బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్​

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్​
  • ఓయూపై ఫేక్​ న్యూస్​ స్ప్రెడ్ చేస్తున్నారని కేసు

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లు, మెస్​ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్​చార్జ్ మన్నె క్రిశాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్రిశాంక్, ఓయూ ఓల్డ్ స్టూడెంట్ నాగేందర్ కలిసి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

క్రిశాంక్​ను తొలుత చౌటుప్పల్ పోలీసు స్టేషన్​కు.. అక్కడ నుంచి నేరుగా ఓయూ పీఎస్​కు తరలించారు. యేటా ఎండాకాలంలో అధికారులు ఓయూ హాస్టళ్లు, మెస్​ల మూసివేతపై ముందస్తుగా సర్క్యూలర్లు జారీ చేసి అటు తరువాత హాస్టళ్లను ఖాళీ చేయించి భవనాల రిపేర్లు, ఇతర పనులు చేపడుతుంటారు. ఇదే క్రమంలో ఈ సారి కూడా హాస్టళ్ల మూసివేతపై ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తాము జారీ చేసిన సర్క్యూలర్ కు బదులుగా ఫేక్ సర్క్యూలర్ ను తయారుచేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా న్యూస్ స్ర్పెడ్ చేస్తున్న క్రిశాంక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ ఫేక్ అని, దానిపై నంబరు కూడా పెన్నుతో రాశారని, తన సంతకాన్ని సైతం కాపీ చేశారని ఓయూ చీఫ్​ వార్డెన్ శ్రీనివాస్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు క్రిశాంక్​పై ఐపీసీ సెక్షన్ 466, 66, 468, 505(1) కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియో తయారీలో కీలకంగా వ్యవహరించిన నాగేందర్​పై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. క్రిశాంక్ పై ఓయూ పోలీసుస్టేషన్లో నమోదు చేసిన కేసుతో పాటు మరో నాలుగు కేసులు కూడా ఉన్నట్లు.. ఆ కేసులన్నింటిపై కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది.

ఓయూ పీఎస్​ను సందర్శించిన సిటీ సీపీ

రెండురోజులుగా ఓయూ హాస్టళ్ల మూసివేత అంశం సంచలనంగా మారడంతో బుధవారం సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఓయూను సందర్శించారు. ఓయూలో పరిస్థితులను అక్కడి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్న సీపీ... పరిస్థితిని సమీక్షించినట్లు తెలిసింది. ఓయూ పీఎస్ ను సీపీ సందర్శించడానికి ముందే పంతంగి వద్ద పోలీసులు క్రిశాంక్​ను అరెస్టు చేసి ఓయూ పోలీసు స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.