- గురుకులాల తనిఖీలాగా లేదు: ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల స్కూళ్లలో ఇప్పటిదాకా 53 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్‌ఎస్‌నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురుకులాల బడిబాటకు వెళ్లిన తమపై ప్రభుత్వం కేసులు పెట్టిందని, తాము వెళ్లకుండా స్కూళ్ల వద్ద బోర్డులు పెట్టించిందని తెలిపారు. కేసీఆర్‌కు తాము రిపోర్ట్ ఇచ్చాక.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందని చెప్పారు. పిల్లలు చనిపోయినా కదలని ప్రభుత్వం.. ఇప్పుడు హడావుడిగా గురుకుల స్కూళ్లకు వెళ్లారని పేర్కొన్నారు. అది గురుకులాల తనిఖీలా లేదని, మంత్రులతో కలిసి సీఎం పిక్నిక్వెళ్లినట్టుగా ఉందని విమర్శించారు.
ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతి రెండో శనివారం పిల్లలను చూసేందుకు తల్లులకు మాత్రమే అనుమతించాలంటూ అన్ని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు ప్రభుత్వం మెసేజ్ పంపిందని ఆరోపించారు. పిల్లలను తండ్రి చూడకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కేవలం తల్లులనే అనుమతించాలనడం వెనుక అంతర్యమేంటని నిలదీశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ను ప్రభుత్వ కార్యక్రమానికి కనీసం ఆహ్వానించలేదన్నారు. ప్రొటోకాల్‌ను పాటించడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే డైట్ చార్జీలను రూ.1500కు పెంచారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పిల్లలకు సన్న బియ్యంతో అన్నం పెట్టామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన మెనూకు.. కాంగ్రెస్ తెచ్చిన కొత్త మెనూకు ఎలాంటి తేడా లేదని ఆయన వివరించారు.