రేవంత్​ మాటలు ఈసీకి వినిపించవా : కేసీఆర్​

  • అడ్డగోలుగా మాట్లాడిన సీఎంపై చర్యలేవి

మహబూబాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు ఎలక్షన్​ కమిషన్​కు వినిపించడం లేదా? అని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ ప్రశ్నించారు. ఆయన అడ్డగోలుగా మాట్లాడినా చర్యలు తీసుకోవడం లేదని, కానీ తన ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించారని అన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు చూస్తూ ఊరుకోవద్దని, పార్టీ గెలుపు కోసం 96 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేయాలని, వేల గొంతుకలతో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేనని, తన ప్రాణం ఉన్నంత వరకూ కొట్లాడుతానని చెప్పారు. 

బుధవారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్​ఎంపీ అభ్యర్థి మాలోతు కవితకు మద్దుతుగా ఇందిరాసెంటర్ వద్ద నిర్వహించిన రోడ్ షో లో కేసీఆర్​ పాల్గొని,  మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు తాను ఎక్కువ సమయం మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట పాలన అంతమయ్యే వరకూ కసిగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి..

కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారని కేసీఆర్​అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో  కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు చేయలేదని చెప్పారు. ఉచిత బస్సు స్కీమ్​తో ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుబంధు అందడం లేదని, మహిళలకు రూ.2,500 నెలకు రావడం లేదని, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం జాడ లేదని చెప్పారు. రైతులకు రుణమాఫీ, ఇతర హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. 

జలాల తరలింపును పట్టించుకోవడం లేదు..

 రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలను కేఆర్​ఎంబీకి అప్పగించిందని కేసీఆర్​ అన్నారు. గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోతానని మోదీ అంటుంటే.. సీఎం రేవంత్​ నోరు మెదపడం లేదని తెలిపారు.  గతంలో మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు సమృద్ధిగా తాగు, సాగు నీరు అందేదని,  నేడు  అసమర్థ కాంగ్రెస్​పాలన వల్ల  ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు. నేడు  రైతులు మళ్లీ బోరు బండ్ల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో సకాలంలో వడ్లు కొనక పోవడంతో ఓ  రైతు గుండె ఆగి చనిపోయినట్టు తెలిపారు. బేటీ బచావో.. బేటీ పఢావో.. మన్నూ మశానం అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప.. మోదీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. 

బీఆర్ఎస్​ పాలనలోనే గిరిజనులకు న్యాయం

బీఆర్ఎస్ పాలనలోనే గిరిజనులకు న్యాయం జరిగిందని కేసీఆర్​ తెలిపారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, తండాలు నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుతోపాటు హైదరాబాద్​లో అధునాతన వసతులతో సేవాలాల్ భవనం నిర్మించినట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి  ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.  నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అవినీతి మచ్చ లేకుండా సేవ చేస్తున్న గిరిజన బిడ్డ కవితను మరోసారి పార్లమెంట్​కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఈసీ​ నిబంధనల మేరకు 20 నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. ఆయన వెంట మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రెడ్యా నాయక్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్​ రావు, మాజీ ఎమ్మెల్యేలు బానోతు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బానోత్ హరిప్రియ నాయక్​ తదితరులున్నారు.