దండె విఠల్‌కు సుప్రీం కోర్టులో ఊరట

దండె విఠల్‌కు సుప్రీం కోర్టులో ఊరట

న్యూఢిల్లీ, వెలుగు :  బీఆర్ఎస్ నేత దండె విఠల్​కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది. 2021లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా విఠల్ నామినేషన్ వేశారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్​గా నామినేషన్ దాఖలు చేశారు. తాను నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోయినా.. తన సంతకాన్ని దండె విఠల్ ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 

తనకు తెలియకుండా నామినేషన్ విత్ డ్రా చేయించారని హైకోర్టుకు వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సంతకం ఫోర్జరీ జరిగిందన్న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి ఇచ్చిన నివేదిక ఆధారంగా విఠల్ ఎన్నికల చెల్లదని మే 3న తీర్పు ఇచ్చింది. అలాగే, విఠల్​కు రూ.50వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల టైమ్ కూడా ఇచ్చింది. 

దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మే 13న దండె విఠల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్​తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని విఠల్ తరఫున న్యాయవాది కోర్టుకు అభ్యర్థించారు. ఆయన వాదనలపై ప్రతివాది రాజేశ్వర్ రెడ్డి తరఫు అడ్వకేట్ అభ్యంతరం తెలిపారు. కాగా, పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, సుప్రీం కోర్టు సమ్మర్ హాలిడేస్ తర్వాత ఈ పిటిషన్​పై విచారణ చేపడ్తామని స్పష్టం చేసింది.