హైదరాబాద్: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసానికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సీఐని అడ్డగించి తమ ఫిర్యాదులో తీసుకోవాలని బలవంతం చేశారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కంప్లైంట్ మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది.
Also Read :- కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న సినీ ప్రముఖులు
అయితే కౌశిక్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న మాసబ్ ట్యాంక్ పోలీసులు బుధవారం (డిసెంబర్ 25) కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 27వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పాడి కౌశిక్ రెడ్డితో పాటు వెళ్లిన వారిలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ఉన్నారు.