- అక్రమాలు బయట పడుతున్నా.. అహంకారం తగ్గుతలేదు
- బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థలన్నీ సర్వ నాశనం
- స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్
జనగామ, వెలుగు : బీఆర్ఎస్ నేతల అక్రమాలు బయటపడుతున్నా అహంకారం తగ్గుతలేదని, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ – ఫార్ములా కార్ రేసింగ్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ది క్విడ్ ప్రో కోనేనని ఆరోపించారు. శుక్రవారం జనగామ మండలం యశ్వంతాపూర్శివారు సత్యసాయి కన్వెన్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ – ఫార్ములా కారు రేసింగ్‌కు సుమారు రూ. 55 కోట్లు రూల్స్‌కు విరుద్ధంగా ఎవరికో డబ్బు పంపిస్తే సదరు లబ్ధి పొందిన వ్యక్తి రూ. 40 కోట్లతో బీఆర్ఎస్ఎలక్షన్బాండ్లు కొన్నాడన్నారు. ఇది బాగా చదువుకున్న కేటీఆర్‌కు క్విడ్ ప్రో కో అని తెలియదా..? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో లిక్కర్‌స్కామ్ లో తీహార్‌జైలుకు వెళ్లి కవిత తెలంగాణ పరువు తీశారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ దుష్ర్పచారం చేస్తుందని, దీన్ని పార్టీ శ్రేణులు గట్టిగా ఎదుర్కొవాలని సూచించారు. నియోజకవర్గానికి వివిధ పనులకు ఏడాదిలోనే రూ.750 కోట్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసే నాయకులే తన బంధువులని, వారికే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టంచేశారు. మాటలతో కాలం గడుపుతామంటే తన వద్ద ఆటలు సాగవని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం లేకుండా పోయే కుట్రలు జరుగుతున్నాయి. కేసుల నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్, బీజేపీ జైలు బంధం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేయాలని డీసీసీ ప్రెసిడెంట్కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ అగ్రికల్చర్మార్కెట్కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.