హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అంటేనే క్రైసిస్అని..కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా ఆర్థిక సంక్షోభం వస్తుందని బీఆర్ఎస్నేత ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. మొన్న కర్నాటక, నిన్న హిమాచల్ ప్రదేశ్ నేడు తెలంగాణ ఆదాయంలో వెనకబడటానికి ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కారే కారణమని మండిపడ్డారు. తెలంగాణ తలసరి ఆదాయం గత పదేండ్లల్లో పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ వచ్చి రాష్ట్రాన్ని కుదేలు చేసిందని ఆరోపించారు.
సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో రాకేశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. "రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. కట్టిన ఫ్లాట్స్ అమ్ముడుపోవడం లేదు. హైదరాబాద్ సిటీలో టూ లెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. మూసీ ప్రక్షాళన కాదు రేవంత్ రెడ్డి మైండ్ ప్రక్షాళన చేయాలి. మూసీ సుందరీకరణతో వచ్చే ఆదాయం ఏంటో సీఎం చెప్పాలి. ఈ ప్రాజెక్టు ఎవరికి అన్నం పెడుతుంది. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను గూడు లేని పక్షులను చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది" అని రాకేశ్ రెడ్డి అన్నారు.