రిటైర్​ అయినా వదలం.. జాగ్రత్త .. పోలీసులకు బీఆర్ఎస్​ నేత ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ వార్నింగ్​

రిటైర్​ అయినా వదలం.. జాగ్రత్త .. పోలీసులకు బీఆర్ఎస్​ నేత ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ వార్నింగ్​

హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్​ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ​ నేత ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్​​ హెచ్చరించారు. కాంగ్రెస్​ నేతలు చెప్పినట్టు, గాంధీభవన్​ నుంచి వచ్చిన స్క్రిప్ట్​కు తగ్గట్టు తమపై కేసులు పెడితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని, అప్పుడు వాళ్లందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

రిటైర్​అయి వెళ్లిపోయినా.. ట్రాన్స్​ఫర్​ అయి వేరేచోటుకు పోయినా వదిలిపెట్టబోమని వార్నింగ్​ ఇచ్చారు. పోలీసుల అక్రమ కేసులపై ట్రిబ్యునల్​ వేస్తామని, జీవించే హక్కును ఉల్లంఘించిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. శనివారం  హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తమకు ఏ ఫేవర్​ చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘దండం పెట్టి చెప్తున్నా.. డ్యూటీని నిబంధనలకు అనుగుణంగా చేయండి. అలాంటి వారికి మా ప్రభుత్వంలో మెడల్స్​ ఇస్తాం’’  అని పేర్కొన్నారు.   రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస, రాబందుల పాలన నడుస్తున్నదని మండిపడ్డారు.  రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి​ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. 

సోషల్​ మీడియాలో ప్రశ్నిస్తే టార్గెట్​ చేస్తున్నారు

సోషల్​ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్​ టార్గెట్​ చేస్తున్నారని ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు. సైబర్​ నేరగాళ్ల నుంచి ప్రజలు, ప్రభుత్వ శాఖలు, కంపెనీలను కాపాడటానికి ఏర్పాటు చేసిన సైబర్​ సెక్యూరిటీ బ్యూరోను.. రేవంత్​ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. దానిని బీఆర్ఎస్​ సోషల్​ మీడియాపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. కొందరు సైబర్​ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. రేవంత్​ తొత్తులుగా పనిచేస్తూ కాపీ పేస్ట్​ ఎఫ్ఐఆర్​లను నమోదు చేస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్​ రావును పెట్రోల్​ పోసి చంపుతామన్న కాంగ్రెస్​ నేత మైనంపల్లిపై పోలీసులు కేసు ఎందుకు పెట్టలేదని ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ప్రశ్నించారు.