- మోదీ, రేవంత్‌పై చర్యలెందుకు తీసుకోలే
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ప్రధాని నరేంద్ర మోదీ గుప్పిట్లో ఉందని, బీజేపీ కనుసన్నల్లో ఈసీ పని చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా 48 గంటల బ్యాన్ విధించడంపై ఆయన మండిపడ్డారు. తాము మాట్లాడేవి బూతుల్లాగా.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడేవి ప్రవచనాల్లాగా వినిపిస్తున్నాయా అని ఈసీని ఆయన ప్రశ్నించారు.
నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఈసీ.. ఒక పార్టీ, కొంత మంది వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్, కాంగ్రెస్, బీజేపీ నేతలపై తాము ఇప్పటి వరకూ ఈసీకి 27 ఫిర్యాదులు చేశామని, అందులో ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ‘‘రైతులు, నేతన్నల ఆవేదన చూసి కేసీఆర్ ఒక్క పరుష పదం వాడినందుకే ఏవో కొంపలు మునిగినట్టు ఆయనపై ఆగమేఘాల మీద ఈసీ చర్యలు తీసుకున్నది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
క్రిశాంక్ పై కుట్ర పన్ని జైలుకు పంపారు
తమ పార్టీ లీడర్ మన్నె క్రిశాంక్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించారని కేటీఆర్ ఆరోపించారు క్రిశాంక్‌పై కుట్రపూరితంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని ఆయన తెలిపారు. ఈ విషయంలో తాము కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తామన్నారు.