన్నుల సొమ్ముతో రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నరని ఉత్తమ్​కుమార్​రెడ్డి అంటున్నడు. ఎవరు కావాల్నో ప్రజలు తేల్చుకోవాలి” అని కేసీఆర్​ అన్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత తనకు బిడ్డ లాంటిదని, ఆమెను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల కోసం ఆమె కోరిన చిన్న చిన్న కోర్కెలు తప్పక తీరుస్తానని హామీ ఇచ్చారు.  

ప్రాణాలు బలి తీసుకొని తెలంగాణ ఇచ్చారు

మలిదశ ఉద్యమానికి ముందు తెలంగాణ అని మాట్లాడేవారే దిక్కులేరని, ఎవరైనా మాట్లాడితే నక్సలైట్‌‌‌‌‌‌‌‌ అని ముద్ర వేసి జైలులో పెట్టేవారని కేసీఆర్​ అన్నారు.  ‘‘కాంగ్రెస్​ పార్టీ14 ఏండ్ల పాటు మనల్ని ఏడిపించింది తప్ప మర్యాదగా తెలంగాణను ఇవ్వలేదు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేపట్టి చావు నోట్లో తలకాయ పెడితే, ప్రజలంతా ఉప్పెనలా ఉద్యమం చేస్తే అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. తెలంగాణ ఇచ్చినమని మాట్లాడటానికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి సిగ్గుండాలి.. ఎంతమంది ప్రాణాలు తీసుకున్నరు.. ఎంతమంది ఉద్యమకారులను జైల్లో పెట్టిన్రు.. చెరుకు సుధాకర్‌‌‌‌‌‌‌‌ను జైలులో వేసిన్రు.. అయినా తట్టుకొని నిలబడినం కాబట్టి, పోరాటం చేసినం కాబట్టి దిగొచ్చి తెలంగాణ ఇచ్చిన్రు.. శ్రీకాంతాచారిలాంటి వారి ప్రాణాలను బలి తీసుకొని ఇచ్చిన్రు తప్ప పుణ్యానికి ఇయ్యలే.. ఉద్యమమప్పుడు ఒక్క కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు, బీజేపీ నాయకుడు రాలేదు.. జేఏసీ ఏర్పాటుచేసి రాజీనామా చెయ్యుమంటే మంత్రి పదవులను వదిలిపెట్ట లేదు.. పదవులు, పైసలే ప్రధానం అనుకొని అమెరికాకు వెళ్లిపోయిన్రు” అని కేసీఆర్​ దుయ్యబట్టారు. 

కాంగ్రెస్‌‌ పార్టీ పదేండ్లుగా అధికారం లేక ఆవురావురుమంటూ ఆకలితో ఉన్నది.చాన్స్​ ఇస్తే గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు పడ్తది. మట్టిగడ్డను కూడా మింగు దామని చూస్తున్నది. ఎద్దు, ఎవుసం గురించి తెల్వని  రాహుల్ గాంధీ.. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తమంటున్నడు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌ వచ్చి తెలంగాణకు సుద్దులు చెప్తున్నడు. కర్నాటకలో  బ్రహ్మాండంగా 5 గంటల కరెంటు ఇస్తున్నమంటున్నడు.. చెప్పెటందుకు ఇజ్జత్​ ఉండాల్నా? సిగ్గుండాల్నా. 24 గంటల కరెంట్​ ఇచ్చే ఇక్కడికి వచ్చి  5 గంటల కరెంటు గురించే చెప్పుడు కంటే దిగజారుడుతనం ఉంటదా? ఒళ్లు తెలిసే మాట్లాడుతున్నడా?.    - కేసీఆర్​