
- రాజలింగమూర్తి హత్య కేసులో గండ్ర అనుచరుడు
- ఎఫ్ఐఆర్లో ఏ8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు
- వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
- రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇప్పిస్తానన్న హరిబాబు
- ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ
- ఏడుగురు నిందితుల అరెస్టు.. హరిబాబు సహా పరారీలో ముగ్గురు
జయశంకర్ భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్, వెలుగు: రాజలింగమూర్తి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ హత్యలో బీఆర్ఎస్ లీడర్, భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. భూపాలపల్లిలో ఈ నెల 19 న హత్యకు గురైన నాగవెల్లి రాజలింగమూర్తి కేసు వివరాలను ఆదివారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వెల్లడించారు. బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రధాన అనుచరుడైన హరిబాబు పేరును ఎఫ్ఐఆర్ లో ఏ8 గా నమోదు చేసినట్టు చెప్పారు. ‘రాజలింగమూర్తిని చంపితే బెయిల్ నేనే తీసుకొస్తా.. మీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటా’ అని హంతకులకు హరిబాబు భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారని, అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని అన్నారు. ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం.. రాజలింగమూర్తికి.. రేణికుంట్ల సంజీవ్, రేణికుంట్ల కొమురయ్య కుటుంబసభ్యులకు మధ్య భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం స్థలం విషయంలో వివాదం ఉండగా.. ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి.
రేణికుంట్ల సంజీవ్, అతడి కుటుంబ సభ్యులను మోసగించి కొంత భూమిని రాజలింగమూర్తి తన పేరుకు మార్చుకున్నారని నిందితులు ఆరోపిస్తున్నారు. దీంతో రాజలింగమూర్తిపై పగ పెంచుకున్న సంజీవ్.. అతడిని చంపితేనే భూమి తిరిగి తనకు దక్కుతుందని చెప్పేవాడు. సంజీవ్ సరైన అవకాశం కోసం వేచి చూస్తూ తన దగ్గరి బంధువుల సహాయాన్ని కోరాడు. తమకు కూడా భూమిలో వాటా వస్తుందన్న ఆశతో సాయం చేసేందుకు వారంతా అంగీకరించారు. సంజీవ్, అతడి బంధువులు తమ ప్లాన్‌ను కొత్త హరిబాబుకు చెప్పారు. అప్పటికే భూపాలపల్లి తహసీల్ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమిని తనకు బదిలీ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని రాజలింగమూర్తిపై హరిబాబు కోపంతో ఉన్నాడు. ఇదే అవకాశంగా భావించిన హరిబాబు.. రాజలింగమూర్తిని చంపితే వారికి బెయిల్ ఇప్పించి, ఖర్చులు కూడా చూసుకుంటానని నిందితులకు హామీ ఇచ్చాడు.
పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్..
పక్కా ప్లాన్ ప్రకారమే రాజలింగమూర్తిని నిందితులు హత్య చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. సుమారు 2 నెలల కిందటే వరంగల్ లోని కాశీబుగ్గలో సంజీవ్, మోరె కుమార్ 2 కత్తులు కొన్నారని, ఒక ఇనుప రాడ్‌ని సేకరించి సంజీవ్ ఇంట్లో దాచారని తెలిపారు. 2025 ఫిబ్రవరి 19న పాత కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్లిన సంజీవ్.. అక్కడ రాజలింగమూర్తి ఉండడాన్ని చూసి.. హత్యకు ప్లాన్ చేశాడు. రాజలింగమూర్తి కదలికలను వెంటవెంటనే తనకు తెలియజేయాలని దాసరి కృష్ణ, నరేశ్‌కు చెప్పాడు. రేణికుంట్ల సంజీవ్, కొత్తూరి కిరణ్, మోరె కుమార్, పింగిలి సేమంత్ (బబ్లు).. సంజీవ్ ఇంట్లో దాచిన కత్తులు, ఇనుప రాడ్‌ను తీసుకొని, రాజలింగమూర్తి ఇంటి దగ్గరకు వెళ్లారు. అంబేద్కర్ సెంటర్ లోని మెడికల్ షాపు నుంచి మూర్తి బయలుదేరినట్టు దాసరి కృష్ణ సమాచారం ఇచ్చాడు. సాయంత్రం 6:45 గంటలకు మూర్తి తన ఇంటి మలుపు దగ్గరకు రాగానే.. నిందితులు రేణికుంట్ల సంజీవ్, కొత్తూరి కిరణ్, మోరె కుమార్, బబ్లు అతడి మోటారుసైకిల్‌ను అడ్డుకుని.. కళ్లల్లో కారం కొట్టారు. అనంతరం కత్తులు, ఇనుప రాడ్‌తో రాజలింగమూర్తిపై దాడి చేశారు. కడుపులో కత్తులతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన రాజలింగమూర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రజలు గుమిగూడడంతో సంజీవ్, బబ్లు ఒకే బైక్‌పై పారిపోయారు. సంజీవ్.. తన బంధువు కల్వల శ్రీనివాస్ ఫోన్ నుంచి హరిబాబుకు కాల్ చేసి, హత్య గురించి చెప్పి పరకాల వైపు పారిపోయాడు.
5 ఇంక్లైన్ వద్ద అరెస్ట్
రాజలింగ మూర్తి హత్య కేసులోని ఏడుగురు నిందితులు శనివారం సాయంత్రం 6:30 గంటలకు 5 ఇంక్లైన్ చెక్ పోస్ట్ దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారని, హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, ఇనుప రాడ్, ఇతర ఆయుధాలను చూపించారని వెల్లడించారు. వారి నుంచి 7 మొబైల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లు, హత్య చేసినప్పుడు రక్తంతో తడిసిన బట్టలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో 10 మంది పాత్ర ఉందని, ఏడుగురిని అరెస్టు చేసి ఆదివారం భూపాలపల్లిలోని జేఎఫ్‌సీఎం జడ్జి ఎదుట హాజరుపరిచామని వివరించారు. పరారీలో ఉన్న ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. ఈ హత్య కేసు నిందితులు కొందరు ఇంతకుముందు వివిధ నేరాల్లో పాల్గొన్నారని, కొత్త హరిబాబు 10 నేరాల్లో ఉన్నాడని తెలిపారు. రేణికుంట్ల సంజీవ్ 10, రేణికుంట్ల కొమురయ్య 11, జెన్‌కో ఉద్యోగి మోరె కుమార్ 7, రేణికుంట్ల సాంబయ్య 5, దాసారపు క్రిష్ణ 2, పుల్ల నరేశ్ ఒక నేరం చేసినట్టు వెల్లడించారు.