- ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే
- కరెంట్ కోతలతో వెయ్యి కోట్ల పరిశ్రమ మద్రాస్‌కు తరలిపోయింది
- తంబాకు నములుడు తప్ప బండి సంజయ్కేం తెలుసని వ్యాఖ్య
- కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ప్రచారం
కరీంనగర్/జగిత్యాల, వెలుగు: కాంగ్రెస్ సర్కారు కొసముట్టదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీఅధినేత కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగు వేల పెన్షన్, రైతుబంధు వెయ్యి ఎక్కువ ఇస్తామంటే ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓట్లేశారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రచార సభల్లో కేసీఆర్ మాట్లాడారు. ఈ నెల 8లోపు రేవంత్‌రెడ్డి రైతుబంధు ఇస్తానని చెబతున్నారని, పెట్టుబడి సాయం.. నాటు వేసేటప్పుడు ఇస్తరా? లేక కోసేటప్పుడు ఇస్తరా? అని ప్రశ్నించారు.
కరెంట్ నాలుగైదు సార్లు ట్రిప్ అయితుంది. కరెంట్ కోతలు పెడుతున్నరు.. ఇవాళ వెయ్యి కోట్ల పరిశ్రమ మద్రాస్‌కు వెళ్లిపోయింది.అల్యూమినియం, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ కు కరెంట్ ఇవ్వడం లేదని కంపెనీలు వెళ్లిపోవాలని చూస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే’’ అని వ్యాఖ్యానించారు. తొమ్మిదేండ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంట్ఇప్పుడెందుకు వస్తలేదని ప్రశ్నించారు. వరంగల్ ఎంజీఎంలో, రిమ్స్ లో ఏసీలు పని చేయట్లేదని పేపర్లలో వచ్చిందని, గింత తొందర ట్రాక్ ఎట్ల తప్పుతదని, ప్రజలపట్ల కమిట్ మెంట్ లేకనే ఇలాంటి పరిస్థితి వస్తుందని అన్నారు.
గోదారి నీళ్లు తమిళనాడుకు తరలించే కుట్ర
ప్రధాని మోదీ గోదావరి నీళ్లను తీసుకుపోయి కర్నాటక, తమిళనాడుకు ఇస్తా అంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ పంపారని, సీఎం రేవంత్ కుయ్యిమంటలేరని విమర్శించారు. తాను ఉన్నప్పుడు ఇదే ప్రపోజల్ పెడితే ముందు తెలంగాణ నీళ్ల వాటా తేల్చాలని, లేదంటే లక్ష మీటింగ్ లకు పిలిచినా తాను రానని చెప్పానన్నారు. పార్లమెంట్ లో మనోళ్లే 12, 14 మంది ఎంపీలు ఉంటే.. ఇలాంటి ప్రపోజల్ పెడితే ఎగిరి గొంతు అందుకుంటారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అనే సన్నాసికి తంబాకు నములుడు, అడ్డం పొడుగు మాట్లాడుడు తప్ప ఇంకోటి తెల్వదని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్‌ను గెలిపిస్తే మన హక్కుల కోసం, నీళ్ల కోసం కొట్లాడుతాడని చెప్పారు.
కొండగట్టులో టీ తాగుతూ.. సెల్ఫీలు దిగుతూ..
జగిత్యాల కార్నర్ మీటింగ్‌లో పాల్గొనేందుకు కరీంనగర్ నుంచి బస్సులో బయలుదేరిన కేసీఆర్ మార్గమధ్యంలో కొండగట్టు గుట్ట కింద ఆగారు. స్థానికంగా ఉండే టీ పాయింట్ దగ్గర టీ తాగారు. అక్కడే ఉన్న ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు.
ఈ ప్రభుత్వానికి తోక తెల్వది.. తొండం తెల్వది
ఏనాడూ అనుకోని జగిత్యాల జిల్లా కల సాకారం చేసుకున్నామని, మెడికల్‌కాలేజీ తెచ్చుకున్నామని కేసీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీసేస్తా అంటున్నదని, ఈ ప్రభుత్వానికి తోక తెల్వది.. తొండం తెల్వదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని అన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఊరుకెళ్లినా అక్కడ దేవుడి దగ్గరికి వెళ్లి ఒట్టుపెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
అరచేతిలో వైకుంఠం చూపించి.. ఇష్టమొచ్చిన వాగ్దానాలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్మోసం చేసిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన బేటీ పఢావో.. బేటీ బచావో ఎక్కడా కనిపించడం లేదని, జనధన్ ఖాతాలో ఎవ్వరికీ రూ.15 లక్షలు పడలేదని చెప్పారు. బీజేపీ హయాంలో సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ఏమో గానీ సబ్ కా సత్యనాశ్ అయ్యిందని మండిపడ్డారు. యువకులు ఆలోచించి ఓటేయాలని కోరారు.