కరీంనగర్ క్రైం, వెలుగు : నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్లను కూల్చివేయడమే కాకుండా భూమిని కబ్జా చేసిన కేసులో బీఆర్ఎస్ లీడర్, ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతిరావును కరీంనగర్ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని వివేకానందపురి కాలనీకి చెందిన అనుమాండ్ల రవీందర్ 2014లో తీగలగుట్టపల్లి ప్రాంతంలోని కార్తికేయనగర్ లో 233/ఈ సర్వే నంబర్లో 144 చదరపు గజాల స్థలాన్ని కొన్నారు. ఈ స్థలానికి బేస్మెంట్కట్టుకుని నిరుడు నవంబర్ లో బోర్ వేయించాడు. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తెచ్చుకుని పని మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే జనవరి 10న రాత్రి 10.30 గంటల సమయంలో సుమారు 12 మంది గుర్తు తెలియని వ్యక్తులు రవీందర్ ఇంటి నిర్మాణ స్థలంలోకి చొరబడి 8 పిల్లర్లతో సహా అప్పటికే నిర్మించిన నీటి సంపు, మెటీరియల్‌ను ధ్వంసం చేశారు. దీంతో సుమారు రూ.4 లక్షల నష్టం కలిగింది. రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా విచా రణ జరిపారు. దర్యాప్తులో కరీంనగర్ చైతన్యపురి కాలనీకి చెందిన తోట శ్రీపతి రావు, పొన్నాల కనకయ్య, పవన్, సిరిపురం వెంకటరాజు కొంతమంది మనుషులను మాట్లాడి పిల్లర్లను కూల్చివేయించినట్లు తెలుసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీపతిరావు హైదరాబాద్ అంబర్ పేటలోని అతడి సోదరుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించి సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున కరీంనగర్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.