హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి విగ్రహాల మీదున్న ధ్యాస విద్యార్థులపై లేదని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు పెట్టే శ్రద్ధ పిల్లల భవిష్యత్తుపై పెట్టడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని వాటి సంగతి అటుంచితే కనీసం సొంత జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలనూ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు. సీఎం సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులుంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పుడైనా మొద్దు నిద్ర వీడాలన్నారు. విద్యార్థులకు కల్తీ ఫుడ్ పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని పేర్కొన్నారు.