అలిగి అమెరికా.. విమానమెక్కిన సత్తన్న!

నిర్మల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో బలమైన బీసీ నేతగా, సీఎం కేసీఆర్ స్వయంగా సత్తన్న అని పిలుచుకునేంతగా చనువున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ శోభ భర్త సత్యనారాయణ గౌడ్ ఉన్నట్టుండి అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశమ వుతోంది. గత కొంతకాలం నుంచి ఇక్కడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సత్యనారాయణ గౌడ్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

ఓ దశలో ఆయన పార్టీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరిగింది. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో సత్యనారాయణ గౌడ్  ముందు వరుసలో  నిలుస్తారు. ఆయనకు నిర్మల్, సోన్, లక్ష్మణచాంద  తదితర మండలాల్లో బలమైన అనుచర వర్గం ఉంది. బీసీ కులాల్లో కూడా కొంతమేర పట్టు ఉంది. అలాంటి నేతను మంత్రితో పాటు అధిష్టానం సైతం కొంత కాలం నుంచి నిర్లక్ష్యం చేస్తుండడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. అలాగే ఆయన మొదటి నుంచి ఎమ్మెల్సీ పదవి లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశించారు. 

ఈ విషయంలో కూడా సత్యనారాయణ గౌడ్ ను  పార్టీ పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే అధిష్టానంతో పాటు కొంతమంది సీనియర్ నేతలు పార్టీలో సర్దుకుపోవాలని సత్యనారాయణ గౌడ్ ను ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం నిర్మల్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ సత్యనారాయణ గౌడ్ తో కొంతసేపు మాట్లాడి భవిష్యత్తులో న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ స్థానికంగా మంత్రితో పాటు కొంతమంది సీనియర్ నేతలు సత్యనారాయణ గౌడ్ ను పెద్దగా పట్టించుకోవడం  లేదని ఆయన అనుచరులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇదే టైంలో నిర్మల్​ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. 

దీంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేక అలాగే మరో పార్టీలో చేరలేక అలిగి, అసంతృప్తితో అమెరికా పయనమయ్యారు. అమెరికా నుంచి ఆయన ఎప్పటిలోగా తిరిగి వస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులంతా ప్రస్తుతం అయోమయానికి గురవుతున్నారు.