- అందులో భాగంగానే కులగణన ఫొటోలు రిలీజ్!
- జైలుకెళ్లక ముందు ఫూలె ఫ్రంట్ ఏర్పాటు
- రోజువారీగా కుల సంఘాలతో భేటీ అయ్యే అవకాశం
- వరుసగా బీసీ మేధావులతో చర్చలు!
- రిజర్వేషన్లపై డెడికేటేడ్ కమిషన్ తో భేటీకి నిర్ణయం
- బీసీ ఎజెండాతోనే క్రియాశీలక రాజకీయాల్లోకి..
హైదరాబాద్: కల్వకుంట్ల కవిత రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి బెయిల్ పై బయటికి వచ్చిన కేసీఆర్ తనయ అనారోగ్యం కారణంగా రెస్టులో ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే జనంలోకి వస్తారనే సంకేతాలొస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల కులగణన సర్వేకు సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారని సమాచారం.
లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తర్వాత సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు ఆగస్టు 27న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి రాలేదు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె బయటికి వస్తారని ప్రచారం జరిగింది. ఆమె అనారోగ్యం కారణంగా బయటికి రాలేకపోతున్నానని తెలిపారు. ఇటీవల కుదుట పడటంతో ఆమె పాలిటిక్స్ పై దృష్టి సారించారని సమాచారం. అందులో భాగంగానే ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన ఎన్యూమరేటర్లకు సమాచారం ఇస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు.
గతంలో జైలుకు వెళ్లకముందు ఫూలె ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీల పక్షాన పోరాడిన కవిత.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన ఏజెండాతోనే జనంలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆమె రోజు వారీగా బీసీ కులసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. సర్వే ప్రశ్నావళి.. పేర్కొన్న అంశాలపై వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇదే తరుణంగా తటస్థలుగా ఉన్న బీసీ మేధావులతోనూ భేటీ అవుతున్నారని తెలుస్తోంది.
బీసీ సంఘాలు, కుల సంఘాల అభ్యంతరాలను నోట్ చేసుకుంటూ.. ఎలా చేస్తే బాగుంటుందనే అంశాలపైనా వారితో చర్చిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా బీసీ ఏజెండాతోనే తాను రీ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ మేరకు జాగృతి శ్రేణులు సైతం రోజూ కవితను కలుస్తున్నారని తెలుస్తోంది. అటు ఫూలే ఫ్రంట్ ను సైతం కవిత యాక్టివేట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ వివరాలన్నీ తీసుకొని ఫూలే ఫ్రంట్ జెండాతో కులగణనపై ఏర్పాటైన డెడికేషన్ కమిషన్ ను కలుస్తారని సమాచారం. కుల సంఘాల నేతలు లేవనెత్తిన అంశాలను కమిషన్ ఎదుట ప్రస్తావించి సర్వేలో మార్పులుచేయాలని కోరనున్నారు. ఇప్పటికే సగం సర్వే పూర్తయినందున కమిషన్ ఆమె చెప్పిన మార్పులు చేస్తుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.