నియోజకవర్గాల పునర్విభజన చేయించండి : బి.వినోద్‌‌‌‌ కుమార్

నియోజకవర్గాల పునర్విభజన చేయించండి : బి.వినోద్‌‌‌‌ కుమార్
  •     సీఎం రేవంత్‌‌‌‌కు బీఆర్ఎస్ నేత వినోద్‌‌‌‌ కుమార్ సూచన

హైదరాబాద్, వెలుగు : తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేత బి.వినోద్‌‌‌‌ కుమార్ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే రాష్ట్ర శాసనమండలి ఉనికి ప్రమాదంలో పడుతుందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం శాసన మండలి ఏర్పాటుకు కనీసం 40 సీట్లు ఉండాలని, మండలిలో గరిష్ట సీట్ల సంఖ్య అసెంబ్లీ సీట్లలో మూడో వంతుకు మించకూడదన్న నిబంధన ఉందని గుర్తుచేశారు.

రాష్ట్ర అసెంబ్లీలో ఇదివరకు 120 సీట్లు (119 నియోజకవర్గాలు, ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే) ఉండడంతో, అందులో మూడో వంతు (40) సీట్లతో మండలిని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కానీ, ఇప్పుడు ఆంగ్లో ఇండియన్‌‌‌‌ను అసెంబ్లీకి నామినేట్ చేసే పద్ధతి రద్దు కావడంతో, అసెంబ్లీ సీట్ల సంఖ్య 119కి తగ్గిందని, దీంతో మండలిలో 40 సీట్లు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 39 సీట్లతో శాసన మండలిని నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు.