- నిందితుడి అన్న మున్సిపల్ ఫ్లోర్‌లీడర్.. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిజామాబాద్/బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో13 ఏండ్ల నిరుపేద బాలికపై బీఆర్ఎస్ లీడర్ కొత్తపల్లి రవీందర్ అత్యాచారం చేశాడు. ఈ నెల19న దారుణం జరగగా, రెండు రోజులు ఆలస్యంగా బుధవారం ఈ విషయం బయటకు వచ్చింది. అత్యాచారం ఆరోపణలుఎదుర్కొంటున్న రవీందర్.. బోధన్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణకు తమ్ముడు. రేప్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధిత బాలిక తల్లిని పెట్రోల్ పోసి తగులబెడతానని రాధాకృష్ణ హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. బాధిత బాలిక కుటుంబం పట్టణంలోని శక్కర్ నగర్ లో నివసిస్తోంది. ఆమె తల్లి పక్షవాతంతో మంచం పట్టింది.
తల్లిదండ్రులు, అన్నదమ్ములు లేకపోవడం, పేదరికం వల్ల బాలిక తెలిసినవాళ్ల ఇండ్లకు వెళ్లి అడుక్కుంటూ తన తల్లిని పోషించుకుంటోంది. ఈ నెల19న మధ్యాహ్నం అన్నం అడుక్కోవడం కోసం బయటకు వెళ్లిన బాలికను రవీందర్ అడ్డగించాడు. ఎండ తీవ్రతతో బయట జన సంచారం లేకపోవడాన్ని అవకాశంగా తీసుకొని బాలికను సమీపంలోని గొర్రెల షెడ్డులోకి లాక్కెళ్లాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లూ చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో ఇల్లు చేరిన బాలిక తన తల్లికి, పొరుగువాళ్లకు విషయం చెప్పింది. రాధాకృష్ణ తన తమ్ముడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని, బాలిక తల్లిని పెట్రోల్ పోసి తగలబెడ్తానని బెదిరించాడని తెలిసింది. అయితే, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితుడు రవీందర్, అతని అన్న రాధాకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే షకీల్ పరామర్శ
అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే షకీల్, ఆయన భార్య ఆయేషా బేగం, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఉరిశిక్ష విధించాలన్నారు. తండ్రి, అన్నదమ్ములు ఎవరూ లేని ఆ బాలికకు ఆయేషా ఫౌండేషన్ నుంచి ప్రతినెలా ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్రాధాకృష్ణను, అతని తమ్ముడు రవీందర్‌ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.